Share News

రాజకీయాల కోసమే..ప్రతిపక్షాల రాద్ధాంతం

ABN , Publish Date - May 29 , 2026 | 12:16 AM

రాష్ట్రంలో ధాన్యం సేకరణకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంటే.. రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికే 57లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి, రూ.10,097 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.

రాజకీయాల కోసమే..ప్రతిపక్షాల రాద్ధాంతం

చివరి ధాన్యంగింజ కొనే వరకూ సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది

తడిసిన ధాన్యం సైతం కనీస మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం

సమీక్షా సమావేశంలో పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

యాదాద్రి, మే 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ధాన్యం సేకరణకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంటే.. రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికే 57లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి, రూ.10,097 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. గురువారం రెవె న్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన జిల్లాలో పర్యటించారు. అనంతరం కలెక్టరేట్‌లో ప్రభుత్వ విప్‌,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య,ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, రాష్ట్ర మహిళా ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్‌ బండ్రు శోభారాణిలతో కలిసి ధాన్యం సేకరణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్‌ అనురాగ్‌జయంతి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 2.75లక్షల మెట్రిక్‌ టన్నుల ఽధాన్యం సేకరణ పురోగతిని సాధించినట్లు వివరించారు. మిగతా కొనుగోళ్లు వేగవంతం చేస్తున్నామన్నారు. ఇందుకోసం అవసరమైన స్టోరేజీ సదుపాయాలను పెంచుతున్నట్లు వివరించారు.

ధాన్యం సేకరణపైనే దృష్టి

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం మొత్తం రాబోయే నాలుగైదు రోజులు ధాన్యం సేకరణపై దృష్టి కేంద్రీకరించి కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు సైతం ధాన్యం కొనుగోళ్లకు అధికారులకు సహాయ, సహకారాలు అందించాలన్నారు. ఇసుక లారీలను, పరిశ్రమల లారీలను ధాన్యం సేకరణకే వినియోగించాలన్నారు. రాష్ట్రంలో స్థానిక హమాలీలు చాలా వరకు తగ్గిపోయారని, బెంగాల్‌, బీహార్‌ హమాలీలే ఎక్కువగా ఉన్నారని, ఎన్నికలు, అక్కడి రాష్ట్ర పరిస్థితుల కారణంగా సమస్య ఉత్పన్నమైందన్నారు. రైతు పండించిన చివరి ధాన్యం గింజవరకూ కొనుగోలు చేస్తామన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసినా, కనీస మద్దతు ధరకు వెంటనే కొనుగోళ్లు జరిపి, దానిని బాయిల్డ్‌ రైస్‌ మిల్లింగ్‌కు తరలిస్తున్నామన్నారు. ఇటీవల జిల్లాతోపాటు ఇతర జిల్లాల్లో తడిసిన 9వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ధాన్యం సేకరణ జరిగిన 48 గంటల్లో రైతు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులనుంచి ధాన్యం సేకరణలో కనీస మద్దతు ధర ప్రకటించడం తప్ప, రైతులకు చేసిందేమీ లేదన్నారు. బీఆర్‌ఎస్‌ తన పదేళ్ల పాలనలో జరిపిన ధాన్యం కొనుగోళ్లకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా చేశామన్నారు. ఆ ప్రభుత్వం కనీసం కేంద్ర టార్గెట్‌ కూడ పూర్తి చేయలేక పోయిందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా రైతులను ఆందోళనకు గురిచేయడం తప్ప, చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్‌ రైతు ప్రభుత్వమని, రైతుల కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేయడానికైనా వెనుకాడబోమన్నారు. సమావేశంలో పౌరసరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, జిల్లా అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, కె.వెంకారెడ్డి, డీఆర్‌డీవో నాగిరెడ్డి, భువనగిరి, చౌటుప్పల్‌ ఆర్డీవోలు ఎం.కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ హరికృష్ణ, పౌరసరఫరాల అధికారి రోజారాణి, జిల్లా సహకార అధికారి మురళీరమణ, డిటీవో సాయికృష్ణ, డీఏవో వెంకట రమణారెడ్డి, డీఎంవో సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.

