Share News

వ్యవసాయరంగ సంక్షోభంపై సమరశీల ఉద్యమాలు చేయాలి

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:46 PM

భారతదేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై సమరశీల రైతు ఉద్యమాలు చేయాలని, రైతుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతినేని సుదర్శన, తీగల సాగర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.

వ్యవసాయరంగ సంక్షోభంపై సమరశీల ఉద్యమాలు చేయాలి
నల్లగొండ జిల్లా కేంద్రంలో రైతు సంఘం జిల్లా మహాసభలో మాట్లాడుతున్న సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన

నల్లగొండ రూరల్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): భారతదేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై సమరశీల రైతు ఉద్యమాలు చేయాలని, రైతుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతినేని సుదర్శన, తీగల సాగర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా 24వ మహాసభలు నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన హాల్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పండించిన పంటలకు మద్దతు ధరల చట్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్న కాంగ్రెస్‌ హామీ నెరవేరలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పంటల కొనుగోలు యాప్‌లు, యూరియా అమ్మకం యాప్‌ లు తెచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. రైతులను, ప్రజలను రక్షించుకోవడానికి అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ఉద్యమం చేయాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదని, ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, పాలకుల నిర్లక్ష్యం మరోవైపు రైతులను అప్పుల ఊబీలోకి నెడుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో గడిచిన మూడేళ్లలో జరిగిన పోరాటాలను సమీక్షించుకోవడానికి, భవిష్యత కార్యాచరణను రూపొందించుకోవడానికి ఈ మహాసభలు ఒక వేదిక కానుందని అన్నారు. పండించిన ప్రతి గింజకూ స్వామినాథన కమిషన సిఫార్సుల మేరకు మద్దతు ధర కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ అమలు కాకపోవడం, బ్యాంకుల వేధింపులపై చర్చ జరుగుతుందని అన్నారు. పోడు సాగుదారులకు హక్కు పత్రాల పంపిణీలో జరుగుతున్న జాప్యంతో అటవీ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. అసలైన సాగు దారులైన కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, ప్రభుత్వ పథకాలు వారికి అందేలా చూడాలని అన్నారు. దేశవ్యాప్త రైతు ఉద్యమ అనుభవాలను, ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిణామాలను వివరిం చారు. గత మూడేళ్లలో మండలాల వారీగా జరిగిన ఉద్యమాలను సమీక్షించి భవిష్యత కర్తవ్యాలను రూపొందించుకున్నారు. మహాసభల ప్రారంభ సూచికంగా సంఘం జెండాను ఆవిష్కరణ రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన ఆవిష్కరించారు. ఈ మహాసభలో రైతు సంఘం నాయకులు వి వెంకటేశ్వర్లు, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి , బండా శ్రీశైలం, కందాల ప్రమీల, దేవిరెడ్డి అశోక్‌రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, చలకని మల్లయ్య, కత్తి శ్రీనివాస్‌ రెడ్డి, అయితరాజు నరసింహ, మారయ్య, ముత్తిలింగం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 11:46 PM