మోగిన నగారా
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:46 AM
మునిసిపల్ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూ ల్ విడుదల చేసింది. జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
పురపోరుకు షెడ్యూల్ విడుదల
ఫిబ్రవరి 11న పోలింగ్
నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ
ఉమ్మడి జిల్లాలో 1 కార్పొరేషన్, 17 మునిసిపాలిటీల్లో ఎన్నికలు
ఫిబ్రవరి 13 ఓట్ల లెక్కింపు, 16న మేయర్, చైర్మన్ల ఎన్నికలు
(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ): మునిసిపల్ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూ ల్ విడుదల చేసింది. జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 28వ తేదీ నుం చి నామినేషన్ల ప్రక్రియ ప్రారం భం కానుండగా, ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్, ఈ నెల 13న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. షెడ్యూల్ విడుదలతో ఎన్నికల సందడి మొదలైంది.
మునిసిపల్ ఎన్నికలకు నగారా మోగింది. ఫిబ్రవరి 11న నల్లగొండ కార్పొరేషన్ సహా ఉమ్మడి జిల్లాలోని మరో 17 మునిసిపాలిటీలకు ఎన్నిక జరగనుంది. రెండు అంచెల ఎన్నికల ప్రక్రియ కొనసాగే మునిసిపల్ ఎన్నికల్లో మొదటి అంచెలో కార్పొరేషన్‌లో డివిజన్లకు కార్పొరేటర్లను, మునిసిపాలిటీల్లోని వార్డుల్లో కౌన్సిలర్లను ప్రత్యక్ష ఎన్నికల విధానంలో ఎన్నిక జరుగుతుంది. రెండోదశలో కార్పొరేటర్లతో ఏర్పాటయ్యే నగరపాలకసంస్థ కౌన్సిల్ మెజార్టీ ఓట్లతో మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటే, కౌన్సిలర్లతో ఏర్పాటయ్యే మున్సిపల్ కౌన్సిళ్లు చైర్మన్, వైస్‌చైర్మన్లను ఎన్నుకుంటాయి. ఈ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరుగనుండడంతో అధికార కాంగ్రె్‌సతో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకుంటున్నా యి. ఈ నెల 16న వార్డుల వారీగా, చైర్మన్ల వారీగా రిజర్వేషన్లు ఖరా రు చేయడంతో ఇప్పటికే రాజకీయసందడి కొనసాగుతున్న పురపాలికల్లో బుధవారం నుంచి ఎన్నికల ఘట్టం మొదలవబోతోంది. ఎన్నిక ల ప్రక్రియకు నామినేషన్ల స్వీకరణ మొదలవడంతో అభ్యర్థులను ఎంపికచేసేందుకు రంగం సిద్ధమైంది. నల్లగొండ కార్పొరేషన్ సహా అన్ని మునిసిపాలిటీల్లో ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక నిమిత్తం ప్రక్రి య ప్రారంభించిన రాజకీయపార్టీలు నేడో, రేపో అధికారికంగా అభ్యర్థుల్ని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేశారు. అసంతృప్తుల బెడద తప్పించేందుకు టిక్కెట్ ఇవ్వలేకపోతున్న వారికి బుజ్జగింపుల ప్రక్రియ చేపట్టారు. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకొని ఫిబ్రవరి 16వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్‌చైర్మన్ల ఎన్నిక జరిగే వరకు ఉమ్మడి జిల్లా పట్టణ ప్రాంతాల్లో రాజకీయం హోరెక్కనుంది.
ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్, 17 మునిసిపాలిటీల్లో ఎన్నికలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్‌తో పాటుగా మరో 17 మునిసిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. నకిరేకల్ మునిసిపాలిటీకి రిజర్వేషన్లను ఖరారుచేసినా అక్కడి పాలకవర్గానికి వచ్చే మే నెల వరకు గడువుండడంతో ఆ మునిసిపాలిటీలో వీటితో పాటు ఎన్నికలు జరగడం లేదు. నల్లగొండ కార్పొరేషన్‌లో 48 డివిజన్లకు ఎన్నిక జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు జరిగే మిగిలిన 17 మునిసిపాలిటీల్లో 359 వార్డులకు ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 11న పోలింగ్
నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు, ఉమ్మడి జిల్లాలో మరో 17 మునిసిపాలిటీల్లో బుధవారం నుంచి కార్పొరేటర్, కౌన్సిలర్ సీట్లకు నామినేషన్ల స్వీకరణ మొదలవబోతోంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహణకు నిర్ణయించిన రాష్ట్ర ఎన్నికల సంఘం నేటి నుంచి నామినేషన్లను స్వీకరించేందుకు వీలుగా షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 13న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించనుండగా, ఫిబ్రవరి 16న కార్పొరేషన్‌లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు, మునిసిపాలిటీలో చైర్మన్, వైస్‌చైౖర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన తక్షణమే ఎన్నికల ప్రవర్తనానియమావళి అమల్లోకి రావడంతో ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కడివక్కడ నిలిపివేశారు.
