Share News

వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఆదాయం అంతంతే!

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:01 AM

వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు విధించిన ఆదాయం లక్ష్య సాధన అంతంత మాత్రంగానే ఉంది. జిల్లాలోని ఐదు మార్కెట్‌ కమిటీలకు లక్ష్యాన్ని రెండు మాత్రమే సాధించాయి.

వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఆదాయం అంతంతే!

జిల్లాలో అయిదింటిలో లక్ష్యాన్ని సాధించినవి రెండే

మూడింటిలో వెనుకబాటే

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు విధించిన ఆదాయం లక్ష్య సాధన అంతంత మాత్రంగానే ఉంది. జిల్లాలోని ఐదు మార్కెట్‌ కమిటీలకు లక్ష్యాన్ని రెండు మాత్రమే సాధించాయి. మరోవైపు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు జిల్లాలో కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతున్నా.. ఆ నిధులను రైతుల ప్రయోజనాలకు వినియోగించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఆదాయం సమకూర్చుకోవడంలో చతికిలబడుతున్నాయి. రైతులు పండించిన వరి, జొన్నలు, కందులు, పెసర్లు వంటి పప్పుదినుసులు, చింతపండు తదితర వ్యవసాయ దిగుబడుల కొనుగోళ్లపై మార్కెట్‌ సెస్సుల రూపేణా ఆదాయం సమకూరుతోంది. వీటితో పాటు గోదాములు, దుకాణ సముదాయాలు వేరుగా ఆదాయాలు పొందుతుంటాయి. రైతులు పండించే పంటలను వ్యాపారులు కొనుగోలు చేసే మార్కెట్‌ ఫీజులు, ఇతరత్రా ఆదాయాలను ఆయా మార్కెట్లలో రైతులకు వసతులు, ప్రయోజనం చేకూరే విధంగా గ్రామీ ణ రహదారులు, ఇతరత్రా అభివృద్ధి పనులకు వినియోగిస్తుంటారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు ఆదాయ మార్గాలను నిర్దేశించి, ప్రతీ సంవత్సరం లక్ష్యాలను అధిగమించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్‌ శాఖ పర్యవేక్షిస్తుంది. జిల్లాలో ఐదు మార్కెట్‌యార్డ్‌లు వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు, తదితర ఆదాయ మార్గాల ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.24,96, 63,000 ఆదాయం లక్ష్యం కాగా, సాధనలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఐదు మార్కెట్‌ యార్డుల మొత్తం ఆదాయం రూ.23,43,34,000 మాత్రమే వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన లక్ష్యం కంటే రూ.1,53,29,000 ఆదాయం తక్కువ సాధించాయి.

మార్కెట్‌ నిధుల వినియోగమేదీ?

వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు జిల్లాలో కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతున్నా.. ఆ నిధులను రైతుల ప్రయోజనాలకు వినియోగించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రైతులు పండించిన పంటల నిల్వలకు గోదాములు, మార్కెట్‌ యార్డుల్లో రైతులకు మౌలిక సదుపాయాలు సైతం సమకూర్చలేకపోతున్నారు. వర్షాలుపడితే మార్కెట్లలో సరైన యార్డులు లేక, వాటిపై కప్పులు లేకపోవడం కారణంగా అకాల వర్షాలు కురిస్తే ధాన్యం రాశులు తడిసి రైతులు నష్టపోయే పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా మార్కెట్‌ కమిటీలకు సమకూరే ఆదాయాన్ని మార్కెట్‌ యార్డుల అభివృద్ధికి, రైతులు పండించిన పంటలను గిట్టుబాటు ధర దక్కేవరకూ భద్రపరుచుకునే సదుపాయాలను కల్పించడానికి వ్యయంచేయాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

