ప్రలోభాలు షురూ!
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:41 AM
మునిసిపల్ ఎన్నికల్లో ప్రలోభాలపర్వం మొదలైంది. ఒకవైపు పగటివేళ ఇంటింటి ప్రచారాలు సాగిస్తూ, రాత్రికి పంపకాలు మొదలుపెట్టారు. గల్లీల్లో ఎక్కడికక్కడ దావత్‌లు, పార్టీలు ఊపందుకున్నాయి.
మద్యం,చికెన్ పంపిణీ
గల్లీల్లో దావత్‌లు
ఓటర్లకు నగదు పంపిణీకి ఫోన్‌పే నెంబర్ల నమోదు
ఉద్యోగ, ఉపాధ్యా య ఓటర్లకు గాలం
మహిళలకు చీరల పంపిణీ
(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): మునిసిపల్ ఎన్నికల్లో ప్రలోభాలపర్వం మొదలైంది. ఒకవైపు పగటివేళ ఇంటింటి ప్రచారాలు సాగిస్తూ, రాత్రికి పంపకాలు మొదలుపెట్టారు. గల్లీల్లో ఎక్కడికక్కడ దావత్‌లు, పార్టీలు ఊపందుకున్నాయి. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్‌తో అన్ని మునిసిపాల్టీల్లో తాయిలాల పంపిణీలు కొనసాగుతున్నా యి. అధికార, ప్రతిపక్షాలే కాకుండా పోటీలో ఉన్న అభ్యర్థులంతా ఖర్చుకు వెరవకుండా దావత్‌లు షురూ చేయడం ఈ ఎన్నికల ప్రత్యేకతగా కనిపిస్తోంది.
పోలింగ్‌కు ఇంకా అయిదు రోజుల గడువున్నప్పటికీ వార్డుల్లో అభ్యర్థులు ఓటర్లను బుట్టలో వేసుకునే కార్యాచరణ మొదలుపెట్టారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇంటింటి ప్రచారాలు ఒకవైపు కొనసాగిస్తూనే మరోవైపు సాయంత్రం మద్యం, చికెన్ పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికీ హాఫ్ బాటిల్ విస్కీ, అరకిలో చికెన్ పంపిస్తున్నారు. అంతేకాకుం డా గల్లీల్లో యూత్‌కు, సంఘాలకు సాయంత్రం వేళ దావత్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక గల్లీలో ఒక పార్టీ నాయకులు మద్యం, చికెన్ పంచారనే సమాచారం రాగానే, ఇంకోపూట ఇంకో పార్టీ అభ్యర్థి తనవాటా మద్యం, చికెన్ పంపిణీ చేస్తున్నారు. త్రిముఖ, చతుర్ముఖ పోటీలున్న చోట్ల అభ్యర్థులందరూ ఈ పంపిణీకి తెరదీయడంతో వార్డుల్లో, గల్లీల్లో రాత్రి కాగానే పార్టీల సందడి కొనసాగుతోంది. ఒక్కోపార్టీ అభ్యర్థి నుంచి పోలింగ్ తేదీ నాటికి మూడు, నాలుగు పర్యాయాలైనా మద్యం, మందు పంపిణీ జరుగుతున్న పరిస్థితి గట్టిపోటీ ఉన్నవార్డుల్లో కనిపిస్తోంది. యూత్‌కు దావత్‌లతోపాటు క్రికెటు కిట్లు, డ్రస్సులు పంపిణీ చేస్తున్నారు. మరికొందరు అభ్యర్థుల నుంచి కుల సంఘాల నాయకులు ఆయా సంఘాలకు ఉపయోగపడేలా భవనాలకు, కులదేవతల గుళ్ల నిర్మాణాలకు చందాలు రాయిస్తున్నారు.
పోటాపోటీ ఉన్న వార్డుల్లో మహిళలకు చీరల పంపిణీ
పోటాపోటీ కొనసాగుతున్న వార్డుల్లో అభ్యర్థులు కొందరు ఒకడుగు ముందుకేసి మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మగవారికి మద్యం పంపిణీ చేస్తుండగా, మహిళలకు ఇంటింటికీ చీరలు పంపిణీ చేస్తున్నారు. మహిళా అభ్యర్థులున్న చోట వారే స్వయంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు బొట్టుపెట్టి చీరలిచ్చి గుర్తులు చూపించి ఓట్లు అభ్యర్థిస్తున్న పరిస్థితి పలువార్డుల్లో కొనసాగుతోంది. కొన్నివార్డుల్లో మహిళలు తీర్థయాత్రలకు డిమాండ్ చేస్తుండడంతో మహిళా సంఘాల నాయకుల ద్వారా వారికి హామీ ఇచ్చి ఎన్నికలవగానే తీర్థయాత్రలకు పంపిస్తామని, ఖర్చంతా తామే భరిస్తామని మిర్యాలగూడ, నల్లగొండలలో కొన్నివార్డుల్లో అభ్యర్థులు హామీలివ్వడమే కాకుండా అందుకవసరమైన డబ్బును ఆయా సంఘాలనాయకుల వద్ద డిపాజిట్ చేస్తున్నారు.
ఉద్యోగుల ఓట్లకు గాలం .
మునిసిపల్ ఎన్నికల్లో కీలకమైన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవే ట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులవారి కుటుంబీకుల ఓట్లు రాబట్టేందుకు తెరవెనక ప్రయత్నాలు సాగుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్లు వేస్తున్న ఉద్యోగులకు ఓట్లకోసం ఆఫర్లు ఇస్తున్నారు. తమకు ఓట్లేయాలని అభ్యర్థించడంతోపాటు వారికి అవసరమైన తాయిళాలు ఇచే ్చందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఉద్యోగులంతా ఇళ్లవద్దనే ఉండనుండడంతో అభ్యర్థులు, ప్రధాన పార్టీల నాయకులు ఆదివారం వా రు నివాసాలుండే కాలనీలు, అపార్టుమెంట్లలో ప్రచారం సాగించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆదివారం వారిని కలిసి ఓట్లు అర్థించడంతోపాటు మర్యాదలు చేసేందుకు ఆయా మున్సిపాల్టీల్లో అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
నగదు పంపిణికీ ఫోన్‌పే నెంబర్ల సేకరణ..
ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేందుకు వీలుగా అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రతీ వార్డులో ప్రతీ కుటుంబంలో ఓటర్ల సంఖ్య, ఓటర్ల గూగుల్‌పే, ఫోన్‌పే నెంబర్లను కార్యకర్తలు సేకరించి రాసుకుంటున్నారు. ప్రతీ 100 మంది ఓటర్ల నుంచి ఒక కార్యకర్త ఇల్లిల్లూ తిరిగి ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించడమే కాకుండా, ఈ నెంబర్లను అడిగి రాసుకుంటున్నారు. ఆ నెంబర్లకు పోలింగ్‌కు ముందురోజు నగదు బదిలీ చేస్తామని చెబుతున్నారు. కొందరు ఓటర్లు ఎంతిస్తారని అడిగి, తమకు ఎంత కావాలో స్పష్టంగా చెబుతున్న పరిస్థితి నెలకొంది. మధ్యవర్తులకు డబ్బులివ్వవద్దని నేరుగా తమకే ఇవ్వాలని పలు కాలనీల్లో అభ్యర్థులకు నేరుగా ఓటర్లు డిమాండ్లు పెడుతున్న పరిస్థితి నగదు పంపిణీపై నెలకొన్న ఉత్సుకతని తెలియజేస్తోంది.