బియ్యం బాగాలేవు, ధర్నా చేద్దాం
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:22 AM
ముద్దయిన అన్నం ఎలా తింటారన్న తల్లిదండ్రులతో యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు సాం ఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల వంట ఏజెన్సీ కాంట్రాక్టర్ దబాయింపునకు దిగాడు.
ప్రశ్నించిన తల్లిదండ్రులతో వంట ఏజెన్సీ కాంట్రాక్టర్
మోత్కూరు, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : ముద్దయిన అన్నం ఎలా తింటారన్న తల్లిదండ్రులతో యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు సాం ఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల వంట ఏజెన్సీ కాంట్రాక్టర్ దబాయింపునకు దిగాడు. బియ్యం బాగాలేవు, అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా చేద్దాం పదండి అంటూ మాట్లాడారు. ఉగాది పండుగ సందర్భంగా తమ పిల్లలను చూసేందుకు మోత్కూరులోని గురుకుల బాలుర హాస్టల్‌కు వచ్చిన తల్లిదండ్రులు పండుగ పూట ముద్దయిన అన్నం వడ్డించడాన్ని ప్రశ్నించారు. పిల్లలు ఎలా తింటారంటూ వంట ఏజెన్సీ కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన బియ్యం బాగా లేవు, అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా చేద్దాం పదండి నేనూ వస్తా అంటూ వారిని దబాయించాడు. అధికారులకు చెప్పాలి కదా అంటే ప్రిన్సిపాల్‌కు చెప్పా, నాకేం సంబంధం అంటూ సమాధానమిచ్చారు. ప్రిన్సిపాల్‌ను పిలిపించడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. సంఘటనా స్థలానికి వచ్చిన ఓ ఉపాధ్యాయుడు సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తానని చెప్పి శాంతింపజేశారు. ఈ విషయమై ఇనచార్జి ప్రిన్సిపాల్ వెంకటస్వామిని వివరణ కోరగా రెండు రోజుల క్రితం వచ్చిన బియ్యం బాగాలేవని, ఈ విషయాన్ని గోదాం ఇనచార్జి దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఆయన బియ్యం మార్చుతానని చెప్పారని, ఈ రోజు సెలవు కావడంతో మార్చలేదన్నారు. శుక్రవారం మార్పించి అన్నం మంచిగా వండిస్తానన్నారు.