పచ్చని పొలాలపై ఇథనాల్ పడగ
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:21 AM
సారవంతమైన నల్లరేగడి భూములు, పచ్చటి పంటలతో కళకళలాడేచోట కాలుష్యపూరిత ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు సాగుతున్నాయి.
వీర్లపాలెం వద్ద రూ.750కోట్లతో సోహం అగ్రో ఇండస్ట్రీస్ ఇథనాల్ కంపెనీ
రైతుల నుంచి 108.82ఎకరాల సాగుభూమి కొనుగోలు
ఈ నెల 20న కాలుష్య నియంత్రణమండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ
తప్పుల తడక, అసమగ్ర సమాచారంతో పర్యావరణ ప్రభావ అంచనాల నివేదిక
పర్యావరణ, అటవీ, జల, ఆవాస, కాలుష్య అంశాల ఉల్లంఘనలు
(నల్లగొండ, ఆంధ్రజ్యోతిప్రతినిధి): సారవంతమైన నల్లరేగడి భూములు, పచ్చటి పంటలతో కళకళలాడేచోట కాలుష్యపూరిత ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు సాగుతున్నాయి. దామరచర్ల మండలం వీర్లపాలెం రెవెన్యూ శివారు 108.82 ఎకరాల్లో సోహం ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 600 కేఎల్‌డీ సామర్థ్యంతో ఇథనాల్, 200 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, 15 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుదుత్పత్తి ప్లాం ట్ల ఏర్పాటుకు ఈనెల 20వ తేదీన ప్రజాభిప్రాయసేకరణకు సిద్ధమైంది. పర్యావరణ ప్రభావ అంచనాల నివేదికను విశాఖ పట్టణానికి చెందిన ఎస్‌వీ ఎన్‌విరో ల్యాబ్స్, రీసె ర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించి, కాలుష్య నియంత్రణ మండలికి ఇప్పటికే అం దజేసింది. ఈ నివేదిక తప్పులతడకగా ఉం దని అభిప్రాయ సేకరణను వాయిదా వేయాలని స్థానికులు కలెక్టర్‌కు విన్నవించారు.
ఎన్‌విరో ల్యాబ్స్ రూపొందించిన పర్యావరణ ప్రభా వ అంచనా నివేదికలో రిజర్వ్ ఫారె్‌స్టపై సమగ్రత లోపించింది. ఈ పరిశ్రమకు 1.50కిలోమీటర్ల దూరం లో వీర్లపాలెం రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ మాత్రమే ఉందని నివేదికలో పేర్కొంది. వాస్తవానికి ఈ పరిశ్రమకు మరోవైపు 1.50కిలోమీటర్ల దూరంలో అడవిదేవులపల్లి బ్లాక్ విస్తరించింది. ఈ అటవీ ప్రాంతమంతా అటు అన్నమేరు వాగు, ఇటు కృష్ణానది వరకు విస్తరించిం ది. ఇక్కడి నుంచి మొదలయ్యే అడవి, నదీ తీరాన్ని అనుసరిస్తూ నాగార్జునసాగర్ రిజర్వాయర్ వరకు విస్తరించి, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారె్‌స్టతో అనుసంధానమైంది. నివేదికలో ఒక్క బ్లాక్‌నే పొందుపరచ డం ద్వారా టైగర్ రిజర్వ్ ఫారె్‌స్టకు, ఈ బ్లాక్‌కు ఎలాం టి సంబంధం లేదని రూఢీపరచి, అటవీశాఖ నుంచి తేలికగా అనుమతులు సాధించవచ్చనే భావనతో తప్పుడు నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది.
పర్యావరణ చట్టాల ఉల్లంఘన..
పర్యావరణ చట్టాల ప్రకారం జీవనదులకు కనీ సం 9కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి కాలుష్యపూరి త పరిశ్రమలు ఏర్పాటు చేయకూడదు. కానీ, ఇక్కడ కృష్ణానదికి 3.5కిలోమీటర్ల దూరంలోనే ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు జనావాసాలకు ఈ పరిశ్రమలు కనీసం 7 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటుచేయాలనే నిబంధనను కూడా ఉల్లంఘించారు. ఈ పరిశ్రమకు సమీపంలో 2.5కిలోమీటర్ల దూరంలో వీర్లపాలెం, మరో 2.50కిలోమీటర్ల దూరంలో సాత్‌తండా, 3 కిలోమీటర్ల దూరంలో దుబ్బతండా ఉన్నాయి. మరోవైపు 3కిలోమీటర్ల పరిధిలో ముదిమాణిక్యం గ్రామం, సుమారు 4కిలోమీటర్ల దూరంలో తాళ్లవీరప్పగూడెం, 5కిలోమీటర్ల పరిధిలో అడవిదేవులపల్లి, ఇంకోవైపు ఆరుకిలోమీటర్ల పరిధిలో ఉల్సాయిపాలెం, కాల్వకట్టతోపాటు పలు గిరిజన తండాలు ఉన్నా, వాటి ప్రస్తావన నివేదికల్లో కరువైంది.
