Share News

అన్నిరంగాల్లో అభివృద్ధే ధ్యేయం

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:48 AM

హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న భువనగిరి పట్టణాన్ని సమష్టి కృషితో హైదరాబాద్‌ నగర తరహాలో అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందామని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యేకుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

అన్నిరంగాల్లో అభివృద్ధే ధ్యేయం

హైదరాబాద్‌ నగర తరహాలో రూపుదిద్దుకుందాం

ఎన్నికల ఫలితాలపై సీఎం ప్రశంసలు

ఎంపీ చామల, ఎమ్మెల్యే కుంభం

బాధ్యతలు స్వీకరించిన చైర్‌పర్సన్‌ శ్రీవాణి

భువనగిరి టౌన్‌, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న భువనగిరి పట్టణాన్ని సమష్టి కృషితో హైదరాబాద్‌ నగర తరహాలో అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందామని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యేకుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి అన్నారు. గురువారం భువనగిరి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ల పదవీ బాధ్యతల స్వీకరణ వేడుకల్లో వారు మాట్లాడారు. ఎన్నికల ఘట్టం ముగిసినందున పార్టీలకతీతంగా మునిసిపల్‌ కౌన్సిల్‌ పట్టణ అభివృద్ధి పనులపై శ్రద్ధ చూపాలన్నారు. ఇప్పటికే రూ.65కోట్లతో అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. పట్టణాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌(యూసీఎఫ్‌) ద్వారా 60 శాతం నిధులు కేంద్రం, మ్యాచింగ్‌ గ్రాంట్‌గా రాష్ట్రం 40 శాతం ఇస్తుందని, దీంతో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ రూ.వందల కోట్లతో భువనగిరి పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. అలాగే త్రిపుల్‌ఆర్‌ లోపల ఉండడం, త్వరలో మూసీనదీ ప్రక్షాళన పనులు ప్రారంభం కానుండడం భువనగిరి పట్టణ అభివృద్ధికి కలిసి వచ్చే మరిన్ని అంశాలన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలైన రహదారులు, చౌరస్తాల విస్తరణ, ఇతర అభివృద్ధి పనుల హామీలన్నీ నెరవేరుస్తూ ప్రజాపాలన అందించాలన్నారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసించారన్నారు. నూతన చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌ పర్సన్‌ మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే మార్గదర్శకంలో పట్టణాభివృద్ధికి కౌన్సిల్‌ మొత్తం ఒక కుటుంబంలా కృషి చేస్తామన్నారు. ముందుగా పూజల అనంతరం చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కౌన్సిలర్లకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో కమిషనర్‌ జి.రామలింగం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎండీ అవేజ్‌చిస్తీ, మార్కెట్‌ చైర్మన్‌ రేఖ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:48 AM