గుప్పుమంటోన్న గుడుంబా
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:19 AM
జిల్లాలో గుడుంబా మళ్లీ గుప్పుమంటోంది. గ్రామా లు, తండాల్లో నాటుసారా తయారీ కుటీర పరిశ్రమగా మారింది. అనేకమంది నాటుసారా తయారుచేసి విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు.
జిల్లాలో యథేచ్ఛగా తయారీ, విక్రయాలు
జోరుగా నల్లబెల్లం, పటిక రవాణా
ఏడాదిలో 776 మందిపై కేసులు
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట): జిల్లాలో గుడుంబా మళ్లీ గుప్పుమంటోంది. గ్రామా లు, తండాల్లో నాటుసారా తయారీ కుటీర పరిశ్రమగా మారింది. అనేకమంది నాటుసారా తయారుచేసి విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. మద్యం కొనుగోలుకు పెద్దమొత్తంలో ఖర్చు అవుతుండటంతో తక్కువ ధరకు వచ్చే నాటుసారా వైపు మద్యం ప్రియులు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ ఏడాదిలో 2,984 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకోవడంతో పాటు 776 మందిపై కేసులు నమోదు చేశారు. 132 వాహనాలను సీజ్ చేశారు.
జిల్లాలో నాటుసారా విక్రయాలు పుంజుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జిల్లాకు సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, పటికను తరలిస్తున్నారు. ప్రతి రోజూ రూ.లక్షల్లో బెల్లం, పటిక విక్రయాలు సాగుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో నాటుసారా తయారీ ఎక్కువగా సాగుతున్నట్లు సమాచారం. నాటుసారా తయారీని నియంత్రించేందుకు కొన్నేళ్ల క్రితం ప్రత్యేక చర్యలు చేపట్టారు. నాటుసారా తయారీ,విక్రయాలపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను గుర్తించి వారికి అవగాహన కల్పించారు. గుడుంబా పునరావాస పథకం కింద జిల్లావ్యాప్తంగా 300మందికి ఉపాధి కల్పించారు. దీంతో కొన్నాళ్ల పాటు జిల్లాలో సారా తయారీ, విక్రయాలు తగ్గాయి. కానీ ఇటీవల పెద్ద ఎత్తున సాగుతున్నట్లు చెబుతున్నారు.
కూలి పనులు మానుకుని...
జిల్లాలో సూర్యాపేట, చివ్వెంల, పెన్‌పహాడ్, పాలకవీడు, మఠంపల్లి, చింతలపాలెం, మేళ్లచెర్వు, నూతనకల్, అర్వపల్లి, మద్దిరాల, మోతె, ఆత్మకూర్(ఎస్), తుంగతుర్తి, అనంతగిరి, తిరుమలగిరి, మండలాల్లో నాటుసారా జోరుగు తయారవుతోంది. పెన్‌పహాడ్ మండలంలో నాటుసారా తయారీ బట్టీలు ఉన్నట్లు సమాచారం. అనేకమంది కూలీ పనులు మానుకుని నాటు సారా తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నారు. సారాను ప్యాకెట్లలో నింపి పట్టణాలకు తరలించి విక్రయిస్తున్నారు. ఎక్కువగా కార్మికులు, పేదలు నివసించే ప్రాంతాలల్లో విక్రయాలు జరుపుతున్నారు.
తాజాగా ..
తాజా జిల్లా పోలీసులు సూర్యాపేట పట్టణంలోని బలరాంతం డా, మేళ్లచెర్వు మండలం హేమ్లాతండా, రామాపురం, చింతలపా లెం మండల కేంద్రంలో, గరిడేపల్లి మండలం కుతుబ్షాపురం, కల్మలచెర్వు, పెన్‌పహాడ్ మండలం జల్మాల్కుంటతండా, చిన్నసీతారాంతండా, మోతె మండలం రాయికుంటతండా, కూడలి, మఠంపల్లి మండలం బీల్యానాయక్‌తండా, బా డవతండా, ఆత్మకూర్(ఎ్‌స)మండలం మంగలితండా, పాలకవీడు మండలం సజ్జాపురం, తిరుమలగిరి మండ లం తొండ, కేఆర్కేతండాల్లో దాడులు చేశారు. 70 లీటర్ల నాటుసా రా, 130 లీటర్ల బెల్లంపానకం స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదుచేశారు. లాల్సింగ్తండాలో మంగళవారం రాత్రి ఎస్ఐ బాలునాయక్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. బానోతు సైదమ్మ ఇంట్లో ఐదు లీటర్లు సారాయిని పట్టుకున్నారు. సైదమ్మపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాలునాయక్ తెలిపారు.
అనారోగ్యంతో జేబులు గుల్ల...
నాటుసారాకు అలవాటు పడి అనారోగ్యానికి గురవుతున్నారు. నాటుసారాతో కిడ్నీలు, లివర్, జీర్ణాశయ ప్రేగులతో పాటు రక్తం లో కలవడం వలన ఆక్సీజన్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఆస్పత్రులకు వెళ్లి రూ.లక్షలు వెచ్చించి చికిత్స చేయించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా అనారోగ్యానికి గురై తుంగతుర్తి, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లోని పలు గ్రామాలు, తండాల్లో అనేకమంది అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. శరీరంలోని అవయవాలు చెడిపోవడానికి ప్రధానంగా సాటునారా కారణంగా వైద్యాధికారులు చెబుతున్నారు.
ఈ ఏడాది నమోదైన కేసులు
జిల్లాలో ఈ ఏడాది నాటుసారా తయారీ, విక్రయాలతో పాటు బెల్లం, పటిక రవాణాకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందుకు సంబంధించి 2,984 లీటర్ల నాటుసారా, 54,290 లీటర్ల బెల్లం పానకం, 13,873 కిలోల బెల్లం, 1,243 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. 776 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు 132 వాహనాలను సీజ్ చేశారు.
ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం
జిల్లాలో నాటుసారాను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారు. కేవలం మద్యం విక్రయాలపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదులు చేస్తేనే అడపాదడపా దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. నల్లబెల్లం, పటిక రవాణా, సారా తయారీ విషయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడంలేదు. దీంతో సారా తయారీ, విక్రయాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది.
- మిగతా 8వ పేజీలో...
దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నాం: కొత్తపల్లి నర్సింహ, ఎస్పీ
జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహించి నాటుసారా తయారీ, విక్రయదారులపై కేసులు నమోదు చేస్తున్నాం. నల్లబెల్లం, పటిక రవాణాపై నిఘా ఏర్పాటు చేస్తాం. గుడుంబా తయారీదారులకు అవగాహన కల్పిస్తాం. తిరిగి వారి దినచర్యపై కూడా దృష్టి సారిస్తాం. నాటుసారా తయారీని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతాం. బెల్లం విక్రయాలపై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం. సారా తయారీదారులను రూ.5 లక్షల పూచీకత్తుపై బైండోవర్ చేస్తాం.