ఎఫ్‌సీఐ లెవీ పెంపు పైనే బాయిల్డ్ రైస్ భవితవ్యం!
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:29 AM
ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ) లెవీ ద్వారా సేకరించే బాయిల్డ్ రైస్ కోటాను పెంచితేనే యాసంగి సీజనలో ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్ ప్రక్రియ సాఫీగా సాగనుంది.
ఇటీవలే కేంద్రమంత్రిని కలిసిన మంత్రి ఉత్తమ్
30లక్షల మెట్రిక్‌టన్నుల ఉప్పుడు బియ్యం తీసుకోవాలని విజ్ఞప్తి
కోటా పెరిగితే ఉమ్మడి జిల్లాలో యాసంగి ఽధాన్యం కష్టాలకు చెక్
ఈ సీజనలో 12లక్షల మెట్రిక్‌టన్నుల దొడ్డుధాన్యం దిగుబడి
ఎఫ్‌సీఐ తాత్కాలిక కోటా 4.68లక్షల మెట్రిక్‌టన్నులు
నల్లగొండ, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ) లెవీ ద్వారా సేకరించే బాయిల్డ్ రైస్ కోటాను పెంచితేనే యాసంగి సీజనలో ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్ ప్రక్రియ సాఫీగా సాగనుంది. రాష్ట్రంలో ఈ సీజనలో అత్యధికంగా బాయిల్డ్ రైస్‌కు ఉపకరించే ధాన్యం సుమారు 90లక్షల మెట్రిక్‌టన్నుల దిగుబడి అవుతుందని అంచనా. ఉత్తరాది రాషా్ట్రలతో పాటు తమిళనాడు, కేరళ, ఒడిషా రాషా్ట్రల్లో అత్యధికంగా బాయిల్డ్ రైస్ వినియోగం ఉంటున్నందున ఉప్పుడు బియ్యం సేకరణ పెంచాలని కేంద్రం నిర్ణయించింది. అయితే అందుకు సంబంధించి ఎఫ్‌సీఐ ద్వారా ఉత్తర్వులు రాకపోవడంతో బాయిల్డ్ రైస్ సేకరణపై మిల్లర్లు, అధికారుల్లో సందిగ్ధత కొనసాగుతోంది.
రాష్ట్రంలో నాణ్యమైన ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో ఈ సీజనలో 30 లక్షల మెట్రిక్‌టన్నుల ఉప్పుడు బియ్యాన్ని (5శాతం నూకతో) ఎఫ్‌సీఐ సేకరించేలా ఆదేశాలివ్వాలని కోరు తూ ఇటీవల సీఎం రేవంతరెడ్డి, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రమంత్రిని కలిసి కోరారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. తాజాగా, బుధవారం రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ జిల్లాల్లో కేంద్రం పూల్ కింద ఉప్పుడు బియ్యం సేకరణ నిమిత్తం తాత్కాలిక కోటాను ఖరారు చేసి ఉత్తర్వులు ఇచ్చారు. దీని ప్రకారం ఈ సీజనలో కేంద్రం పూల్ కింద ఎస్‌సీఐకి కేటాయించాల్సిన 13.60లక్షల మెట్రిక్‌టన్నుల ఉప్పుడు బియ్యానికి గాను, అవసరమైన 20లక్షల మెట్రిక్‌టన్నుల కోర్స్ వెరైటీ (దొడ్డు రకాలు) ధాన్యం సేకరించాలని కలెక్టర్లకు బుధవారం ఆదేశాలిచ్చారు. మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి మేరకు త్వరలో మరో 30లక్షల మెట్రిక్‌టన్నుల ఉప్పుడు బియ్యం కోటా కేటాయిస్తారని, దీనికి సంబంధించి ఆదేశాలొస్తే 42లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరణకు అవకాశం ఉంటుందని అంచనావేస్తున్నారు. ఈ వారం, పదిరోజుల్లో అదనపు కోటాకు సంబంధించి ఉత్తర్వులు వస్తాయనే ఆశాభావం అధికారవర్గాల్లో నెలకొంది.
ఉమ్మడి జిల్లాలో భారీగా దొడ్డు బియ్యం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాసంగిలో సుమారు 12లక్షల మెట్రిక్‌టన్నుల వరకు బాయిల్డ్ రై్‌సకు ఉపయోగించే ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేశారు. ఉమ్మడి జిల్లాలో యాసంగి సీజనలో దాదాపు 60శాతంపైగా దొడ్డురకాలే సాగుచేయడం ఆనవాయితీ. యాసంగిలో దొడ్డుధాన్యం మొత్తాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలుచేస్తోంది. ఆ తరువాత మిల్లర్లకు దొడ్డు ధాన్యాన్ని కేటాయిస్తోంది. దీంతో మిల్లుల్లో ఎక్కడ చూసినా ఉప్పుడు బియ్యం, దొడ్డు ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో ఈసారి మిల్లర్లు దొడ్డుధాన్యం దిగుమతి చేసుకోవడంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కేంద్రం ఎప్‌సీఐ లెవీని పెంచితే ఉమ్మడి జిల్లాలోనూ దొడ్డుబియ్యం మిల్లింగ్ ప్రక్రియ ఆటంకాల్లేకుండా సాగుతుందని, లేదంటే రైతులకు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. బుధవారం రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం తాత్కాలికంగా ఎఫ్‌సీఐ కోటా కింద ఈ సీజనలో ఉమ్మడి జిల్లాలో 4,68,869 మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరించాలని సూచించారు. అయితే ఉమ్మడి జిల్లాలో ఉత్పత్తయ్యే దొడ్డురకం ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం, మరోవైపు ఎఫ్‌సీఐ కోటా పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మంత్రి ఉత్తమ్ ప్రయత్నాలు ఫలిస్తే జిల్లాలో యాసంగి మిల్లింగ్ ప్రక్రియ సాఫీగా సాగుతుందని, లేదంటే రాష్ట్ర ప్రభుత్వంపై భారం తప్పదనే అభిప్రాయం అధికారవర్గాలు, మిల్లర్లలో నెలకొంది.
ఉమ్మడి జిల్లాలో బాయిల్డ్ రైస్ సేకరణ ఇలా..
జిల్లా 2024-25 యాసంగిలో 2025-26 యాసంగిలో
(మెట్రిక్‌టన్నుల్లో) (మెట్రిక్‌టన్నుల్లో)
నల్లగొండ 5,79,832 2,27,473
సూర్యాపేట 2,38,470 93,711
యాదాద్రి 3,76,452 1,47,685
మొత్తం 11,94,754 4,68,869