రెచ్చిపోతున్న ఇసుకాసురులు
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:07 AM
వాగులను కొల్లగొట్టి ఇసుక అక్రమ రవాణా చేస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలో అడ్డూ అదుపులేకుండా ఇసుక మాఫీయా యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తోంది.
వాగులను కొల్లగొట్టి రవాణా
సొమ్ము చేసుకుంటున్న మాఫియా
ప్రభుత్వ ఆదాయానికి గండి
ఫిర్యాదు చేస్తే తప్ప స్పందించని రెవెన్యూ, పోలీస్ అధికారులు
ముందు ఎస్కార్ట్ వాహనాలు, వెనుక ఇసుక ట్రాక్టర్లు
(ఆంధ్రజ్యోతి,డిండి): వాగులను కొల్లగొట్టి ఇసుక అక్రమ రవాణా చేస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలో అడ్డూ అదుపులేకుండా ఇసుక మాఫీయా యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తోంది. ముందు ఎస్కార్ట్ వాహనాలు వెళ్తుండగా, వెనుక నుంచి ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్లు వెళ్తున్నాయి. ఈ వ్యవహారమంతా అర్ధరాత్రి సాగుతుండగా, ఎవరైనా సమాచారం ఇస్తే తప్ప పోలీసులు, రెవెన్యూశాఖ అధికారులు స్పందించడం లేదు.
గత ఏడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు వాగుల్లోకి ఇసుక కొట్టుకు వచ్చింది. మండలంలోని దుందుభివాగు, వావిల్‌కోల్, బ్రహ్మణపల్లి, కందుకూ రు, డి.నెమలిపూర్ గ్రామాల వాగులతోపాటు దుందుభినది పరివాహక ప్రాంతంలోని జేత్యతండా, కాల్యతండా, బొగ్గులదోన, గోనబోయినపల్లి, ప్రతా్‌పనగర్ గ్రామాలు ఇసుక అక్రమ రవాణాకు కేంద్రాలుగా మారాయి. డిండి ప్రాజెక్టు ఎగువన నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల, వంగూరు మండలాల నుంచి కూడా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. గత పది నెలల వ్యవధిలో పోలీసులు ఇసుక రవాణా చేస్తున్న 28 ట్రాక్టర్లను సీజ్ చేసి 21 కేసులు నమోదు చేశారు. అయినా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టపడటంలేదు. మండలంలోని ఒక్క గోనబోయినపల్లి గ్రామంలోనే 40 ట్రాక్టర్లు ఉండగా, అందులో 30 నుంచి 35 ట్రాక్టర్లు ఇసుక రవాణా చేస్తున్నట్టు సమాచారం. ఇసుకను తరలించేందుకే ఈ గ్రామస్థులు ట్రాక్టర్లు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
మాఫియాకు రాజకీయ అండదండలు?
ఇసుక ట్రాక్టర్ పోలీసులకు పట్టుబడగానే సర్పంచ్ స్థాయి మొదలు ఆపైస్థాయి నాయకుల నుంచి పోలీసులకు, రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు వస్తున్నాయి. పట్టుబడిన ట్రాక్టర్లను విడిచిపెట్టాలని ఇసుకాసురు లు పైరవీలు చేస్తున్నారు. రాజకీయ అండదండలతో నే ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపులేకుండా యథేచ్ఛగా సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. పట్టుబడింది మా వాడే.. చూసి విడిచి పెట్టండి.. అం టూ పలువురు రాజకీయ నాయకులు అధికారులకు ఫోన్‌చేస్తున్నట్టు సమాచారం.
దుందుభినది పరివాహకంలో భారీగా డంపులు
డిండి వాగు ఒడ్డున ఇసుక మాఫియా భారీగా ఇసుక డంపులు చేసి రాత్రివేళల్లో అక్రమంగా రవాణా చేస్తోంది. వ్యవసాయ పొలాల్లో వెయ్యి ట్రిప్పులకుపైగా ఇసుక డంపులు ఉన్నట్లు సమాచారం. ఈ ఏడా ది మార్చి 6న సుమారు 140 ట్రాక్టర్ల ఇసుక డంపును రెవెన్యూ, పోలీస్ అధికారులు సీజ్ చేశారు. ఇదే గ్రామ సమీపంలోని దాసరిఏనెకు దిగువన ఇసుక డంపులు ఇప్పటికీ ఉన్నాయి. మండలంలో ని వాగు ఒడ్డున ఉన్న తొమ్మిది గ్రామాల పరిధిలో రోజూ లక్షల రూపాయలు విలువచేసే ఇసుక వ్యాపారం నడుస్తోంది. అంతేగాక ఏటా కోట్ల రూపాయల ప్రభు త్వ ఆదాయానికి ఇసుకాసురులు గండికొడుతున్నారు. ఇసుకకు డిమాండ్ పెరగడంతో మాఫియా రూ.6,000 నుంచి రూ.6500లకు ట్రాక్టర్ ఇసుకను విక్రయిస్తున్నారు. రెవెన్యూ అధికారులు తాము ఇసుక తరలించేందుకు ఎవ్వరికీ అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారు.
