Share News

వరి ఎండుతోంది

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:38 AM

ఓ వైపు రోజు రోజుకూ పెరుగుతున్న ఎండల ప్రభావం.. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటడానికి తోడు అప్రకటిత విద్యుత్‌ కోతలతో మునుగోడు నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయి. ప్రధానంగా పొట్ట దశలో ఉన్న వరి చేలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

వరి ఎండుతోంది

ఎండలతో అడుగుంటుతున్న భూగర్భజలాలు

అప్రకటిత విద్యుత్‌ కోతలతో పొట్టదశలో నెర్రెలు బారిన పొలాలు

బోరుమంటున్న రైతులు

(ఆంధ్రజ్యోతి,మునుగోడు): ఓ వైపు రోజు రోజుకూ పెరుగుతున్న ఎండల ప్రభావం.. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటడానికి తోడు అప్రకటిత విద్యుత్‌ కోతలతో మునుగోడు నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయి. ప్రధానంగా పొట్ట దశలో ఉన్న వరి చేలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

నియోజకవర్గంలో ఎలాంటి సాగు నీటి వనరులు లేవు. బోరు బావుల ఆధారంగానే సుమారు 24,560 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అత్యధికంగా మునుగోడు మండలంలో వరి సాగు కాగా, అత్యల్పంగా గట్టుప్పల్‌ మండల పరిధిలో సాగైంది. ఒక్కో రైతు ఎకరాకు రూ.35వేల నుంచి రూ.45వేల వరకు పెట్టుబడులు పెట్టారు. కొందరు రైతులు కౌలుకు తీసుకొని అప్పుచేసి పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం నీటి ఎద్దడి కారణంగా బోరు బావుల కింద సాగు చేసిన వరి చేలు నెర్రెలు బారాయి. కొన్ని చోట్ల విద్యుత్‌ సరఫరాలో అప్రకటిత కోతల కారణంగా వరి పొట్ట దశలో నిలువునా ఎండిపోతుండటంతో రైతులు బోరుమంటున్నారు.

అన్ని గ్రామాల్లో అదే పరిస్థితి

మునుగోడు మండలంలోని కల్వలపల్లి, ఊకొండి, సింగారం, పులిపలుప్పల, బీరెల్లిగూడెం, గంగోరిగూడెం, రత్తిపల్లి, గూడాపూర్‌, కాశవారిగూడెం, కచలాపురం, మునుగోడు, గుండ్లోరిగూడెం, ఎల్గలగూడెం, కచలాపురం, పలివెల, కోతులారం, చల్మెడ తదితర గ్రామాల్లో వరి చేలు ఎండిపోయాయి. దీంతో సాగు కోసం చేసిన వ్యయం, ఆరుగాలం శ్రమ వృథాగా మిగిలింని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొట్ట దశలో ఉన్న వరిని రక్షించుకునేందుకు కొత్తగా బోర్లు వేయిస్తు న్నా ఫలితం ఉండటం లేదు. 400 నుంచి 650 ఫీట్ల లోతు వరకు చుక్క నీరు రావడం లేదని రైతులు వాపోతున్నారు. కొందరు రైతులు ట్యాంక్లర్ల ద్వారా వరి పొలానికి నీరు పెడుతున్నారు. అద్దెకు తెచ్చి ఎన్ని ట్యాంకర్ల నీరు పోసినా పొలం పారడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి 10 ట్యాంకర్లు నీటిని పోయించినా పారడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తలాపునే కృష్ణమ్మ ఉన్నా..

మునుగోడు నియోజకవర్గానికి సమీపంలోనే కృష్ణా నది పరువళ్లు తొక్కుతోంది. తూర్పు, ఉత్తరం, దక్షిణంగా మూడు దిక్కుల్లో కూత వేటు దూరంలో కృష్ణా నది ప్రవహిస్తుండగా, ఇక్కడి భూములు మాత్రం సాగునీటికి నోచుకోవడం లేదు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన శివన్నగూడెం రిజర్వాయర్‌ నిర్మాణ పనులు పూర్తికాలేదు. ఉదయ సముద్రంపై నిర్మించిన బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్‌ నుంచి కూడా నీరు రావడం లేదు. సమీపంలో నీటి వనరులు ఉన్నా నియోజవర్గానికి ప్రయోజనం లేకుండా పోయింది.

రైతులను ఆదుకోవాలి: గురిజ రామచంద్రం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి

తీవ్ర వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటాయి. యాసంగిలో రైతులు సాగు చేసిన వరి నిలువునా ఎండిపోయింది. ప్రభుత్వం బాధిత రైతులకు రూ.40వేలు పరిహారంగా చెల్లించి ఆదుకోవాలి. ఎలాంటి నీటి వనరులు లేకుండా మగ్గుతున్న నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరివ్వాలి. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్ట్‌ నుంచి గతంలో నిర్దేశించిన ప్రకారం సాగునీటిని మళ్లించాలి.

ఎండిన చేలో పశువులు మేపుతున్నం : పాలకూరి అంజయ్య, రైతు, సింగారం

నాకున్న మూడెకరాలతో పాటు మరో మూడెఎకరాలు కౌలుకు తీ సుకొని బోరు బావుల ఆధారంగా వరిసాగు చేస్తున్నా.ఎకరానికి రూ.40వేల వరకు వ్యయం వచ్చిం ది. వర్షాలు లేక బోరు ఎండిపోయింది. కొత్తగా రెండు బోర్లు వేయిస్తే రూ.60వేల ఖర్చు కా గా, చుక్క నీరు రాలేదు. సాగు చేసిన పొలంలో ఐదెకరాల విస్తీర్ణంలో వరి పొట్ట దశలో నిలువునా ఎండిపోయింది. దీంతో చేలో పశువులను మేపుతున్నా.

నేడు రైతుల ధర్నా

మునుగోడుకు ఉదయసముద్రం బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్ట్‌ ద్వారా సాగు నీరందించాల ని డిమాండ్‌ చేస్తూ ఉదయ సముద్రం రైతాంగ వేదిక ఆధ్వర్యంలో 16న నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించనున్నారు. నియోజకవర్గంలో దీర్ఘకాలంగా నెలకొన్న సాగు, తాగు నీరు, ఫ్లోరైడ్‌ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడి ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేయగా, రైతులు మరోమారు ఆందోళన బాటపట్టారు. ఇక్కడి సమస్యలను ఏకరువు పెడుతూ కళాకారుడు గట్టుపల్లి నర్సిరెడ్డి ఆలపించిన పాటలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ప్రతీ గ్రామం నుంచి ఇంటికొకరు చొప్పున ధర్నాకు స్వచ్ఛందంగా తరలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు.

Updated Date - Mar 16 , 2026 | 12:38 AM