మునిసిపల్ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు
ABN , Publish Date - Feb 09 , 2026 | 12:39 AM
మునిసిపల్ ఎన్నికల సమయం సమీపించింది. ఈనెల 11న ఎన్నికలు జరగనుండగా, 9వ తేదీ సా యంత్రం 5గంటలతో ప్రచారం బంద్‌కానుంది.
సుమారు 1,250 మంది పోలీసులు
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా
(ఆంధ్రజ్యోతి,సూర్యాపేటక్రైం): మునిసిపల్ ఎన్నికల సమయం సమీపించింది. ఈనెల 11న ఎన్నికలు జరగనుండగా, 9వ తేదీ సా యంత్రం 5గంటలతో ప్రచారం బంద్‌కానుంది. జిల్లాలోని ఐదు మునిసిపాలిటీలు సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి, నేరేడుచర్లలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేయగా, పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు.
జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఇప్పటికే మునిసిపాలిటీల్లో పోలీస్ అధికారులు, కళాజాతాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ఎన్నికల్లో సుమారు 1,250 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం, ఇతర తాయిలా పంపిణీ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీ బృందాలు ప నిచేస్తున్నాయి.బైండోవర్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే లైసెన్స్ ఉన్న 71 ఆయుధాలను డిపాజిట్ చేయించారు.
తనిఖీ బృందాల ఏర్పాటు
మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి ఎస్పీ నరసిం హ ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. మునిసిపాలిటీల సరిహద్దు ప్రాంతాల్లో ఈ బృందాలు నిరంత రం తనిఖీలు చేస్తున్నాయి. మద్యం, నగదు రవాణా కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లోకి వచ్చే ప్రతీ వాహనాన్ని వ్యక్తులను పూర్తిస్థాయి తనిఖీ తర్వాతే అనుమతిస్తున్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు
జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీస్ అధికారులు గుర్తించా రు. మొత్తం 115 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్న ట్లు గుర్తించారు. జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల పరిధిలో 141 వార్డుల్లో ఎన్నికలు జరగనుండా, అందుకు అధికారులు 372 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుం డా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా వార్డుల్లో ఇది వరకు కేసులు నమోదైన వ్యక్తులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వారితో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఆయా వార్డుల్లోని యువత, పెద్దలతో మాట్లాడి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ, పోలింగ్‌పై కళాజాత ప్రదర్శన ద్వారా పట్టణాల్లో ప్రచారం చేశారు. ఓటు ప్రాముఖ్యం తెలపడంతో పాటు ఎన్నికల్లో ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరిస్తే ఎలాంటి కేసులు నమోదు చేస్తారో అవగాహన కల్పించారు. గతంలో కేసులు నమోదైన వారు మళ్లీ ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ముందస్తుగా రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు పూచీకత్తుతో బైండోవర్ చేయించారు. జిల్లా వ్యాప్తంగా ఐదు మునిసిపాలిటీ పరిధిలో ఇప్పటి వరకు 450 మందిని బైండోవర్ చేశారు.
1,250 మందితో బందోబస్తు
జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల పరిధిలో ఎన్నికలు జరిగే 141 వార్డుల్లో సుమారు 1,250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతీ మునిసిపాలిటీకి ఒక అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారిని స్పెషల్ స్ర్టైకింగ్ ఫోర్స్ అధికారిగా నియమించారు. బందోబస్తులో నలుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 50 మంది ఎస్‌ఐలు, 250 మంది ఏఎ్‌సఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 760 మంది కానిస్టేబుళ్లు, 152 మంది హోంగార్డులు, మహిళా సిబ్బంది 90మందితో కలిపి 1,250 మంది బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. వీరితో పాటు స్ర్టైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ర్టైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్స్ టీంలు, ప్రతీ మునిసిపాలిటీకి మూడు చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, రెండు చొప్పున స్టాటస్టికల్ సర్వేలైన్స్ టీంలు, ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీంలు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. సమస్యాతమ్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పాటు వీడియో రికార్డింగ్ చేయనున్నారు.
కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతర పర్యవేక్షణ
జిల్లా పోలీస్ కార్యాలయంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం ద్వారా ఎన్నికలు జరిగే ఐదు మునిసిపాలిటీల్లో నిరంతరం ప్రత్యేక పర్యవేక్షణ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణ నుంచి ఎన్నికల సామగ్రికి భద్రత కల్పించే వరకు ప్రతీ అంశాన్ని ప్రణాళికాబద్ధంగా పర్యవేక్షణ చేయనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌రూం నుంచి పర్యవేక్షణ చేయనున్నారు.
ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు
కొత్తపల్లి నరసింహ, ఎస్పీ
జిల్లాలో మునిసిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాం. పోలింగ్ కేంద్రాల వారీగా బందోబస్తు ఏర్పాటు చేశాం. ప్రత్యేక తనిఖీ బృందాలతో పాటు పోలీ్‌సస్టేషన్ల వారీగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా స్పందించి వెళ్లే విధంగా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశాం. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి. ప్రచారం సమయం ముగిసిన తర్వాత ఎవరైనా ప్రచారంచేస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు తర్వాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచాలు కాల్చడం, డీజేలకు అనుమతులు లేవు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.