మూగబోయిన పల్లె పాట
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:11 AM
కాలికి గజ్జె కట్టి పల్లెపల్లెన తిరుగుతూ ఆటపాటలతో ప్రజలను చైతన్యం చేసిన ప్రజానాట్యమండలి కళాకారుడు, రచయిత, గాయకుడు జహంగీర్ గుండెపోటుతో యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో గురువారం మృతి చెందారు.
ప్రజా కళాకారుడు జహంగీర్ గుండెపోటుతో మృతి
అంతిమయాత్రలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, తెలంగాణ సాంస్కృతిక సారఽథి చైర్మన గుమ్మడి వెన్నెల
తుర్కపల్లి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి) : కాలికి గజ్జె కట్టి పల్లెపల్లెన తిరుగుతూ ఆటపాటలతో ప్రజలను చైతన్యం చేసిన ప్రజానాట్యమండలి కళాకారుడు, రచయిత, గాయకుడు జహంగీర్ గుండెపోటుతో యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో గురువారం మృతి చెందారు. మూడు దశాబ్దాలకు పైగా తన ప్రదర్శనలతో సామాజిక రుగ్మతలపై జహంగీర్ సమరం చేశారు. ప్రజా గాయకుడిగా, రచయితగా, యాదాద్రిభువనగిరి జిల్లా కళాకారుల బృంద సారఽథిగా ఎండీ జహంగీర్ వ్యవహరిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. జహంగీర్ మృతితో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తుర్కపల్లి మండలకేంద్రానికి చెందిన ఎండీ జహంగీర్ నిరుపేద కుటుంబంలో పుట్టారు. చిన్ననాటి నుంచే వామపక్ష భావజాలం కలిగిన ఆయన 14 ఏళ్ల వయస్సులో సీపీఎంలో చేరారు. ప్రజానాట్యమండలిలో చేరి అంచెలంచెలుగా రాష్ట్రస్థాయి గాయకుడిగా ఎదిగారు. పీపుల్స్‌వార్ పార్టీ సానుభూతిపరుడుగా ఉండడంతో పోలీసులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా అజ్ఞాతంలోకి వెళ్లి కొన్నాళ్లు తలదాచుకున్నారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్‌తో కలిసి పనిచేశారు. బెల్లి లలిత వెంట జననాట్య మండలిలో తెలంగాణ ధూం..ధాంలో పనిచేశారు. ప్రజా నాట్యమండలి ద్వారా ప్రతి గ్రామంలో ఆటపాటలు, పల్లె సుద్దులు, కళారూపాలతో ప్రజలను చైతన్యం చేశారు. కుల వివక్ష, సంపూర్ణ అక్షరాస్యత కోసం, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, వరకట్న వేధింపులు, గృహహింస, హమాలీ, బీడీ కార్మికులు, వలస కూలీలు అన్నివర్గాల సమస్యలపై గొంతెత్తి పాలకులను ప్రశ్నించారు. ఆయా పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గాయకుడిగా ఎన్నో ధూంధాంలలో పాల్గొన్నారు. తెలంగాణ జనసభ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. అనుబంధ సంఘమైన తెలంగాణ కళాసమితి రాష్ట్ర బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రం సిద్ధించాక ఏర్పాటైన ప్రభుత్వం చేపట్టిన కళా బృందాల టీంలో సారధి కళాకారుడిగా తన జీవితాన్ని కొనసాగిస్తూనే ప్రజాసంఘాల నిర్వహించే ప్రతి పోరాటంలో తన ఆటా పాటను కొనసాగిస్తున్నారు.
సాంస్కృతిక రంగానికి తీరనిలోటు
ప్రజా కళాకారుడు జహంగీర్ మృతి సాంస్కృతిక రంగానికి తీరని లోటని తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్‌పర్సన, డాక్టర్ గుమ్మడి వెన్నెల, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. తుర్కపల్లిలో జహంగీర్ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడారు. అనంతరం అంతిమయాత్రలో జహంగీర్ పాడెను బీర్ల అయిలయ్య మోశారు. జహంగీర్ మృతికి సంతాపం తెలిపిన వారిలో ఆర్టీఐ రాష్ట్ర కమిషనర్ బోరెడ్డి అయోధ్యరెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, డాక్టర్ చెరుకు సుధాకర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాల శ్రీనివాస్, సాంస్కృతిక సారధి సభ్యురాలు వేముల పుష్ప, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల కళాకారులు ఉన్నారు. జహంగీర్ అంతిమయాత్రలో వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు నివాళులర్పిస్తూ ఉద్యమ, సామాజిక గేయాలు ఆలపిస్తూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. జహంగీర్‌ను కడసారి చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి కన్నీరుమున్నీరుగా విలిపించారు.