బడిని బాగుచేయడమే లక్ష్యం
ABN , Publish Date - May 11 , 2026 | 12:09 AM
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచి, విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందు లో భాగంగా ప్రభుత్వం ఈ నెల 11 నుంచి 17 వరకు విద్యావారోత్సవాలను నిర్వహించనుంది.
నేటి నుంచి విద్యావారోత్సవాలు
విద్యా సదుపాయాల మెరుగు, ప్రమాణాల పెంపే ధ్యేయం
ఈ నెల 17 వరకు కార్యక్రమాలు
పాఠశాలల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు
జిల్లాలో 17 పీఎంశ్రీ పాఠశాలలకు నిధుల మంజూరు
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి) : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచి, విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందు లో భాగంగా ప్రభుత్వం ఈ నెల 11 నుంచి 17 వరకు విద్యావారోత్సవాలను నిర్వహించనుంది. పాఠశాల విద్యను బలోపేతానికి చేపడుతున్న అంశాలపై అవగాహన కల్పించే లక్ష్యంగా ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యావారోత్సవాలను చేపట్టింది.
విద్యావారోత్సవాల్లో భాగంగా పాఠశాలల్లో ఇప్పటి కే మంజూరై అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేస్తారు. పూర్తిచేసిన పనులకు ప్రారంభోత్సవాలతోపాటు కొత్తగా ప్రతిపాదిత పనులకు శంకుస్థాపనలు సైతం చేపట్టనున్నారు. జిల్లాలో ఈ కార్యక్రమాల నిర్వహణకు 17 పీఎంశ్రీ పాఠశాలల్లో వివిధ పనులకోసం రూ.8.50లక్షలను ప్రభుత్వం మంజూరుచేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా తెచ్చిన సంస్కరణలతోపాటు బలోపేతానికి చేపడుతున్న చర్యలపై విద్యార్థు ల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధుల అవగాహన కోసం నియోజకవర్గస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యా ప్రమాణాల పెంపునకు తెస్తున్న సంస్కరణలను వివరించే పత్రాలతోపాటు ప్రత్యేక కిట్లు పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన పదో తరగతి విద్యార్థులు ముగ్గురికి, ఇంటర్ విద్యార్థులు ము గ్గురికి, ముగ్గురు ఉత్తమ క్రీడాకారులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున రూ.90వేల నగదు పురస్కారాల ను అందజేయనున్నారు. జిల్లాలో 712 ప్రభుత్వ పాఠశాలలు, 17 పీఎంశ్రీ పాఠశాలలు, 11కేజీవీబీ, 7 మోడ ల్ స్కూళ్లతోపాటు 11 ప్రభుత్వ జూనియర్ కళాశాల లు, 33 ప్రభుత్వ సంబంధిత శాఖలకు చెందిన రెసిడెన్షియల్ ఇంటర్ కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యాబోధనను అందిస్తున్నారు. ఈ ప్రభుత్వ విద్యాసంస్థ విద్యాబోధన మెరుగుపరిచే విధంగా చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలనే లక్ష్యంగా విద్యావారోత్సవ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది.
నేటి నుంచి వరుస కార్యక్రమాలు
సోమవారం నుంచి ఈ నెల 17 వరకు వారం రో జులపాటు చేపట్టే వరుస కార్యక్రమాలను జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది. ఈ నెల 11 (సోమవారం)రోజున జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తయిన సివిల్ పనుల ప్రారంభోత్సవాలు,కొత్తగా మం జూరైన పనులకు శంకుస్థానలు చేస్తారు. జిల్లాలోని 17పీఎంశ్రీ పాఠశాలల్లో సృజనాత్మక వేసవి శిబిరాలను ప్రారంభిస్తారు. రాజాపేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎ్‌స పీఎంశ్రీ పాఠశాలలో నిర్మించిన అదనపు త రగతి గదులు, సైన్స్ ల్యాబ్‌కు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ప్రారంభిస్తా రు. జిల్లావ్యాప్తంగాగల పలు ప్రభుత్వ పాఠశాలల్లో నాబార్డ్ నిధులతో నిర్మించిన టాయిలెట్స్,కిచెన్ షెడ్లు, తదితర మౌలిక వసతుల పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు.
ఈనెల 12(మంగళవారం)న పదో తరగతి అడ్డాన్స్‌డ్, సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకోసం రెమోడియల్ క్యాంపులను ప్రారంభిస్తారు. ఫెయిలైన విద్యార్థులు తిరిగి పరీక్షలు రాయడానికి పరీ క్ష ఫీజుల చెల్లింపులపై అవగాహన కల్పిస్తారు.
ఈ నెల 13(బుధవారం)న నియోజకవర్గస్థాయి లో ప్రజాప్రతినిధుల సదస్సులు నిర్వహిస్తారు. ఈ సదస్సులో నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, మునిసిపల్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లతో వర్క్‌షాపు ఉంటుంది. ప్రభుత్వ విద్యా పథకాల్లో స్థానిక సంస్థల భాగస్వామ్యం-అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల పాత్ర అనే అంశంపై చర్చ జరగునుంది. ఈ పథకాలపై అవగాహనకోసం ప్రత్యేకంగా రూపొందించిన కిట్టును అందజేయనున్నారు.
ఈ నెల 14(గురువారం)న జయశంకర్ బడి బాట కార్యక్రమం నిర్వహిస్తారు. ర్యాలీలు, తల్లిదండ్రుల సమావేశాలు, మెగా పీటీఎం నిర్వహించనున్నారు. ఉత్తమ హాజరు కనబర్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలను పంపిణీ చేస్తారు. అలాగే వంటల పోటీలను సైతం నిర్వహించనున్నారు.
ఈ నెల 15( శుక్రవారం)న గ్రంథాలయ దినోత్సవం నిర్వహిస్తారు. గ్రంథాలయాల్లో పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. ఉత్తమ పాఠకులను గుర్తించి సత్కరించనున్నారు.
ఈ నెల 16(శనివారం)న పాఠశాలల్లో కళావైభవం పేరిట సాంస్కృతిక దినోత్సవం నిర్వహిస్తారు. కోలాటం, లంబాడి నృత్యం, ఒగ్గుకథ వంటి జానపద కళారూపాల ప్రదర్శనలు, విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తారు.
ఈ నెల 17(ఆదివారం)న చివరి రోజున విద్యా విజయోత్సవాలు, ముగింపు వేడుకలను నిర్వహిస్తారు. పదో తరగతి, ఇంటర్, క్రీడల్లో జిల్లా టాపర్లను ఒక్కో విభాగంలో ముగ్గురు చొప్పున తొమ్మిది మందిని ఎంపికచేసి, ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున నగదు పురస్కరాలు, ప్రశంసాపత్రాలతో సత్కరిస్తారు.
విద్యా వారోత్సవాలను వియజవంతం చేయాలి : అనురాగ్‌జయంతి, కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగు, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించడానికి ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలి. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ఈ విద్యావారోత్సవాల్లో చేపట్టే ప్రతీ కార్యక్రమం ప్రభుత్వ విద్యపై ప్రజలకు అవగాహన కల్పించే వేదికగా నిలుస్తాయి. జిల్లావ్యాప్తంగా విద్యా వారోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నాం.