Share News

ఎన్నికలంతా తాయిలాల చుట్టే

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:51 AM

ప్రజలకు మౌలిక వసతుల కల్పన, పట్టణాభివృద్ధి చేపట్టాల్సిన గురుతర బాధ్యత పురపాలక సంఘాల పాలకవర్గాలపై ఉంటుంది. అయితే సమస్యలను తీర్చే పాలకవర్గాలను ఎన్నుకునే బాధ్యత ప్రజల ది. కానీ, ప్రస్తుత ఎన్నికలు సమస్యలకంటే తాయిలాల చుట్టే తిరుగుతున్నాయి.

ఎన్నికలంతా తాయిలాల చుట్టే

ఓటర్ల మనోగతానికి అనుగుణంగా అభ్యర్థుల సన్నద్ధం

ఖరీదైన మద్యంతో విందులు

ఓటుకు ఎంతస్తారనేదే ప్రధాన చర్చ

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): ప్రజలకు మౌలిక వసతుల కల్పన, పట్టణాభివృద్ధి చేపట్టాల్సిన గురుతర బాధ్యత పురపాలక సంఘాల పాలకవర్గాలపై ఉంటుంది. అయితే సమస్యలను తీర్చే పాలకవర్గాలను ఎన్నుకునే బాధ్యత ప్రజల ది. కానీ, ప్రస్తుత ఎన్నికలు సమస్యలకంటే తాయిలాల చుట్టే తిరుగుతున్నాయి. బస్తీ, వాడల్లో సమస్యలపై అభ్యర్థులను ఓటర్లు ప్రశ్నించడం మానేశారు. ఎవరు ఎంత ఇస్తున్నారనే చర్చపైనే ప్రధాన దృష్టిసారించారు.

మునిసిపల్‌ ప్రచారాన్ని అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. ప్రజలు అడగడం లేదుకదా అని పట్టణ సమస్యలు పట్టించుకోకుండా అది చే స్తాం.. ఇది చేస్తాం అనే హామీలు ఇవ్వడం మరిచారు. కేవలం ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యర్థి ఎంత ఇస్తున్నాడో ఆరా తీసి అంతకు మించి ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తాయిలా లే గెలుపును నిర్దేశిస్తాయని అభ్యర్థులు ఓ నిశ్చయానికి వచ్చి అందుకు అనుగుణంగా సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లోని 102 వార్డుల్లో మూడు రోజులుగా ప్రచారం హోరెత్తుతోంది.

ప్రధాన పార్టీల ముఖ్య నాయకులు, అభ్యర్థులతో కలిసి ఓటు అభ్యర్థిస్తున్నారు. పార్టీ రాష్ట్రస్థాయి విధానాలు తప్ప, వార్డు, పట్ణణాన్ని ఎలా అభివృద్ధి చేస్తామో.. మౌలిక సదుపాయాల కల్పన ఏమిటో చెప్పడం లేదు. అయితే వార్డుల్లో ఓటర్లు సైతం వారికి కావల్సిన సదుపాయాలు, ఎదుర్కొంటున్న సమస్యలను ఓటు కోసం వచ్చిన నేతలను అడగని విచిత్ర పరిస్థితులు ప్రస్తుత ఎన్నికల్లో నెలకొన్నాయి.

ఈసారి బంగారం, వెండి కానుకల ముచ్చట లేదు

మునిసిపల్‌ ఎన్నికల్లో గతం కంటే భిన్నమైన అంశం బంగారు, వెండి కానుకల మాట లేదు. గత మునిసిపల్‌ ఎన్నికల్లో యాదగిరిగుట్ట, భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్‌ వంటి ప్రాంతాల్లో స్థితిమంతులైన అభ్యర్థులు గెలుపే ధ్యేయంగా ఖరీదైన కానుకలు అందజేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిన ఘటనలు ఉన్నాయి. ప్రధానంగా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఓటుకు 2గ్రాముల నుంచి 5గ్రాముల వరకు బంగారు నాణేలు, వెండి పట్టీలు, కుంకుమ భరిణెలు అందించిన సంఘటనలు ఉన్నాయి. అయితే తాజాగా, బంగారం ధరలు రాకేట్‌లా ఆకాశంలోకి దూసుకువెళ్లడంతో అభ్యర్థులు ఆ కానుకల మాట ఎత్తడం లేదు.