పరిశ్రమ ఏర్పాటైతే వన్యప్రాణులకు ముప్పు
ఈ పరిశ్రమకు కృష్ణానది నుంచే నీటిని తీసుకుంటున్నందున, పైప్‌లైన్లను అటవీప్రాంతం నుంచే ఏర్పాటు చేయాల్సి ఉంది. నిర్మాణం, అనంతరం నిర్వహణ కోసం అడవిలో మానవ, వాహన సంచారాలు అధికమైతే వన్యప్రాణుల మనుగడకు ప్రమాదం ఏర్పడనుంది. ఈ అడవిలో జింకలు, దుప్పులు, నెమళ్లు, పాలపిట్టలు, అడవిదున్నలు, మనుబోతులు, ఉడతలు, నక్కలు, కుందేళ్లు, ఎంటవలు, నాగుపాములు, కట్లపాములు, సీతాకోక చిలుకలు మనుగడ సాగిస్తున్నాయి. ఈ అడవికి సరిహద్దులోని కృష్ణానది, అన్నమేరు ద్వారా నీటి లభ్యత ఉండడంతో వన్యప్రాణుల సంచారం పెరిగింది. 2024 మార్చిలో సైతం ఇక్కడ ఒక జింక కళేబరాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకోగా, పలు సందర్భాల్లో ఇక్కడ వన్యప్రాణుల వేట కొనసాగుతున్నట్లు అటవీశాఖ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. టైగర్ ప్రాజెక్టుకు అనుసంధానం కావడంతో చిరుతల సంచారం కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇంతటి కీలకమైన వన్యప్రాణుల విషయాలేవీ ఈ నివేదికలో పొందుపరచలేదు.
వీర్లపాలెం-2 ఎత్తిపోతల పథకానికి గండి
వీర్లపాలెంతో పాటు, ముదిమాణిక్యం, అడవిదేవులపల్లిల్లో విస్తరించిన సుమారు 5వేల ఎకరాల నల్లరేగడి మెట్టభూములకు సాగునీరిచ్చే లా అన్నమేరుపై వీర్లపాలెం-2 ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఎత్తిపోతల పథకానికి 2021లోనే రూ.32.22 కోట్లు కేటాయిస్తూ, జీవో 291ను ప్రభుత్వం విడుదలచేసింది. ఈ పథకం లో భాగంగా ఇప్పటికే ఇన్‌టెక్‌వెల్ వద్ద కొంతమేర పని కూడా పూర్తవగా, త్వరలో దీని నిర్మా ణం పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏర్పాటు చేసే పైప్‌లెన్లు, ఈ పరిశ్రమ ప్రతిపాదిత స్థలం నుంచే వెళ్లాల్సి ఉండడంతో దీని భవిత వ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ పైప్‌లైన్ నిర్మాణ ప్రస్తావనేదీ పరిశ్రమ పర్యావరణ నివేదికలో పేర్కొనకపోవడంతో ఇక్కడ భవిష్యత్‌లో పైప్‌లైన్‌కు సంబంధించి రైతులకు జరిగే నష్టానికి సూచికని స్థానికులు వాపోతున్నారు. మొత్తంగా ఎత్తిపోతల పథకం నిర్మాణానికే ఈ పరిశ్రమ గండికొట్టే ప్రమాదం ఉందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.
