శ్మశానాన్ని రాసిచ్చేశారు
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:12 AM
పెద్దమనుషులందరూ కలిసి శ్మశానవాటికను రాసిచ్చారు. ఇది వినడానికి విచిత్రంగా అనిపించినా నిజం.
(ఆంధ్రజ్యోతి-త్రిపురారం)
పెద్దమనుషులందరూ కలిసి శ్మశానవాటికను రాసిచ్చారు. ఇది వినడానికి విచిత్రంగా అనిపించినా నిజం. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని కోమటిగూడెం గ్రామ ప్రజలు 40ఏళ్లుగా సర్వే నెంబరు 275లో ఎకరం విస్తీర్ణం గల ప్రభుత్వ భూమిని శ్మశానంగా వాడుకుంటున్నారు. ఆ స్థలం పక్కన దుగ్గేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి అదే సర్వే నెంబరులో 2.18ఎకరాల భూమి ఉంది. అతడి భూమికి శ్మశానానికి మధ్యలో సుమారు ఏడు ఎకరాల వరకు ఏనే భూమి ఉంది. ఆ మొత్తం భూమిని కబ్జా చేసి ఏళ్ల తరబడి పంట పండించుకుంటున్నాడు. పక్కన ఉన్న శ్శశానస్థలాన్ని కబ్జా చేయడానికి కొన్నేల్లుగా తీవ్రప్రయత్నాలు చేస్తుండటంతో గ్రామస్థులు పలుసార్లు అడ్డుకుని, అధికారులకు ఫిర్యాదు చేయడంతో వెనక్కి తగ్గాడు.
పెద్దమనుషుల సమక్షంలో
కబ్జా చేసిన వ్యక్తి కంపాసాగర్, దుగ్గేపల్లి గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులను, కోమటిగూడెంలోని కొంతమందిని మచ్చిక చేసుకుని కబ్జాకు పాల్పడుతున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఆ పెద్దమనుషుల సమక్షంలో రాళ్లు, కాల్వ కట్ట వంటి పనికిరాని 10గుంటల భూమిని శ్మశానానికి వదిలి మిగతా 30గుంటల భూమికి కడీలు నిలబెట్టి హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా ఓ ఒప్పందపత్రం రాసుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు శ్మశానస్థలాన్ని కబ్జాను తొలగించి సర్వే చేసి హద్దులు ఏర్పాటుచేయాలని మంగళవారం తహసీల్దార్‌కు ఫిర్యాదుచేశారు. ఈ విషయమై తహసీల్దార్ ప్రమీల వివరణ కోరగా గ్రామస్థుల ఫిర్యాదుమేరకు శ్మశానంలో పాతిన రాళ్లు తొలగించి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఫిర్యాదు చేసినా ఫలితంలేదు
శ్మశానాన్ని కబ్జా చేయడమే కాకుండా పెద్దమనుషులు సమక్షంలో ఒప్పందంపత్రం రాసుకున్నారు. పలుమార్లు ఆక్రమణలను అడ్డుకున్నాం. శ్మశనానికి సర్వేచేసి హద్దులు ఏర్పాటుచేయాలి. అధికారుల నిర్లక్ష్యంతోనే శ్మశానవాటిక ఆక్రమణలకు గురవుతోంది.
హనుమంతు శంకర్, కోమటిగూడెం