ఏ మందు? ఓటుకు ఎంత?

మునిసిపల్‌ ఎన్నికల ప్రచారం అభ్యర్థుల పరిచయం, పార్టీ గుర్తుకే పరిమితమైంది. ప్రచారానికి వచ్చిన అభ్యర్థులు ఏ రకం మద్యం, ఓటుకు ఎంత మేర ధర నిర్ణయించి నోటు పంపిణీ చేస్తారని ఓటర్లు ఆరా తీయడమే ఎక్కువగా సాగుతోంది. జిల్లా కేంద్రంలోని భువనగిరి మునిసిపాలిటీల్లోని పలు వార్డులో మద్యం పంపిణీ ఇప్పటికే ప్రారంభమైంది. ఓటర్లకు కులాలు, వాడలు, ఆయా ప్రాంతాల వారీగా మద్యం, మాంసంతో విందులను అభ్యర్థులు ఏర్పాటు చేస్తున్నారు. పేదవర్గాల ప్రజలు వారి చిన్నపాటి అవసరాల కోసం ఓటు అవసరమైన అభ్యర్థులను చేబదులు పేరుతో నోటు వసూలు కార్యక్రమాన్ని సైతం ప్రారంభించారు. భువనగి రి, చౌటుప్పల్‌, యాదగిరిగుట్ట వంటి పట్టణాల్లో ఓటుకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు పంపిణీ జరుగుతుందనే ప్రచారం జోరందుకుం ది. ఇప్పటికే యాదగిరిగుట్ట పట్టణంలో ఖరీదైన మద్యం సీసాలే కాదు.. కుక్కర్లు, బియ్యం బస్తా ల పంపిణీ కూడా చేస్తున్నట్టు సమాచారం. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగిసి, మద్యం దుకాణాలు సైతం మూసివేయనుండటంతో జిల్లా వ్యాప్తంగా ఆరు ముసినిపాలిటీలో ని అభ్యర్థులు సైతం ముందు జాగ్రత్తగా పెద్ద మొత్తంలో మద్యం నిల్వలు చేసినట్టు వినికిడి. ఈ మద్యంలో కూడా ఓటర్లు విదేశీ స్కాచ్‌ మద్యం సీసాలనే డిమాండ్‌ చేస్తున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. దీంతో కేవలం 1,300 నుంచి 1,400 వరకు ఓటర్లు ఉన్న వార్డులో తాయిలాలు, నగదు పంపిణీతో తక్కువలో తక్కువ రూ.25లక్షలపైగా సమకూర్చుకోవాల్సి వస్తోందని కొందరు అభ్యర్థులు వాపోతున్నారు. చైర్మన్‌ పదవి ఆశావహులు, ఆర్థికంగా స్థితిమంతులు పోటీచేసే వార్డులో వ్యయం రూ.కోటి వరకు దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు.

జిల్లాలోని ఒక మునిసిపాలిటీలో చైర్మన్‌ పదవి ఆశిస్తున్న ఓ అభ్యర్థిని ఓడించేందుకు ప్రత్యర్థులే కాదు, సొంత పార్టీలోని పోటీ ఆశావహులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తుండటంతో సదురు అభ్యర్థి చాకచక్యం ప్రదర్శించి ఏకగ్రీవానికి స్కెచ్‌ వేశారు. ఓటర్లకు నజరానాతో పాటు ఓటుకు రూ.10వేల వరకు నగదు పంపిణీ వంటి వాటితో గెలిచే టెన్షన్‌ కంటే ప్రత్యర్థి అభ్యర్థి ఉపసంహరణకు పెద్ద మొత్తం ముట్టజెప్పినట్టుగా ప్రచారం సాగుతోంది. జిల్లాలోని ఏ మునిసిపాలిటీ, ఏ వార్డు చూసినా ఓటుకు ఎంత నగదు పంపిణీ చేస్తారనే చర్చ తప్ప, సమర్థులైన అభ్యర్థులెవరు అని పట్టించుకునే నాథుడే కరువయ్యారని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 07 , 2026 | 12:51 AM