ప్రతిపక్షాల మాయలో పడొద్దు...

వంగపల్లిలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కలెక్టర్‌ పనితీరు భేష్‌

యాదగిరిగుట్ట రూరల్‌: ప్రజలు ప్రతిపక్షాల మాయలో పడొద్దని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని వంగపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు బీర్ల అయిలయ్య, వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కలెక్టర్‌ అనురాగ్‌ జయంతితో కలిసి పరిశీలించారు. కేంద్రంవద్ద రైతులు చిన్నం మల్లయ్య, రేపాక రాంచందర్‌ తదితర రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులున్నాయి.. లారీలు రోజూ వస్తున్నాయా? అని ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు లేవని, ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేసి గోదాములకు తరలిస్తున్నారని రైతులు మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కొనుగోళ్లు వేగవంతంగా పూర్తిచేయాలని, అక్కడి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొనుగోలు చేసిన ధాన్యం నిల్వలకు అవసరమైన గోదాముల సమీకరణలో భాగంగా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలోని ఓ విత్తన సంస్థకు చెందిన గోదామును పరిశీలించారు. జిల్లాలో ధాన్యం సేకరణకు అవసరమైన గోదాము లను గుర్తించాలన్నారు. కలెక్టర్‌ అనురాగ్‌జయంతి పని విధానం భేష్‌గా ఉందని కితాబిచ్చారు. రామాజీపేట గోదాంలో నిల్వచేసిన ధాన్యాన్ని పరిశీలించారు. వంగపల్లి రైల్వే గేట్‌ వేయడంతో 10 నిమిషాలపాటు గేట్‌వద్దనే మంత్రుల వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో ఎస్పీ అక్షాంశ్‌యాదవ్‌, మహిళా కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ బండ్రు శోభారాణి, గుట్ట మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గుండ్లపల్లి వాణీభరత్‌గౌడ్‌, సర్పంచ్‌ రవళిరాణాప్రతాప్‌, నాయకులు చీర శ్రీశైలం, కానుగు బాలరాజ్‌గౌడ్‌, గుండ్లపల్లి భరత్‌గౌడ్‌, ముక్కెర్ల మల్లే్‌షయాదవ్‌, డీఏవో వెంకటరమణారెడ్డి, డీఎస్పీ శ్రీనివా్‌సనాయుడు తదితరులు పాల్గొన్నారు.

రైతులకు సంకెళ్లు వేసిన వాళ్లే..ఇప్పుడు మొసలి కన్నీళ్లు..

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

రాష్ట్రంలో తమ పాలనలో రైతులకు సంకెళ్లు వేసి, జైల్లో పెట్టిన నాయకులు ప్రస్తుతం మొసలి కన్నీళ్లు పెడుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి విమర్శించారు. ధాన్యం అంటే ఏమిటో తెలియని ప్రధాన ప్రతిపక్షాలు రోడ్డెక్కి రాద్దాంతం చేస్తున్నాయన్నారు. తమది రైతు ప్రభుత్వమని, రైతు సమస్యల పరిష్కారంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ముందుండి పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బస్సు యాత్రలతో కల్లాల వద్ద ఫొటోలకు ఫోజులు ఇచ్చి, తమ బాధ్యతలను విస్మరిస్తున్నారని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ధాన్యం కొనుగోళ్లు చేయించాలన్నారు. మీరు బస్సు యాత్రలతో ఫోజులు ఇస్తే ప్రజలు నమ్మరన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ధాన్యం దిగుబడి పెరుగుతుందని, ఏటా దిగుబడి పెరగడంతో ధాన్యం సేకరణలో కొన్ని సమస్యలు వచ్చినా, సకాలంలో పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Updated Date - May 29 , 2026 | 12:16 AM