నామమాత్రంగా జరిమానాలు
అప్పుడప్పుడు పట్టుబడిన ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు మైనింగ్‌శాఖ కు అప్పగిస్తున్నారు. ఈశాఖ నామమాత్రంగా రూ.5వేలు చలనా రూపంలో జరిమానా విధిస్తుండగా, దాన్ని చెల్లించి య జమానులు ట్రాక్టర్లను తీసుకెళ్తున్నారు. మైనిశాఖ విడిచిపెట్టిన ట్రాక్టర్లలోని ఇసుక ను వాటి యజమానులు రూ.6,000 పైగా ధరకు విక్రయిస్తున్నారు. ట్రాక్టర్లను మళ్లీ ఇసుక అక్రమ రవాణాకు వినియోగిస్తున్నారు. పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకు న్న ఇసుక డంపులను మైనింగ్‌శాఖ నిర్ణయించిన ధరకు అధికారులు విక్రయిస్తున్నారు.
టాక్టర్ డ్రైవర్లుగా మైనర్లు
చురుకుగా ఉండే మైనర్లను ట్రాక్టర్ డ్రైవర్లుగా ఇసుక మాఫియా ఎంచుకుంటోంది. ఇసుక అందుబాటులో ఉండే గ్రామాల నుంచి తరలించి సొమ్ము చేసుకోవచ్చనే ఆశతో కొందరు ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నారు. వాగులతోపాటు దుందుభినది తీర ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో అధిక సంఖ్యలో ఉన్న ట్రాక్టర్లు ఇసుక తరలిస్తున్నాయి.
ఓ కానిస్టేబుల్‌పై ఆరోపణలు?
ఇసుక మాఫియాతో కలిసిపనిచేస్తున్నట్టు ఓ పోలీస్ కానిస్టేబుల్‌పై ఆరోపణలు వినవస్తున్నాయి. పోలీసుల దాడి సమాచారాన్ని ఇసుక మాఫియాకు చేరవేస్తున్నట్టు, అందుకు ప్రతిఫలంగా ట్రాక్టర్ యజమానుల నుంచి నెలనెలా కొంత ముడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్‌ఐ సెలవుపై వెళ్లిన రోజుల్లో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నట్టు తెలుస్తోంది. సారా తయారీకి వినియోగించే నిషేధిత నల్లబెల్లం, పౌరసరఫరాల బియ్యం, గంజాయి రవాణా చేసేవారి నుంచి కూడా సదరు కానిస్టేబుల్‌కు నెలవారీ మాముళ్లు అందుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెంచాం: బాలకృష్ణ, ఎస్‌ఐ
ఇసుక అక్రమం రవాణా జరిగే ప్రధాన రహదారులపై సిబ్బందితో నిఘా పెంచాం. గత 10 నెలల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 28 ట్రాక్టర్లను సీజ్ చేసి 21 కేసులు నమోదు చేశాం. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.
ఇసుక తరలింపునకు అనుమతులు లేవు: హనుమంతు శ్రీనివా్‌సగౌడ్, తహసీల్దార్
మండలంలోని వాగుల నుంచి ఇసుక తరలించేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. గృహ నిర్మాణాల కోసం ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకొని దేవరకొండ మండలంలోని గొట్టిముక్కల ఇసుక రీచ్ నుంచి ఇసుక పొందాల్సి ఉంటుంది. సీజ్ చేసిన ఇసుక డంపులను మైనింగ్‌శాఖ నిర్ణయించిన ధర ప్రకారం అవసరమైన వినియోగదారులకు విక్రయిస్తాం. పట్టుబడిన వాహనాలను మైనింగ్‌శాఖకు అప్పగిస్తాం. మొదటిసారి పట్టుబడిన ఇసుక ట్రాక్టర్‌కు రూ.5వేలు, రెండోసారి పట్టుబడితే రూ.15వేలు జరిమానా విధిస్తాం. త్వరలో మండలంలోని వావిల్‌కోల్, బ్రాహ్మణపల్లి వాగుల వద్ద ఇసుక రీచ్‌ను ఏర్పాటుచేస్తాం.
ఇసుక కోసం 40కిలోమీటర్లు వెళ్తున్నాం:తండు చంద్రయ్య, బొగ్గులదోన
నూతన గృహ నిర్మాణాలకు ఇసుక కోసం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకొండ మండలంలోని గొట్టిముక్కల వాగు నుంచి తీసుకోవాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే ట్రాక్టర్‌కు రూ.6వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇసుక కొరతతో గృహ నిర్మాణాలు ముందుకు సాగడంలేదు. వినియోగదారులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మండలంలోని ఏదైన ఒక వాగును ప్రభుత్వం గుర్తించి ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేయాలి. వినియోగదారుడికి ఇసుక సులభంగా, తక్కువ ధరకు అందుబాటులోకి తేవాలి.