Share News

ప్రథమ భూదాత సేవలు చిరస్మరణీయం

ABN , Publish Date - Apr 16 , 2026 | 11:41 PM

భూదాన్‌పోచంపల్లి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) : ప్రథమ భూదాత వెదిరె రామచంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయమని, భూదానోద్యమం స్ఫూర్తితో నిర్వహించే వజ్రోత్సవాల పాదయాత్ర ద్వారా యువతలో సామాజిక స్పృహ పెంపొందించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ప్రథమ భూదాత సేవలు చిరస్మరణీయం

భూదాన్‌పోచంపల్లి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) : ప్రథమ భూదాత వెదిరె రామచంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయమని, భూదానోద్యమం స్ఫూర్తితో నిర్వహించే వజ్రోత్సవాల పాదయాత్ర ద్వారా యువతలో సామాజిక స్పృహ పెంపొందించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. భూదానోద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని కస్తూర్బా ప్రకృతి చికిత్సాలయం నుంచి ‘భూదాన ఉద్యమం స్ఫూర్తి పాదయాత్ర’ను గురువారం పోచంపల్లి మునిసిపల్‌ చైర్మన్‌ తడక వెంకటేశ్వర్లుతో కలిసి ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. భూదానోద్యమం సమాజంలో సమానత్వం, సేవాభావం పెంపొందించడంలో కీలకపాత్ర పోషించిందన్నారు. పాదయాత్ర ద్వారా యువతలో సామాజిక స్పృహ పెంపొందించాలని కోరారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ తడక వెంకటేశ్వర్లు, సంఘమిత్ర సంస్థ చైర్మన్‌, ప్రొఫెసర్‌ తడక యాదగిరి, పట్నం కృష్ణకుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు భారత లవకుమార్‌, పోచంపల్లి అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ తడక రమేష్‌, పాదయాత్రికులు తడక నర్సింహ, కొయ్యడ నర్సింహగౌడ్‌, గుజ్జ సత్యనారాయణ, పట్నం పారిజాత, చక్రాల నర్సింహ, పిల్లలమర్రి దేవేందర్‌, రాపోలు జ్ఞానేశ్వర్‌, చింతకింది రమేష్‌ సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

భూదాన్‌ వజ్రోత్సవాల పాదయాత్ర సాగుతోంది ఇలా :

1951లో వినోబాభావే సేవాగ్రామ్‌ నుంచి పోచంపల్లి వరకు పాదయాత్రన వచ్చి భూదాన్‌పోచంపల్లిలో భూదానోద్యమానికి ఏప్రిల్‌ 18న అంకురార్పణ చేశారని అన్నారు. భూదాన యజ్ఞానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 18న నిర్వహించే వజ్రోత్సవం పురస్కరించుకుని శివరాంపల్లి నుంచి పోచంపల్లి వరకు పాదయాత్రను పోచంపల్లి మునిసిపాలిటీ, సంఘమిత్ర సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. గురువారం నుంచి 18 వ తేదీ వరకు పాదయాత్ర సాగనుంది. గురువారం రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని కస్తూర్బా ప్రకృతి చికిత్సాలయం నుంచి ఉదయం 9 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. రాత్రికి పెద్ద అంబర్‌పేటకు చేరుకుంటుంది. రాత్రి అక్కడే సత్యం టెక్నో స్కూల్‌లో బస చేసిన అనంతరం శుక్రవారం ఉదయం పెద్దఅంబర్‌పేట నుంచి పాదయాత్ర మొదలై బాటసింగారం మీదుగా పోచంపల్లి మండలం జలాల్‌పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ (ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ) వరకు కొనసాగుతుంది. తిరిగి శనివారం ఉదయం ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ నుంచి ప్రారంభమై జలాల్‌పురం నుంచి పోచంపల్లి చేరుకుంటుంది. పోచంపల్లి పట్టణంలోని చౌటుప్పల్‌ చౌరస్తాలోని ప్రథమ భూదాత వెదిరె రామచంద్రారెడ్డి విగ్రహావిష్కరణ అనంతరం వినోబామందిరం వరకు చేరుకుటుందని పాదయాత్ర నిర్వాహకులు తడక యాదగిరి, పట్నం కృష్ణకుమార్‌ తెలిపారు.

Updated Date - Apr 16 , 2026 | 11:41 PM