Share News

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:25 AM

రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణాశాఖ సరికొత్త ఆలోచన చేసింది. రాత్రివేళల్లో జరిగే ప్రమాదాల నివారణ కోసం వాహనాలకు క్యూఆర్‌ రిఫ్లెక్టివ్‌ టేపులు ఏర్పాటు చేయాలని నిబంధనలు జారీ చేసింది.

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

రవాణా వాహనాలకు క్యూఆర్‌ రిఫ్లెక్టివ్‌ టేపులు

ఇటీవల అమలు చేసిన రవాణా శాఖ

ఒక్కో వాహనానికి రూ.3వేల నుంచి రూ.7వేల వరకు ఖర్చు

క్యూఆర్‌ రిఫ్లెక్టివ్‌ టేపులు ఉంటేనే వాహనాల ఫిట్‌నెస్‌

ఆర్థికంగా భారమంటున్న వాహనదారులు

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేటక్రైం): రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణాశాఖ సరికొత్త ఆలోచన చేసింది. రాత్రివేళల్లో జరిగే ప్రమాదాల నివారణ కోసం వాహనాలకు క్యూఆర్‌ రిఫ్లెక్టివ్‌ టేపులు ఏర్పాటు చేయాలని నిబంధనలు జారీ చేసింది. ప్రతీ గూడ్స్‌ వాహనంతోపాటు ట్యాక్సీ ప్లేట్‌ నెంబరు కలిగిన కార్లు, బస్సులు ఇతర వాహనాలన్నింటికీ ఈ రిఫ్లెక్టివ్‌ టేపులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. అయినా రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గడంలేదు. వాహనదారుల్లో మార్పు రాకపోవడం కూడా ప్రమాదాలకు కారణంగా భావిస్తున్నారు. దీంతో వాహనాలకు క్యూఆర్‌ రిఫ్లెక్టివ్‌ టేపులు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, భువనగిరిలో రవాణా శాఖ కార్యాలయాలున్నాయి. ఈ కార్యాలయాల పరిధిలో సుమారు 10వేలకు పైగా ట్యాక్సీ ప్లేట్‌ కలిగిన వాహనాలున్నాయి. నూతన విధానం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు వెయ్యి వాహనాలకు క్యూఆర్‌ రిఫ్లెక్టివ్‌ టేపులు ఏర్పాటు చేశారు.

రూ.3వేల నుంచి రూ.7వేల వరకు ఖర్చు

ఇటీవల అమల్లోకి తెచ్చిన క్యూఆర్‌ రిఫ్లెక్టివ్‌ టేపులు, రియర్‌ మార్కింగ్‌ ప్లేట్‌లను వాహనాలకు ఏర్పాటు చేయాలంటే వాహనాన్ని బట్టి ఒక్కో వాహనానికి రూ.3వేల నుంచి రూ.7వేల వరకు ఖర్చవుతుంది. ఈ క్యూఆర్‌ రిఫ్లెక్టివ్‌ టేపులు రవాణా శాఖ ఆధ్వర్యంలో కేటాయించిన ప్రత్యేక ఏజెన్సీ ద్వారానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఇతరుల వద్ద టేపులు ఏర్పాటు చేసుకుంటే రవాణా శాఖ అధికారులు అనుమతించరు. గతంలో వాహనాలకు ముందు, వెనుకభాగంలో పచ్చని, ఎర్రటి రంగుతో కూడిన రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేసేవారు. కానీ తాజాగా వాహనం ముందు, వెనుకతోపాటు రెండువైపులా కూడా స్టిక్కర్లు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. తాజాగా ఏర్పాటు చేసే టేపులపై తెలంగాణ రవాణా శాఖ లోగోతో కూడిన హాలోగ్రామ్‌ ఉంటుంది. ప్రతీ వాహనానికి ప్రత్యేక నెంబరుతో కూడిన క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. ఈ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే వాహనం పూర్తి వివరాలు తెలుస్తాయి.

రిఫ్లెక్టివ్‌ టేపులు ఉంటేనే..

రవాణా శాఖ ఇటీవల నూతనంగా అమలులోకి తెచ్చిన విధానంతో క్యూఆర్‌ రిఫ్లెక్టివ్‌ టేపులు వాహనాలకు ఉంటే నే ఆ వాహనాలకు రవాణా శాఖ అధికారులు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేయనున్నారు. వాహనాలకు ఏటా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంది. క్యూఆర్‌ రిఫ్లెక్టివ్‌ టేపు లు ఏర్పాటు చేశాక సంబంధిత ఏజెన్సీ ద్వారా ఒక ప్రత్యేక సర్టిఫికెట్‌ జారీచేస్తారు. ఆ సర్టిఫికెట్‌లో వాహన యజమానితోపాటు పూర్తి వివరాలు ఉండనున్నాయి. ఆ సర్టిఫికెట్‌ ఉంటేనే రవాణా శాఖ అధికారులు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేయనున్నారు. ఒకసారి క్యూఆర్‌ రిఫ్లెక్టివ్‌ టేపులు ఏర్పాటు చేసుకున్నాక రెండేళ్ల వరకు పని చేయనున్నాయి.

ఆర్థికంగా భారం

క్యూఆర్‌ రిఫ్లెక్టివ్‌ టేపుల విధానంతో వాహనాల యజమానులకు అదనంగా ఆర్థికంగా భారం పడుతుందని వాపోతున్నారు. ఇప్పటికే డీజిల్‌, ఇతర వాహనాల విడిభాగాల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న వాహన యజమానులపై రవాణా శాఖ ఇటీవల తీనుకున్న నిర్ణయం ఇబ్బందికరంగా ఉందంటున్నారు. ఇప్పటికే వాహనాల యజమానులు ఈ విషయమై ఆందోళనలు చేయడం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, రవాణా శాఖ అధికారులను కలిసి విన్నవించారు. అయినా నూతన విఽధానం యథావిధిగా కొనసాగుతుంది.

భారం పడుతుంది: గుండపనేని నాగేశ్వర్‌రావు, కోదాడ లారీ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు.

రవాణా శాఖ ఇటీవల తెచ్చిన నూతన విధానంతో వాహనాల యజమానులపై అదనంగా ఆర్థికభారం పడుతుంది. ఒక్కో లారీకి క్యూఆర్‌ రిఫ్లెక్టివ్‌ టేపులు ఏర్పాటు చేయాలంటే కనీసం రూ.7వేల వరకు ఖర్చొస్తుంది. ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న వాహనాల యజమానులకు నూతన విధానం మరింత భారం కానుంది. నూతన విధానం విషయంలో ప్రభుత్వం ఆలోచన చేసి మార్పు చేయాలి.

ప్రమాదాల నివారణకే ఈ విధానం :డాక్టర్‌ వాణి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ నల్లగొండ.

రాత్రి వేళల్లో జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రవాణా శాఖ ఇటీవల నూతన విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీంతో రాత్రివేళల్లో వాహనాలను రోడ్డు పక్కన నిలిపినా ఇతర వాహనదారులకు స్పష్టంగా కనపడనున్నాయి. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలుండవు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది మృతి చెందడంతో పాటు గాయపడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వాహనాల యజమానులు స్వాగతించాలి.

Updated Date - Apr 07 , 2026 | 12:25 AM