నేడో, రేపో అభ్యర్థు ప్రకటన
మునిసిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతుండడంతో అధికార కాంగ్రె్‌సతో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నాయి. డివిజన్లు, వార్డుల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలిపి తమ పార్టీ నుంచి గెలిపించుకోవాలని నిర్ణయించాయి. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో అభ్యర్థుల ఎంపికకు అన్నిపార్టీలు కసరత్తు కొనసాగిస్తున్నాయి. నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు అన్ని మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కొలిక్కివచ్చినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలోని కార్పొరేషన్, మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పావులు కదుపుతూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలోనే జాగ్రత్తలు వహించడంతో పాటు ధీటైన ఎన్నికల వ్యూహాన్ని అమలుచేసి ఉమ్మడి జిల్లాలో కార్పొరేషన్ సహా అన్ని మునిసిపాలిటీల్లో విజయకేతనం ఎగురవేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఎన్నికల రంగంలోకి దిగుతోంది. ఇప్పటికే అభ్యర్థులను గుర్తించిన కాంగ్రెస్ నేడో, రేపో అభ్యర్థుల తుదిజాబితాను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మరోవైపున పంచాయతీ ఎన్నికల్లో అనూహ్యంగా ఫలితాలు సాధించడమే కాకుండా గణనీయమైన సర్పంచ్ స్థానాలు దక్కించుకున్న బీఆర్‌ఎస్ పట్టణ ప్రాంతాల్లోనూ తమ సత్తా చాటేందుకు సిద్ధమని చెబుతోంది. మాజీమంత్రి, మాజీ ఎమ్మెల్యేల సారథ్యంలో ఇప్పటికే అన్ని డివిజన్లు, మునిసిపల్ వార్డుల్లో అభ్యర్థులను ఎంపికచేయగా, నేడోరేపో వారి జాబితాలు వెల్లడించేందుకు సిద్ధమైంది. గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహం అమలుచేయడంతో పాటు ధీటైన ప్రచారం చేయాలని నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో క్యాడర్, ఓటుబ్యాంక్ కలిగిన బీజేపీ ఈ ఎన్నికల్లో గణనీయమైన ఫలితాలు సాధిస్తామనే నమ్మకాన్ని వెలిబుచ్చుతోంది. అభ్యర్ధుల ఎంపికకు ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన ఆ పార్టీ నేతలు నేడో, రేపో అభ్యర్థుల జాబితాను వెల్లడించేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా నామినేషన్ల ఘట్టం ముగిసేలోగా అన్ని డివిజన్లు, వార్డుల్లో అభ్యర్థులను ప్రకటించి ప్రచార ఘట్టాన్ని ఉధృతం చేసేందుకు రాజకీయనేతలు సిద్ధమయ్యారు.
ఎన్నికల ప్రక్రియ ఇలా.. తేదీ
ఎన్నికల నోటిఫికేషన్(జనవరి) 28
జాబితాల ప్రదర్శన 28
నామినేషన్ల స్వీకరణ 28
నామినేషన్లకు గడువు 30
నామినేషన్ల పరిశీలన 31
చెల్లిన నామినేషన్ల ప్రకటన 31
అభ్యంతరాల స్వీకరణ(ఫిబ్రవరి) 1
అభ్యంతరాల పరిష్కారం 2
నామినేషన్ల ఉపసంహరణ 3
అభ్యర్థుల ప్రకటన 3
పోలింగ్ తేదీ 11.2.2026 (ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 5గంట వరకు)
ఓట్ల లెక్కింపు 13 ఫిబ్రవరి
నల్లగొండ కార్పొరేషన్ వివరాలు
కార్పొరేషన్ డివిజన్లు మేయర్ రిజర్వేషన్
నల్లగొండ 48 జనరల్ మహిళ
ఉమ్మడి జిల్లాలో మునిసిపాలిటీల వివరాలు
మునిసిపాలిటీ వార్డులు చైర్మన్ రిజర్వేషన్
మిర్యాలగూడ 48 జనరల్ మహిళ
హాలియా 12 జనరల్
నందికొండ 12 ఎస్సీ జనరల్
దేవరకొండ 20 బీసీ మహిళ
చండూరు 10 జనరల్
చిట్యాల 12 జనరల్ మహిళ
సూర్యాపేట 48 జనరల్
తిరుమలగిరి 15 జనరల్
కోదాడ 35 జనరల్‌మహిళ
హుజూర్‌నగర్ 28 బీసీ జనరల్
నేరేడుచర్ల 15 జనరల్
భువనగిరి 35 జనరల్ మహిళ
ఆలేరు 12 బీసీ మహిళ
మోత్కూరు 12 ఎస్సీ మహిళ
యాదగిరిగుట్ట 12 జనరల్ మహిళ
భూదాన్‌పోచంపల్లి 13 జనరల్
చౌటుప్పల్ 20 జనరల్ మహిళ