నీటికుంట సంరక్షణ, వరదనీటి మళ్లింపుపై నివేదికలో ప్రస్తావన కరువు
ఈ పరిశ్రమ ఏర్పాటు చేయనున్న ప్రాంతం మీదుగా వర్షాలు వచ్చినప్పుడు వచ్చే వరదనీరంతా దిగువన ఉన్న హనుమారెడ్డి కుంటకు చేరుతోంది. వీర్లపాలెం, సమీప గిరిజన తండా ల నుంచి మేతకు వచ్చే పశువులు, సమీపంలో ని వ్యవసాయదారులు, పక్షులకు ఈ కుంటనీరు దాహార్తిని తీరుస్తోంది. ఈ పరిశ్రమలో భాగంగా ప్రహరీ, కాంక్రీట్ నిర్మాణాలు చేపడితే వరదనీటి ప్రవాహ కాల్వలను మళ్లిస్తారనే అంశంపై నివేదికలో ఎక్కడా పొందుపరచలేదు. కుంట సంరక్షణ గురించి కూడా ఎలాంటి ప్రస్తావన లేదు. పరిశ్రమ ఏర్పాటైతే వరదనీరు కుంటకు చేరదని, తద్వారా కుంట మనుగడ కోల్పోవాల్సిందేననే ఆందోళనలకు పరిశ్రమ యాజమాన్యం సమాధానం చెప్పాల్సి ఉంది.
ఈ పరిశ్రమకు కేటాయించిన నీటితో 1,500 ఎకరాలకు ఒక తడి
పరిశ్రమలో ఉత్పత్తికి ఏటా సుమారు 102కోట్ల లీటర్ల నీటిని, మరో 20కోట్ల లీటర్ల నీరు ఇతర వినియోగాలకు వినియోగిస్తారు. సుమారు 0.043 టీఎంసీలకు సమానమైన ఈ నీటిలో సగం వరకే కృష్ణానది నుంచి, మిగిలిన సగం రీజనరేటెడ్ విధానంలో పరిశ్రమలోనే ఉత్పత్తి చేస్తామని యాజమాన్యం చెబుతోంది. మొత్తం నీటిని నది నుంచి తోడితే, ఈ నీటితో ఇక్కడి నల్లరేగడినేలల్లో పత్తి పంటకు ఒక తడికి సుమారు 1,500 ఎకరాలకు, రెండు తడులకైతే 750 ఎకరాలకు నీరివ్వవచ్చు. వర్షాకాలంలో అయితే వానలకు తోడు ఈ నీటిని అందించడం ద్వారా సుమారు 1,500 ఎకరాలకు సాగునీటి భరోసా దక్కుతుందని జలవనరుల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
3వేల ఏళ్ల కిందటి పురావస్తు అవశేషాలకు ముప్పు
ఈ పరిశ్రమ ఏర్పాటుచేసే ప్రాంతానికి సమీపంలో కొత్తపల్లిలో ఇటీవల పురావస్తు పరిశోధకులు 3వేల ఎళ్ల కిందటి నిర్మాణాలు, ఆలయాలు, మానవ సంచార ఆనవాళ్లను గుర్తించారు. పరిశ్రమ ప్రభావానికి గురయ్యే పురావస్తు అవశేషాలపై ఎలాంటి విశ్లేషణ ఈ నివేదికలో లేకపోవడం, ఇక్కడ అధ్యయనం తూతూమంత్రంగానే సాగిందనేందుకు నిదర్శనమని స్థానికులు పేర్కొంటున్నారు.
పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలపై మొక్కుబడి నివేదిక
పర్యావరణ చట్టాల ప్రకారం ఈ పరిశ్రమ ఏర్పాటు చేసేచోట 33శాతం స్థలాన్ని గ్రీన్‌బెల్ట్‌కు కేటాయించి, అక్కడ చెట్లు, మొక్కలు పెంచడంతో పాటు, పార్కులను అభివృద్ధి చేయాలి. పరిశ్రమ కింద పరిగణిస్తోన్న 108.82 ఎకరాల భూమిలో గ్రీన్‌బెల్ట్ కింద దాదాపు 36ఎకరాల భూమిని కేటాయించాల్సి ఉండగా, ఇక్కడ కేవలం 27.20ఎకరాలు మాత్రమే చూపించారు. కాలుష్యాన్ని నియంత్రించే చర్యలకు, ప్రభావిత ఆవాసాల్లో సామాజిక బాధ్యత కింద పరిశ్రమల టర్నోవర్ నుంచి ఏటా 2శాతం సీఎ్‌సఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధి) కింద కేటాయించాల్సి ఉంటుంది. ఈ పరిశ్రమ సుమారు రూ.1,500కోట్ల వరకు టర్నోవర్ నిర్వహిస్తే దాదాపు రూ.30కోట్ల వరకు సీఎ్‌సఆర్ నిధిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పర్యావరణ పరిరక్షణకు ఏటా కేవలం రూ.45లక్షల బడ్జెట్ కేటాయిస్తామని నివేదికలో పేర్కొనడం భవిష్యత్ నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తోందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు.