Share News

‘భగీరథ’ జలం వృథాగా..

ABN , Publish Date - May 10 , 2026 | 11:50 PM

మండు వేసవి..తాగునీటికోసం అల్లాడే గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో మిషన భగీరథ నీరు పైప్‌లైన లీకేజీల కారణంగా వృథా అవుతోంది.

‘భగీరథ’ జలం వృథాగా..

తరచూ పైప్‌లైన లీకేజీలు

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, గ్రామస్థులు

(ఆంధ్రజ్యోతి-తుర్కపల్లి): మండు వేసవి..తాగునీటికోసం అల్లాడే గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో మిషన భగీరథ నీరు పైప్‌లైన లీకేజీల కారణంగా వృథా అవుతోంది. వృథాను అరికడితే ప్రజల దాహార్తి సమస్య తీరుతుందని ప్రజలు భావిస్తున్నారు. మిషన భగీరథ పైప్‌లైన లీకేజీల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తుర్కపల్లి, వాసాలమర్రి, మల్కాపూర్‌ గ్రామాల మధ్య గుట్టల పైన నిర్మించిన జీఎల్‌బీఆర్‌(గ్రౌండ్‌ లెవల్‌ బ్యాలన్సింగ్‌ రిజర్వాయర్‌) ట్యాంక్‌ నుంచి ఏర్పాటు చేసిన మెయిన పైపు లైన గుండా యాదగిరిగుట్ట, ఆలేరు, గుండాల, రాజాపేట మండలంలోని కొన్ని గ్రామాలకు మిషన భగీరథ పథకం ద్వార తాగు నీటిని సరాఫరా చేస్తున్నారు. ఈ రోడ్డు తుర్కపల్లి నుంచి రాజాపేట మండలానికి, యాదగిరిగుట్ట దేవస్థానానికి వెళ్లడానికి ప్రధాన రోడ్డు కావడంతో వాహనాల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా చేపట్టిన పనుల కారణంగా ఈ పైపు లైన రోడ్డు మధ్యలోకి పోయింది. ఈ రోడ్డు పనుల కారణంగా మండలంలోని వెంకటాపూర్‌ గ్రామంలో మెయినపైపు లైనకు 10నుంచి 12కు పైగా లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో వేంకటగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ముఖ ద్వారం పక్కన ఏర్పడ్డ గుంత కుంటను తలపిస్తోంది. శ్మశాన వాటిక సమీపంలో లీకేజీ నీటిని శ్మశాన వాటిక గుండా కాలువ ద్వారా ప్రక్కనే ఉన్న చెరువులోకి పంపిస్తున్నారు. ఈ రోడ్డుపైన పైప్‌లైన లీకేజీ కారణంగా గ్రామస్థులు, వాహనదారులు ప్రమాదాలకు గురికావడంతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పోలీసులు రోడ్డుపై పడ్డ గుంతల వద్ద వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు స్టాపర్లను ఏర్పాటు చేశారు. తరచూ లీకేజీ కారణంగా రోడ్డు గుంతలమయం కావడంతో పాటు వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు

-కర్రె మాధవికరుణాకర్‌, సర్పంచ వెంకటాపూర్‌, తుర్కపల్లి

గ్రామంలో మిషన భగీరథ మెయిన పైపు లైన లీకేజీ కావడంతో నీరంతా వథాగా పో తోంది. మరమ్మతు పనులు చేట్టాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. రోజంతా రోడ్డుపై నీరు ప్రవహించడంతో గుంతలు పడి రోడ్డు ధ్వంసమ వుతోంది. వాహన దారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. లీకేజీ నీటిని గ్రామంలోని చెరువులోకి పంపిస్తు న్నాం. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించడం లేదు.

మరమ్మతు పనులు చేపడతాం

-స్వాతి, మిషన భగీరథ డీఈ, భువనగిరి

రోడ్డు విస్తరణ పనులు చేపట్టినప్పుడు పైప్‌లైనకు లీకేజీలు ఏర్పడ్డాయి. మెయిన పైప్‌లైన లీకేజీలు తొలగించాలంటే యాదగిరిగుట్ట, గుండాల, ఆలేరు ప్రాంతాలకు నీటి సరాఫరాను నిలిపి వేయాల్సి ఉంటుంది. ప్రధాన పైప్‌లైన కావడంతో మరమ్మతు పనులు చేపట్టాలంటే కనీసం ఐదు రోజులు పడుతుంది. ప్రజలకు నీటి సమస్య ఏర్పడుతుంది. ఒక కిమీ దూరం వరకు పైపు లైన లిఫ్ట్‌ చేయాల్సి ఉంది. పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు పంపాం. త్వరలోనే మరమ్మతు పనులు చేపట్టి నీటి లీకేజీలను అరికట్టేందుకు చర్యలు చేపడతాం.

Updated Date - May 10 , 2026 | 11:50 PM