భయపెడుతోన్న భౌభౌ
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:36 AM
చిన్నారులు ఆడుకునేందుకు వీధుల్లోకి వెళ్లినా, దైనందిన కార్యకలాపాలకు బయటికి వెళ్లిన పెద్దవారైనా.. వీధుల్లో ఒంటరిగా సంచరిస్తుంటే ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి వీధి కుక్కలు దాడి చేస్తాయో తెలియని భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
భువనగిరిలో బాలుడిపై వీధికుక్కల దాడి
ప్రాణసంకటంగా మారిన కుక్కల బెడద
జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి
సగటున ప్రతీ నెల 1,000 మందికి కుక్కకాట్లు
అటకెక్కిన జంతు జనన నియంత్రణ
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి) :చిన్నారులు ఆడుకునేందుకు వీధుల్లోకి వెళ్లినా, దైనందిన కార్యకలాపాలకు బయటికి వెళ్లిన పెద్దవారైనా.. వీధుల్లో ఒంటరిగా సంచరిస్తుంటే ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి వీధి కుక్కలు దాడి చేస్తాయో తెలియని భయానక పరిస్థితులు నెలకొన్నాయి. భువనగిరిలో గురువారం వీధిలో ఒంటరిగా ఆడుకుంటున్న నాలుగే ళ్ల బాలుడిపై కుక్కలు దాడిచేసి, కనుగుడ్డును పీకేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన హృదయాలను కలిచివేస్తోంది. అదే రోజు మరో రెండు వీధుల్లో సైతం ఇద్దరు చిన్నారులపై కుక్కల దాడి చేశాయి. వీధి కుక్కల నియంత్రణకు, వాటి సంక్షేమానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చేపట్టాల్సిన చర్యలు పట్టణాలు, గ్రామాల్లో అమలుకావడం లేదు. దీంతో వాటి సంఖ్య గణనీయంగా పెరిగి గుంపులుగా సంచరిస్తూ దాడులకు తెగబడుతున్నాయి.
కుక్కకాటుతో గాయాలే కాదు.. రేబిస్ సైతం
వీధుల్లో కుక్కల బారిన పడుతున్న చిన్నారులు, పెద్దలకు గాయాలే కాదు కుక్కకాటు కారణంగా రేబిస్ వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉంది. కుక్కకాటుకు గురికావడమే కాదు కొన్నిసార్లు దాని లాలాజలం కారణంగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు వెంటనే బయటకు కనిపించకపోయినా మూడు మాసాల వరకు ఎప్పుడైనా బయటపడవచ్చు. జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు మొదట కనిపించి రోజులు గడుస్తున్న కొద్దీ ఆ మనిషి ప్రవర్తన విపరీతంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ కారణంగా కుక్కకాటుకు గురైన సందర్భంలో వెంటనే వైద్యులను సంప్రదించి యాంటి రేబీస్ చికిత్స తీసుకోవల్సి ఉంటుంది. జిల్లా కేంద్ర ఆస్పత్రి ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుక్కకాటుకు అవసరమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల్లో నమోదవుతున్న కుక్కకాటు కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. 2025 జనవరి నుం చి డిసెంబరు వరకు జిల్లా వ్యాప్తంగా 13,142 కుక్క కాటు కేసులు ఆస్పత్రుల్లో నమోదయ్యాయి. హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన కేసులు వీటికి అదనం. 2024లో జనవరి నుంచి డిసెంబరు వరకు 8,241 కేసులు నమోదుకాగా, 2025లో 4,901 ఘటనలు అదనంగా నమోదయ్యాయి. పెరుగుతున్న కుక్కల దాడులకు ఈ గణంకాలు అద్దంపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కుక్కల సంఖ్య గణనీయంగా పెరగడం, వీధుల్లో స్వేచ్ఛగా గుంపులుగా సంచరిస్తూ ఒంటరిగా వెళ్లే వ్యక్తులపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి. చిన్నారులు కనిపిస్తే వెంటపడి దాడులు చేస్తూ ప్రాణాలమీదికి తెస్తున్న సంఘటనలు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. గురువారం భువనగిరి పట్టణంలోని తారకరామనగర్ కాలనీకి చెందిన సందెల ప్రియాంశ్ అనే చిన్నారి సాయంకాలం ఆరుబయట ఆడుకునేందుకు రాగా, కుక్కల గుంపు మూకుమ్మడిదాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటనతో వీధి కుక్కలను అరికట్టడంలో స్థానిక మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 30వేలకు పైగా వీధి కుక్కలు
