రహదారులే కల్లాలు
ABN , Publish Date - Apr 16 , 2026 | 11:39 PM
(ఆంధ్రజ్యోతి-భానుపురి): వరికోత సీజన్ వచ్చిందంటే రహదారులే ధాన్యం రాశులు ఆరబోసుకోవడానికి కల్లాలు అవుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి-భానుపురి): వరికోత సీజన్ వచ్చిందంటే రహదారులే ధాన్యం రాశులు ఆరబోసుకోవడానికి కల్లాలు అవుతున్నాయి. జాతీయ రహదారుల వెంట ఉన్న సర్వీసు రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్‌అండ్‌బీ రహదారుల్లో సగ భాగం పచ్చిధాన్యం తీసుకువచ్చి రైతులు ఆరబెడుతున్నారు. రోజుల తరబడి ఎండబెట్టుకుని ఐకేపీ, పీఏసీఎ్‌సల హమాలీలు కాంటాలు వేసే వరకు ఒక్కోచోట 10 రోజుల నుంచి 25 రోజుల వరకు రహదారులపై నిల్వ చేస్తున్నారు. దీంతో ఆయా రహదారులపై వెళ్లే ద్విచక్రవాహనదారులు, ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఆరబోసిన ధాన్యం మీదుగా ద్విచక్రవాహనదారులు వెళ్లినప్పుడు జారిపడి గాయాలపాలవుతున్నారు. రాత్రి వేళ ధాన్యం రాశులపైకి ద్విచక్రవాహనాలు వెళ్లి కొంతమంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. మూలమలుపులు ఉన్నచోట రాత్రిపూట కనిపించక ప్రమాదాల బారిన పడిన సందర్భాలూ చాలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలోని మోతె, చివ్వెంల, సూర్యాపేట మండలాల్లోని రహదారులపై అత్యధికంగా ధాన్యం ఆరబోశారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పశువులు, గొర్రెలు, ఇతర జంతువులను తీసుకెళ్లేందుకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోందని పశుపోషకులు వాపోతున్నారు. దీనికి తోడు ధాన్యం రాశులను ఆరబోయడానికి, దగ్గరకు చేర్చడానికి ట్రాక్టర్లు, ఎక్స్‌కవేటర్లను వాడుతుండటంతో రహదారి సైతం దెబ్బతింటోంది.
నిరుపయోగంగా పొలాల వద్ద కల్లాలు
పొలాల వద్ద కల్లాల ఏర్పాటుకు గత ప్రభుత్వం ఉపాధిపథకం కింద నిధులు కేటాయించింది. కల్లాల సామర్థ్యాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు నిధులను రైతుల ఖాతాల్లో జమచేశారు. అంతేకాకుండా కల్లాల నిర్మాణం కోసం పంచాయతీ, ఉపాధిహామీ, వ్యవసాయాధికారులు అవగాహన సదస్సులు నిర్వహించారు. నిర్మాణాలు చేసుకున్న రైతులు బిల్లులు తీసుకున్నారు. అయితే రైతులు మాత్రం ఎక్కడా కూడా వ్యవసాయ క్షేత్రాల్లోని కల్లాలు వాడుతున్న దాఖలాలు కనిపించడంలేదు. కొద్దిమంది మాత్రమే కల్లాలను సద్వినియోగం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వరి కోతల సీజన్‌కు ముందే పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, జాతీయరహదారుల అధికారులు ధాన్యం రాశులు ఆరపోయవద్దని ఎలాంటి అవగాహనలు కల్పించడం లేదు. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రహదారులపై ధాన్యం రాశులు ఆరబెట్టకుండా అధికారులు, పోలీసుశాఖ అవగాహణ కల్పించాలని వాహనదారులు వేడుకుంటున్నారు.
తాలు తీస్తేనే కొంటాం..