ఐదింటిలో లక్ష్యాన్ని సాధించిన మార్కెట్లు రెండు మాత్రమే

జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తులను రైతులు విక్రయించుకోవడానికి అనువుగా ఐదు మార్కెట్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం భువనగిరి, చౌటుప్పల్‌, మోత్కూరు, ఆలేరు, వలిగొండ మార్కెట్‌ కమిటీల ద్వారా జిల్లాలో పలు మార్కెట్‌ యార్డ్‌లు ఏర్పాటుచేసి, రైతులు పండించిన పంటలను వ్యాపారులు జరిపే కొనుగోళ్లను పర్యవేక్షిస్తుంటారు. అందుకుగాను మార్కెట్‌ సెస్‌ద్వారా ఈ మార్కెట్‌ కమిటీలకు ఆదాయం సమకూరుతోంది. ఆయా మార్కెట్‌ కమిటీల ఆదాయం పెంపుదల లక్ష్యంగా రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ ఆదాయ లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఆయా లక్ష్యాల సాధనకు మార్కెటింగ్‌ శాఖ అధికారులు వ్యాపారుల నుంచి సెస్సును వసూలు చేసి మార్కెట్‌ కమిటీ ఖజానాలకు జమ చేయాల్సి ఉంటుంది. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం జిల్లాలోని అయిదు మార్కెట్‌ కమిటీలకు రూ.24.96 కోట్లు లక్ష్యంగా నిర్ణయించగా, ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.23.43కోట్లు మాత్రమే సాధించింది. జిల్లాలోని అయిదు మార్కెట్‌ కమిటీల్లో భువనగిరి, మోత్కూరు మాత్రమే తమ లక్ష్యాన్ని సాధించగలిగాయి. భువనగిరి మార్కెట్‌ కమిటీకి నిర్దేశించిన ఆదాయం లక్ష్యం రూ.4.18 కోట్లుకాగా, దానిని అధిగమించి రూ.5,25,09,000 సాధించింది. మోత్కూరు మార్కెట్‌ కమిటీ ఆదాయ లక్ష్యం రూ.6,14,86,000 కాగా, రూ.6,30,16,000 ఆదాయం వచ్చింది. మరో మూడు మార్కెట్‌ కమిటీలు ఆలేరు, చౌటుప్పల్‌, వలిగొండ ఆదాయ సముపార్జనలో వెనుకబడ్డాయి. ఆలేరు మార్కెట్‌ కమిటీ ఆదాయం లక్ష్యం రూ.3.28 కోట్లు కాగా, కేవలం రూ.1,98,54,000 మాత్రమే సాధించింది. అదేవిధంగా చౌటుప్పల్‌ లక్ష్యం రూ.4,53,38,000లకుగాను రూ.4,16,55,000, వలిగొండ మార్కెట్‌ కమిటీ ఆదాయ లక్ష్యం రూ.6,82,39,000 ఆదాయ లక్ష్యానికి రూ.5,73,60,000 మాత్రమే సాధించగలిగాయి. దీంతో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలపై ప్రభావం చూపి మొత్తంగా రూ.1.54కోట్ల ఆదాయం వెనుకబడినట్లుగా మార్కెటింగ్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే మార్కెట్‌ యార్డుల లక్ష్యాల సాధనలో వెనుకబాటుకు పర్యవేక్షణ, తనిఖీల లోపంగా భావిస్తున్నారు.

జిల్లాలో వ్యవసాయ మార్కెట్ల ఆదాయ లక్ష్యం, సాధించిన ప్రగతి

మార్కెట్‌ లక్ష్యం ప్రగతి వ్యత్యాసం

ఆలేరు రూ.3,28,00,000 రూ.1,98,54,000 -రూ.1,29,46,000

భువనగిరి రూ.4,18,00,000 రూ.5,25,09,000 +రూ.1.07,09,000

చౌటుప్పల్‌ రూ.4,53,38,000 రూ.4,16,55,000 -రూ.36,83,000

మోత్కూరు రూ.6,14,86,000 రూ.6,30,16,000 +రూ.15,30,000

వలిగొండ రూ.6,82,39,000 రూ.5,73,60,000 -రూ.1,08,79,000

మొత్తం రూ.24,96,63,000 రూ.23,43,34,000 -రూ.1,53,29,000

Updated Date - Apr 11 , 2026 | 12:01 AM