జిల్లాలో కుక్కకాటు ఘటనలు ఎక్కువగా నమోదవుతుండటంతో అధికారులు జిల్లాలో కుక్కల సంఖ్యను లెక్కించారు. 2024 జూలై మాసంలో జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలు, 427 పంచాయతీల్లో సుమారు 30వేలకు పైగా వీధి కుక్కలు ఉన్నట్టు సర్వేలో అంచనాకు వచ్చారు. అదే విధంగా కుక్కల బెడద నివారణకు కేంద్ర ప్రభుత్వ జంతు జనన నియంత్రణ (యానిమల్ బర్త్ కంట్రోల్) మార్గదర్శకాల ప్రకారం స్టెరిలైజేషన్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు భువనగిరి పట్టణ శివారులోని హన్మాపూర్ వద్ద రూ.45లక్షలతో స్టెరిలైజేషన్ సెంటర్ ఏర్పాటు చేసినా, అది నామమాత్రంగానే పనిచేస్తోంది. కుక్కలను పట్టుకుని స్టెరిలైజేషన్ చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన యానిమల్ వెల్ఫేర్ సొసైటీ ఒక్కోదానికి రూ.1,650 చార్జీ వసూలు చేస్తోంది. కొద్ది రోజులు మాత్రమే ఈ స్టెరిలైజేషన్ ప్రక్రియ కొనసాగి ఆ తరువాత నిలిచింది. స్టెరిలైజేషన్ చేసిన కుక్కలను మూడు, నాలుగు రోజులు వారి సంరక్షణలో ఉంచుకుని ఆ తర్వాత ఆ గ్రామంలోనే వదిలివేస్తుండటంతో శివారు ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువ కావడంతో ఆ గ్రామస్థుల ఆందోళనలతో స్టెరిలైజేషన్ ప్రక్రియ అర్ధాంతరంగా నిలిపివేశారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఆరు మునిసిపాలిటీల్లో ఇప్పటి వరకు 2,661 కుక్కలకు మాత్రమే స్టెరిలైజేషన్ చేశారు. జిల్లా కేంద్రం భువనగిరి మునిసిపాలిటీలో 1,774 వీధి కుక్కలకు, ఆలేరులో 26 కుక్కలకు, చౌటుప్పల్‌లో 236, మోత్కూరులో 120, పోచంపల్లిలో 316, యాదగిరిగుట్టలో 189 కుక్కలకు మాత్రమే స్టెరిలైజేషన్ ప్రక్రియను చేపట్టి ఆ తర్వాత చేతులు ఎత్తేశారు.
స్టెరిలైజేషన్ మాత్రమే కాదు.. పౌరుల బాధ్యత కూడా
కుక్కల నియంత్రణ, వాటి సంక్షేమంపై సుప్రీంకోర్టు సైతం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం మునిసిపాలిటీలు స్టెరిలైజేషన్‌తో పాటు వాటికి ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కానీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కార్యాచరణకు నోచుకోని పరిస్థితుల్లో పౌరులు కుక్కల నియంత్రణ, వాటి సంక్షేమానికి పలు జాగ్రత్తలు పాటించడం అవసరం. వీటిలో ప్రధానంగా మాంసం, చికెన్ సెంటర్ల వ్యర్థాలను, ఇళ్లలోని ఆహార పదార్థాలు, చెత్తను వీధుల్లో వేయకుండా, డంపింగ్ యార్డ్‌లకు మాత్రమే అప్పగించాలి. దీంతో కుక్కలకు ఆహారం అందుబాటులో లేని ప్రాంతాల నుంచి ఇతర ప్రదేశాలకు వలసవెళ్లే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఆ ప్రాంతంలో కుక్కల సంతానోత్పత్తి తగ్గి, బెడద కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. కుక్కలకు ఆహారం పెట్టే జంతు ప్రేమికులు సైతం జనసమర్ధం లేని ప్రదేశాల్లో, నిర్ణీత సమయాల్లో మాత్రమే పెట్టాలి. దీంతో కుక్కలు గుంపులుగా తిరిగి, బాటసారులపై దాడులు చేయకుండా ఉంటాయి. పెంపుడు కుక్కలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలి. వా టిని రోడ్లపై వదిలిపెడితే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. వాటికి కూడా స్టెరిలైజేషన్ చేయడం ద్వారా సంఖ్యను తగ్గించవచ్చు. కుక్కల ప్రవర్తనను అర్థం చేసుకోవడమేగాక, వాటిని వేధించకుండా ఉండేందుకు పాఠశాలల్లో విద్యార్థులకు, కాలనీల్లో ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
చిన్నారిపై కుక్కల దాడి కలిచివేస్తోంది
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు
ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
యాదాద్రి, మార్చి27(ఆంధ్రజ్యోతి): భువనగిరి పట్టణంలోని తారకరామనగర్‌లో నాలుగేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి, కుడికన్ను గుడ్డు ఊ డిపడిన ఘటన మనసును కలిచివేస్తోందని భు వనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆందోళ న వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన ధిల్లీనుంచి ఘటనపై కలెక్టర్ అనురాగ్‌జయంతి, మునిసిపల్ అధికారులతో మాట్లాడి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. గాయపడిన బాలుడి తండ్రి రాహుల్‌తో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. బాలుడికి చికి త్స ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని హామీఇచ్చారు. ధిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన వెంటనే ప్రియాంశ్‌ను పరామర్శించి, కుటుంబాని కి అండగా నిలుస్తానని చెప్పారు. జంతు జనన నియంత్రణ చట్టం తీసుకువచ్చి వీధి కుక్కలను నియంత్రించాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. మునిసిపల్ అధికారులు వీధి కుక్కలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజాప్రతినిధు లు, ప్రజలు వారి ప్రాంతాల్లో వీధి కుక్కల సమాచారం అధికారులకు అందించాలన్నారు.