మేత కోసం యాతన..
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:34 AM
ఎల్‌నినో కష్టాలు పశువులకూ తప్ప డం లేదు. వర్షాభావం, నేలలో తేమలేక ఆరిపోడం, చెరువులు, కుంటలు ఎండిపోతుండటం, భూగర్భజలాలు అడుగంటుతుండటంతో పంటల సాగు సంక్షోభంలో పడగా, నేలపై పచ్చిమేత లేక పశువులకు గ్రాసం సమస్య రైతులను ఆందోళన కు గురిచేస్తోంది.
ఫిబ్రవరి తర్వాత తీవ్రం కానున్న గ్రాసం కొరత
ఎండుగడ్డి 5.43 లక్షల క్వింటాళ్లు, పచ్చిగడ్డి 2.43 లక్షల క్వింటాళ్ల లోటు..
జిల్లా పశుసవర్ధకశాఖ ముందస్తు కార్యాచరణ
రూ.3.13కోట్లతో మూగజీవాలకు మేత, తాగునీటి వసతులు
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): ఎల్‌నినో కష్టాలు పశువులకూ తప్ప డం లేదు. వర్షాభావం, నేలలో తేమలేక ఆరిపోడం, చెరువులు, కుంటలు ఎండిపోతుండటం, భూగర్భజలాలు అడుగంటుతుండటంతో పంటల సాగు సంక్షోభంలో పడగా, నేలపై పచ్చిమేత లేక పశువులకు గ్రాసం సమస్య రైతులను ఆందోళన కు గురిచేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం పశుగ్రాసం నిల్వలు ఉన్నప్పటికీ, ఎల్‌నినో వర్షాభావ పరిస్థితుల కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో గ్రాసం కొరత తీవ్రం కానుందని పశుసంవర్ధకశాఖ అధికారు లు అంచనాలు వేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 17 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ మేరకు చేపట్టనున్న కరువు సహాయక చర్యల్లో భాగంగా పశుగ్రాసం,నీటి కొరత లేకుండా చూసేందుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లా పశుసంవర్ధకశాఖ జిల్లాలో పశువులకు గ్రాసం, తాగునీటి సమస్యల ను అధిగమించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
58.351 మెట్రిక్‌టన్నుల పచ్చి, ఎండుగడ్డి లోటు
వచ్చే ఏడాది జూలై, ఆగస్టు వరకు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక కరువు పరిస్థితులు తప్పవని వాతావరణశాఖ అంచనా వేసింది. అప్పటి వరకు జిల్లాలో పశుసంపదను సంరక్షించుకోవడం రైతులకు, పశుసంవర్ధకశాఖకు పెద్ద సవాల్‌గా మారనుంది. జిల్లాలోని 17 మండలాల్లో 8,43,125 పశువులు ఉన్నాయి. పశువుల సంరక్షణకు జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్ర పశువైద్యశాల, మూడు ప్రాంతీయ పశువైద్యశాలలతో పాటు వివిధ స్థాయిల్లో 72 పశు వైద్య కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా ఆయా గ్రామాల్లో పశువులకు రోగా లు, ముందస్తు టీకాలు వంటి వైద్య చికిత్సలు అందిస్తున్నా రు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం కారణంగా జిల్లాలోని పశు సంపదకు(ఎండుగడ్డి) పశుగ్రాసం కొరత నెలకొననుందని పశుసంవర్ధక శాఖ అంచనా వేసింది. రానున్న 10 నెలలు అంటే వచ్చే వర్షాకాలం సీజన్ వరకు జిల్లాలో పశుసంపద ఆధారంగా 3.30లక్షల పాడిజాతి పశువులకు 4,86,256 మెట్రిక్ టన్నుల గ్రాసం అవసరం. ప్రస్తుతం అంచనాల ప్రకారం 4,61,943 మెట్రిక్ టన్నులు మాత్రమే గ్రాసం అందుబాటులో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అదే విధంగా పచ్చిగడ్డి 2,91.754 అవసరమని అంచనా వేస్తుండగా, 2,33,403 మెట్రిక్ టన్నుల లభ్యత మాత్రమే ఉంది. మొత్తంగా రానున్న కాలంలో జిల్లా వ్యాప్తంగా పచ్చిమేత, ఎండి గడ్డి మొత్తం 58.351 మెట్రిక్ టన్నుల లోటు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రైతులపై ఆర్థిక భారం..
సాధారణంగా వర్షాకాలంలో పాలదిగుబడి పెరుగుతుం ది. దాదాపు డిసెంబరు, జనవరి మాసం వరకు నేలపై సహజ పశుగ్రాసం అందుబాటులో ఉండి పాడిపోషణ వ్య యం రైతులకు కొంత తగ్గుతుంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం, వర్షాల రోజుల వ్యవధి ఎక్కువగా ఉండటంతో సెప్టెంబరు చివరి నాటికే నేలపై పచ్చిక మాడిపోయింది. దీంతో పాడిపశువులకు కోసిన పచ్చిగడ్డి, ఎండుగడ్డి వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పశుగ్రాస నిల్వలు తగ్గిపోతుండటం, గ్రాసం అందుబాటులో లేకపోవడంతో వాటి ధరలు సైతం పెరిగిపోతున్నాయి. సాధారణంగా క్వింటా ఎండుగడ్డి ధర రూ.600 ఉండగా, ప్రస్తుతం రూ.750 వరకు చేరింది. పచ్చిగడ్డి ధర క్వింటా రూ.300 ఉండగా, ప్రస్తుతం రూ.400కు చేరింది. దీంతో పాటు పశుదాణా ధరలు సైతం 20శాతం పెరిగాయని పాడిరైతులు చెబుతున్నారు. దీంతో పశుపోషణ భారంగా మారడమేగాక ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పాలదిగుబడి కూడా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.
రూ.3.13కోట్లతో ప్రత్యేక కార్యాచరణ
కరువు పరిస్థితుల్లో మూగ జీవాలకు గ్రాసం, తాగునీటిని అందించే లక్ష్యంగా పశుసంవర్ధక శాఖ ముందస్తు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా రూ.3.13కోట్ల అంచనాలతో పశు సంరక్షణకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు 41 మెట్రిక్‌టన్నుల పశుగ్రాస విత్తనాలను రైతులకు సరఫరా చేశారు. ఈ విత్తనాలను జిల్లాలోని 17 మండలాల్లోని రైతులకు 75శాతం రాయితీపై అందిస్తున్నారు. అదేవిధంగా మరో 40 మెట్రిక్‌టన్నుల పశుగ్రాస విత్తనాల సరఫరాకు ఇండెంట్ పెట్టారు. ఈ విత్తనాలు వచ్చిన వెంటనే రైతులకు పంపిణీ చేయనున్నారు. ఈ విత్తన సాగుతో గ్రాసం లభ్యత పెరగనున్నట్టు అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా వీబీజీరామ్‌జీ పథకంలో భాగంగా రైతులకు పశుగ్రాసం సాగుకు సాయం అందిస్తున్నారు. ఎకరా వరకు సాగు చేసుకునే రైతుకు రూ.10,472 లేబర్ కాంపోనెంట్గా, రూ.3,551 మెటిరియల్ కాంపోనెంట్గా అందించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో పశు సంపద ఇలా..
పశురకం సంఖ్య
తెల్ల పశువులు 67,144
నల్ల పశువులు 1,07,444
గొర్రెలు 5,45,295
మేకలు 1,23,242
మొత్తం 8,43,125
పాల దిగుబడిపై ప్రభావం
బీబీనగర్: గ్రాసం కొరత ఏర్పడితే పశువులకు అవసరమైన పోషకాహారం అందించడం రైతులకు సవాలుగా మారుతుంది. పచ్చిమేతకు బదులు ఇతర దాణాపై ఆధారపడాల్సి రావడంతో నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. సరైన ఆహారం అందకపోతే పాలదిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పటికే పశువుల కొనుగోలు, దాణా, వైద్యం నిర్వహణ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న పాడి రైతులకు ఎల్‌నినో ప్రభావం మరో భారంగా కానుంది. జిల్లాలో మూసీ పరివాహక ప్రాంతాల్లో కొంత మేర సాగు నీటి వసతి, పచ్చదనం అందుబాటులో ఉన్నా మిగిలిన ప్రాంతాలు ప్రధానంగా వర్షాధారంపైనే ఆధారపడి ఉన్నాయి. వర్షాలు సకాలంలో లేక పశుగ్రాసం తగ్గిపోవడంతో పాటు బీడు భూముల్లో సహజంగా లభించే గడ్డి కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. మూసీ రహిత ప్రాంతాల్లోని పశు పోషకులు మేత కోసం అదనపు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం
డాక్టర్ జి.శ్రీనాధ్, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి
ఎల్‌నినో పరిస్థితులను అధిగమించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాం. గ్రాసానికి ఇబ్బంది లేకపోయినా రానున్న రోజుల్లో కొరత ఏర్పడవచ్చు. జిల్లాలో పశువుల సంఖ్యను బట్టి గ్రాసం అంచనాలు రూపొందించాం. పాడిరైతులకు 75శాతం సబ్సిడీతో 41మెట్రిక్ టన్నుల గ్రాసం విత్తనాలను అందించాం. మరో 40 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలకు ఇండెంట్ పెట్టాం. వీబీజీరాంజీ పథకం కింద రైతులకు ఎకరా వరకు పశుగ్రాసం సాగుకు రూ.10,472 లేబర్ కాంపోనెంట్, మెటీరియల్ ఖర్చు కింద రూ.3,551 మొత్తం రూ.14,023 చెల్లిస్తాం. పశు వైద్య సిబ్బంది, ఈజీఎస్ సిబ్బంది గ్రామాల వారీగా రైతుల వివరాలు సేకరించి అత్యధికంగా పశు గ్రాసం సాగు చేసేలా వివిధ శాఖల సమన్వయంతో కృషి చేస్తున్నాం.
రైతులకు భరోసా కల్పించాలి
కొండమడుగు నర్సింహ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు
ఎల్‌నినో ప్రభావం వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపై పడకుండా ఇప్పటి నుంచే పశుసంవర్ధక శాఖ అప్రమత్తం కావాలి. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయంతో కార్యాచరణ చేపట్టి పశు గ్రాసం కొరత తలెత్తకుండా చూడాలి. ముందస్తు ప్రణాళికలు అమలు చేసి పశు సంపదను కాపాడాలి. అప్పుడే పాడి రైతులకు ఆర్థిక నష్టాలు తగ్గే అవకాశం ఉంటుంది.