ధాన్యం దిగుమతుల్లో మిల్లర్ల కొర్రీ
మండుటెండలో అన్నదాతల పాట్లు
మిర్యాలగూడ వ్యవసాయం, ఏప్రిల్ 16, (ఆంధ్రజ్యోతి): ఓ వైపు మండుటెండలు, ఊపిరాడని ఉక్కపోత, ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. నాగార్జునసాగర్ ఆయకట్టులోని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ఎగుమతి చేస్తున్న ధాన్యంలో తాలు ఉందని మిల్లర్లు దిగుమతి చేసుకోవడంలేదు. ఒకవేళ చేసుకోవాల్సి వస్తే క్వింటాకు 5-10 కిలోలు తరుగు తీస్తామంటున్నారు. నష్టాన్ని భరించలేని రైతులు అన్ని కొనుగోలు కేంద్రాలలో ఒకేసారి ట్రాక్టర్ ఫ్యాన్‌ఽ శుద్ధి చేసే యంత్రాలు, కూలీల కొరత ఉన్న చోట ఎక్స్‌కవేటర్ సహాయంతో ధాన్యాన్ని రైతులు(తాలు తీయడం)ఎగబోస్తున్నారు. వేసవి కావడంతో కూలీల సమస్య తీవ్రంగా ఉండటంతో రైతులు స్వయంగా ధాన్యం ఎగపోసే పనులు చేపడుతున్నారు. ట్రాక్టర్ ఫ్యాన్‌కు గంటకు రూ.800 వరకు చెల్లించాల్సి వస్తోందని, కూలీల ఖర్చుతో కలిసి ఎకరానికి రూ.800 వరకు ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కేవలం ఎగబోసిన ధాన్యం మాత్రమే నిర్వాహకులు మిల్లులకు తరలిస్తున్నారు. ధాన్యం నాణ్యతగా ఉన్న కొందరు మిల్లర్లు ఏ-గ్రేడ్ మద్దతు ధర క్వింటాకు రూ.2,389 చెల్లించకుండా సాధారణ రకం కింద రూ.2,369 ధర చెల్లిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. మిల్లర్లు ఏదో ఒక రకంగా ధర తగ్గిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల కాలంలో కొనుగోలు కేంద్రాల్లో ఇ ప్పటివరకు దొడ్డురకం ధాన్యం ఎగబోసి తీసుకుపోవడం ఇదే మొదటిసారిని వారు వాపోతున్నారు.. ప్రభుత్వ మద్దతు ధర చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
మే నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలి
పెద్దఅడిశర్లపల్లి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : అక్కంపల్లి రిజర్వాయర్ ఎత్తిపోతల పనులను వచ్చే నెల చివరి నాటికి పూర్తి చేయాలని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలో ఏకేబీఆర్ ఎత్తిపోతల పనులను పరిశీలించి, చిలకమర్రి స్టేజీ సమీపంలో మెయిన్ డెలివరీ సిస్టర్న్ పనులను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎత్తిపోతల పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలన్నారు. పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ ఎత్తిపోతల ద్వారా పీఏపల్లి రెవెన్యూ, గుడిపల్లి మండలంలోని చిలకమర్రి, సూరేపల్లి, రోళ్లకల్లు గ్రామాల కింద 4,609 ఎకరాలు, అదేవిధంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు మండలంలోని పాల్వాయి, షాఖాజీపురం, పార్లపల్లి, కాల్వపల్లి, పాశవానిగూడెం, మక్కంపల్లి గ్రామాల్లోని 2,082 ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుంటుందన్నారు. రూ.90.96 కోట్లతో 6,691 ఎకరాల ఆయకుట్టకు సాగునీరు అందించేందుకు నిధులు మంజూరు అయ్యాయన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ శ్రీనివా్‌సరెడ్డి, ఎస్‌ఈ భద్రునాయక్, ఈఈ సత్యనారాయణ, డీఈ నాగయ్య, ప్రజాప్రతినిధులు, రైతులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.