Share News

పేరు ఒకరిది.. పెత్తనం మరొకరిది

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:14 AM

సూర్యాపేట జిల్లాలో మత్స్యకార్మిక సంఘాల పాలకవర్గాలపై వ్యాపారుల పెత్తనంతో కార్మికుల కడుపు నిండని పరిస్థితులు దాపురించాయి. చెరువులు, కుంటల్లో చేప పెంపకాన్ని మత్స్యకారులే చేపట్టి, విక్రయించుకుని ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం నిబంధన పెట్టినా ఉపయోగం ఉండడంలేదు.

పేరు ఒకరిది.. పెత్తనం మరొకరిది

(ఆంధ్రజ్యోతి-భానుపురి)

సూర్యాపేట జిల్లాలో మత్స్యకార్మిక సంఘాల పాలకవర్గాలపై వ్యాపారుల పెత్తనంతో కార్మికుల కడుపు నిండని పరిస్థితులు దాపురించాయి. చెరువులు, కుంటల్లో చేప పెంపకాన్ని మత్స్యకారులే చేపట్టి, విక్రయించుకుని ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం నిబంధన పెట్టినా ఉపయోగం ఉండడంలేదు. కాంట్రాక్టర్ల వద్ద అడ్వాన్సగా(అప్పుగా) తీసుకున్న డబ్బులను పాలకమండళ్లు కార్మికులకు బాగాలుగా పంపిణీ చేస్తున్నారు. ఆ తర్వాత మత్స్యసంపదను తక్కువ ధరకు విక్రయిస్తుండటంతో కాంట్రాక్టరుకు సంఘం బాకీపడాల్సి వస్తోంది. ఇవి కాస్తా రూ.లక్షల నుంచి రూ.కోట్లకు చేరుతున్నాయి. దీంతో మత్స్యకార్మికులకు రావాల్సిన లబ్ధి అందకపోగా చెరువు, కుంటల్లోని మత్స్యసంపదపై కాంట్రాక్లర్ల పెత్తనం అనధికారింగా పెరిగిపోతోంది.

ముందస్తు చెల్లింపులతో...

చెరువులు, కుంటల్లో చేపలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను అందజేస్తోంది. వాటిని పెంచి మార్కెట్‌లో విక్రయించుకునే బాధ్యతను మత్స్యసహకార సంఘాలకు అప్పగించింది. ఇంతవరకు బాగానే ఉన్నా చేపల పెంపకం కోసం సహకార సంఘాలు వ్యాపారుల నుంచి అడ్వాన్సులు తీసుకుంటున్నాయి. వాటిని మత్స్యకార్మికులకు పంపిణీ చేస్తున్నాయి. అయితే చేపల పెంపకంతో వచ్చే ఆదాయం కన్నా కాంట్రాక్టర్ల వద్ద తీసుకున్న అప్పులే పెరిగిపోతుండటం ఆందోళనకు గురిచేస్తోందని మత్స్యకార్మికులు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్‌లో కిలో చేపకు రూ.110 నుంచి రూ.130 ధర పలుకుతున్నా రూ.35 నుంచి రూ.50లు మాత్రమే చెల్లిస్తున్నారు. వారు చెప్పిన ధరకు ఇవ్వకుంటే అప్పులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నట్లు పాలకమండలి బాధ్యులు మత్స్యకార్మికులను నమ్మిస్తున్నారు. సూర్యాపేటలోని ఓ సంఘంలో రూ.2.5 కోట్ల మేర అప్పు పేరుకుపోయినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా 5 నుంచి 10 పెద్ద చెరువులను తమ ఆధీనంలో ఉండడానికి పాలకమండళ్లకు అప్పులు (అడ్వాన్సలు) ఇచ్చి మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 10 మందికి పైగా కాంట్రాక్టర్లు ఆయా ప్రాంతాల్లోని చెరువులపై పెత్తనం చేలాయిస్తూ చేపల వ్యాపారం కొనసాగిస్తున్నారని మత్స్యకార్మికులు ఆరోపిస్తున్నారు.

కొత్త వారి నుంచి భారీగా వసూళ్లు

జిల్లా వ్యాప్తంగా 165 మత్స్యసహకార సంఘాలు ఉన్నాయి. సుమారు 16,500 మంది మత్స్యకార్మికులు సభ్యులుగా ఉన్నారు. సూర్యాపేట, కోదాడ, యాతవాకిలా, వాయిలసింగారం, బేతవోలు, నామవరం, నాగయ్యగూడెం, పాలవరం, గరిడేపల్లి, హుజూర్‌నగర్‌, చౌటపల్లి, ఈటూరు, పసునూరు, తిరుమలగిరి, తుంగతుర్తి, వర్ధమానకోట, మఠంపల్లి, మేళ్లచెర్వు, కందిబండ, కలకోవ, గుడిబండ, యర్కారం, పిల్లలమర్రి, యండపల్లిలో పెద్ద చెరువులు ఉన్నాయి. ఆయా ప్రాంతాలతో పాటు మరికొన్ని చెరువులు సైతం పెద్దవి జిల్లాలో ఉన్నాయి. సహకార సంఘాల్లో కొత్త వారికి సభ్యత్వాలు ఇచ్చేందుకు కొన్నిచోట్ల వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నైపుణ్య పరీక్షల్లో నెగ్గించేందుకు ఖర్చుగా చెప్పి వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మత్స్యసహకార సంఘంలో కొత్త సభ్యత్వాలు ఇవ్వాలని తీర్మానం చేయగా 350 మందికి నైపుణ్య పరీక్షలు పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే జుట్టు భాగం పేరుతో కొత్త సభ్యత్వాలు చర్చలు జరిపినట్లు సమాచారం. సభ్యత్వం ఉన్న వారి కుమారులకు, బంధువులకే(జుట్టు భాగం)మాత్రమే సభ్యత్వాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త సభ్యత్వాలకు రూ.వేలల్లో వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 350 మంది సభ్యులకు కొత్త సభ్యత్వాలు ఇస్తుండడం, మరో మూడు నెలలో పాలకమండలి గడువు ముగుస్తుండడంతో వసూళ్లు భారీగానే చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అనధికార అప్పులతో సంబంధం లేదు

సూర్యాపేట మత్స్య సహకార సంఘంలో కొత్తగా 350 మందికి నైపుణ్య పరీక్షలు నిర్వహించాం. కోర్టు ఉత్తర్వులు ఉండడంతో కొత్త వారికి పరీక్షలు నిర్వహించాం. సభ్వత్వాల పేరుతో డబ్బులు వసూళ్లు విషయం మా దృష్టికి రాలేదు. ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సంఘాలకు సంబంధించి అనధికార అప్పులకు ప్రభుత్వానికి, మత్స్యశాఖకు సంబంధం లేదు.

నాగులు, మత్స్యశాఖ సూర్యాపేట జిల్లా అధికారి.

Updated Date - Apr 02 , 2026 | 12:14 AM