మూడువేల యూనిట్ల రక్త నిల్వలు లక్ష్యం
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:20 AM
సేవలే పరమావధిగా భావించే రెడ్‌క్రాస్ సొసైటీ భువనగిరిలో బ్లడ్ బ్యాంకు నిర్మాణానికి సంకల్పించింది. సొసైటీ ఉదారతతో త్వరలో తలసేమియా బాధితులకు వ్యధ, రోడ్డు ప్రమాద తదితర బాధితులకు రక్తం కొరత తీరనుంది.
‘రెడ్‌క్రాస్’ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న బ్లడ్‌బ్యాంకు
తలసేమియా బాధితులకు ఉచిత చికిత్సలు
పారిశ్రామిక శ్రీధర్‌రెడ్డి రూ. 2కోట్ల విరాళం ప్రకటన
ఏడాదిలోపు సేవలు అందించే సంకల్పం..
(ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన): సేవలే పరమావధిగా భావించే రెడ్‌క్రాస్ సొసైటీ భువనగిరిలో బ్లడ్ బ్యాంకు నిర్మాణానికి సంకల్పించింది. సొసైటీ ఉదారతతో త్వరలో తలసేమియా బాధితులకు వ్యధ, రోడ్డు ప్రమాద తదితర బాధితులకు రక్తం కొరత తీరనుంది. ఈమేరకు స్థానిక ఇరిగేషన కార్యాలయ ఆవరణలో ప్రభుత్వం కేటాయించిన 990 చదరపు గజాల విస్తీర్ణంలో ఐదు అంతస్తులతో సుమారు రూ.5కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న భవనానికి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే ఈ బృహత కార్యానికి స్థానిక పారిశ్రామిక వేత్త సెంటర్ ఎస్ సాఫ్ట్‌వేర్ సంస్థ అధినేత పి.శ్రీధర్‌రెడ్డి ఏకంగా రూ.2కోట్ల విరాళాన్ని అందజేయడం విశేషం. ఏడాదిలోపు సేవలు అందించే లక్ష్యంతో నిర్మాణ పనులు పూర్తి చేస్తామని రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు అంటున్నారు.
రోజూ 30మంది తలసేమియా బాధితులకు చికిత్స
అన్ని గ్రూపులకూ చెందిన 3వేల యూనిట్ల రక్తం నిలువ రోజువారీగా 30మంది తల సేమియా బాధితులకు ఉచిత వైద్య చికిత్సలు , వసతి ఆహారం, రోడ్డు ప్రమాదం తదితర బాధితులకు కనిష్ట ధరలతో రక్తాన్ని సమకూర్చే లక్ష్యంతో బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నాయి. దాతల నుంచి స్వచ్ఛందంగా రక్తాన్ని సేకరించడం, కాంపోనెంట్ సపరేషన విధానంలో ఎర్ర రక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్ సేల్స్, క్షయోప్రేసిపీటెట్‌ను వేరు పరిచి నిలువ చేసే ఆధునిక ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. అవసరమైన బాధితులకు సరసమైన ధరలకు ఇవ్వడంతో పాటు ఔషధాల తయారీకి సేకరించనున్నారు.
ప్రాణాంతక తలసేమియా..
జన్యుపరమైన రుగ్మతతో వచ్చే తలసేమియా వ్యాధి పిల్లల పట్ల ప్రాణాంతకం వ్యాధి ఉన్నవారిలో హిమోగ్లోబిన సరిగ్గా ఉత్పత్తి కాదు. దీంతో నెలకు రెండు సార్లు రక్తమార్పిడి చేయాల్సిన పరిస్థితి. రక్తమార్పిడి, చికిత్సలు చేసిన ప్రతిసారీ రక్తం, ల్యూకో ఫిల్టర్, మందులు , విటమిన సప్లిమెంట్స్, వైద్య పరీక్షలు, రవాణా, ఆహారం తదితరాలకు సుమారు రూ.37వేల ఖర్చును బాధిత కుటుంబాలు భరించాల్సి ఉంటుందని వైద్య నిపుణుల అంచనా. అనగా నెలకు సుమారు రూ.64వేలు వెచ్చించాల్సి ఉండడం పలువురికి ఆర్థిక భారం అవుతోంది. ఆర్థిక స్తోమత లేని పలు కుటుంబాలు పిల్లలకు సకాలంలో వైద్య చికిత్సలు అందించకపోతుండడంతో మృత్యువాత పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో భువనగిరిలో రెడ్ క్రాస్ సొసైటీ నిర్మిస్తున్న 9వ బ్లడ్‌బ్యాంకులో ఉచితంగా అందనున్న వైద్య సేవలు తలసేమియా బాధితులకు కొండంత అండగా నిలవనున్నాయి. ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సేవలు అందనున్నాయి. ఇతర బాధితుల వైద్య చికిత్సల కోసం సరసమైన ధరలకు రక్తం లభ్యం కానుంది.
పారిశ్రామికవేత్త శ్రీధర్‌రెడ్డి రూ.2కోట్లు విరాళం..
సుమారు రూ.5కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు స్థానిక పారిశ్రామిక వేత్త పిన్నపురెడ్డి మోహన రెడ్డి కుమారుడైన సెంటర్ ఎస్ సాప్ట్‌వేర్ సంస్థ అధినేత పి శ్రీధర్ రెడ్డి ఏకంగా రూ. 2కోట్ల భారీ విరాళాన్ని ప్రకటంచడం విశేషం. ఆయన అందించిన విరాళంతోనే నిర్మాణ పనులు చేపడుతున్నారు. మిగతా నిధులను నిర్మాణ సమయంలో సేకరిస్తామని రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు పేర్కొంటున్నారు.
విద్యానగర్ బ్లడ్ బ్యాంకు స్ఫూర్తితో..
-సద్ది వెంకట్‌రెడ్డి, డివిజన అధ్యక్షుడు రెడ్‌క్రాస్ సొసైటీ
క్షేత్ర పర్యటనలో భాగంగా గత సంవత్సరం హైదరాబాద్ విద్యానగర్‌లోని రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకును సందర్శించాం. అక్కడ త సేమియా బాధిత చిన్నారులకు అందుతున్న వైద్య సేవలను, పిల్లల తల్లిదండ్రుల్లో కనిపించిన స్వాంతనతో మా బృంద సభ్యులందరు చలించిపోయాం. ఆ స్థాయి సేవలు భువనగిరిలో కూడా దాతల సహకారంతో నిర్మాణ పనులను చేపట్టాం.
రక్తదాతలు సహకరించాలి
-దిడ్డి బాలాజీ, వైస్ చైర్మన జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ
తలసేమియా బాధితుల వైద్య చికిత్సల్లో అత్యంత కీలకమైనది రక్తం. దీంతో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు, నిర్వహణలో ఆర్థిక సహకారంతో పోలిస్తే స్వచ్ఛంద రక్తదానమే అత్యంత విలువైనది. కావున ఆరోగ్యవంతులందరూ స్వచ్ఛంద రక్త దానానికి సిద్ధంగా ఉండాలి.