వేధిస్తోన్న స్టాంపుల కొరత
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:42 AM
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతున్నా ఆస్తుల, క్రయ విక్రయదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తరచుగా నాన్ జ్యుడీషియల్ బాండ్ పేపర్ల కొరత ఏర్పడుతోంది.
సకాలంలో ఇండెంట్ పెట్టని రిజిస్ట్రేషన్ శాఖ
అఫిడవిట్లు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లకు ఆటంకం
బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి
నల్లగొండ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతున్నా ఆస్తుల, క్రయ విక్రయదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తరచుగా నాన్ జ్యుడీషియల్ బాండ్ పేపర్ల కొరత ఏర్పడుతోంది. రూ.20, రూ.50, రూ.100 విలువైన స్టాంపుల సరఫరాలో అంతరాయం కలుగుతున్నట్లు సమాచారం. దీనివల్ల ఆస్తుల క్రయవిక్రయదారులు అత్యధికంగా డబ్బులు చెల్లించి బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని సమాచారం. ప్రభుత్వంతోపాటు అధికారులు సైతం ఏ మాత్రం కొరత లేదని చెప్పడం తప్ప ఆచరణలో ఎదురవుతున్న ఇబ్బందులపై దృష్టిసారించడం లేదన్న విమర్శలున్నాయి. బాండ్ పేపర్లు లేక పోవడంతో అఫిడవిట్లు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లకు ఆటంకాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఏటా ప్రభుత్వానికి సుమారు రూ.300కోట్ల నుంచి రూ.350కోట్ల వరకు ఆదాయం వస్తున్నా మెరుగైన సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలున్నాయి.
ప్రతీ ఆరు నెలలకు ఇండెంట్ పెట్టాల్సి ఉండగా..
స్టాంపులకోసం ప్రతీ ఆరు నెలలకోసారి సంబంధిత శాఖ ఇండెంట్ పెటాల్సి ఉంటుంది. అయితే ఉమ్మడిజిల్లాలో ఉన్న 15 కార్యాలయాల్లో కొన్ని కార్యాలయాల్లో డాక్యుమెంట్లు నమోదు, రిజిస్ట్రేషన్లు అధికంగా ఉండటంతో ఆయా ప్రాంతాల్లో అధికంగా విక్రయాలు ఉంటా యి. మరికొన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్లు నమోదు తక్కువగా ఉండటంతో అక్కడ స్టాంపులు తక్కువగా ఉంటున్నాయి. అధికారులు సబ్‌రిజిస్ట్రార్‌లతో సమన్వయం లేకపోవడంతో ఏ ప్రాంతానికి ఎంత నాన్ జ్యుడీషియల్ బాండ్ పేపర్లు అవసరం ఉం టుందనేది గ్రహించకపోవడం గమనార్హం. అధికారులు, ఉద్యోగుల మధ్య కూడా సఖ్యత లేకపోవడంతోనే ఈ సమస్యలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తలెత్తుతున్నాయి. ఇండెంట్ పెట్టిన ప్రతీసారి రూ.2.50కోట్ల నుంచి రూ.3కోట్ల వరకు బాండ్ పేపర్ల కోసం ప్రతిపాదనలు పంపి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ కమిషనరేట్ నుంచి ఈ బాండ్ పేపర్లను సరఫరా చేస్తారు. అయితే కొంతకాలంగా సకాలంలో ఇండెంట్ పెట్టకపోవడంతో బ్లాక్‌లో విక్రయాలు పెరిగిపోయాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 250మంది వరకు స్టాప్ వెండర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరికీ సబ్‌రిజిస్ట్రార్లు సరఫరా చేస్తారు. స్టాంప్‌వెండర్లు చలాన్లు కట్టిన ప్రకారం పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ప్రత్యేకంగా బాండ్ పేపర్లను విక్రయిస్తారు. అయితే బాండ్ పేపర్లు సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయాల్లో తక్కువగా ఉంచడంవల్ల వెండర్లు స్టాం పుల కొరతను సృష్టించి అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. కొన్నిసార్లు ఫ్ర్యాకింగ్ మిషన్ల ద్వారా స్టాంపింగ్ చేస్తుంటారు. అవి కూడా మరమ్మతులు వస్తుండటంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆదాయం ఉన్నా ప్రభుత్వం మాత్రం సొంత భవనాలు నిర్మించకపోవడం, స్టాంపుల కొరతను పట్టించుకోక పోవడం గమనార్హం.