చేపలొస్తున్నాయ్!
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:51 PM
చెరువుల్లోకి చేపలు రానున్నాయి. జిల్లాలోని అన్ని చెరువు లు, కుంటల్లో వీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలోని మొత్తం 661 జలాశయాల్లో 2,82,16,000 చేప పిల్లలను విడుదల చేయనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
చెరువులకు చేరనున్న చేప పిల్లలు
జిల్లాలో 2.82కోట్ల విత్తన చేపలు
661 చెరువులు, కుంటల్లో ఉచిత చేప పిల్లల పంపిణీ
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): చెరువుల్లోకి చేపలు రానున్నాయి. జిల్లాలోని అన్ని చెరువు లు, కుంటల్లో వీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలోని మొత్తం 661 జలాశయాల్లో 2,82,16,000 చేప పిల్లలను విడుదల చేయనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎల్‌నినో ప్రభావం.. వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లో నీరు చేరుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీకి కసరత్తు ప్రారంభించింది. జిల్లాలవారీగా చెరువులు, కుంటల ఆధారంగా చేపపిల్లల పంపిణీకోసం టెండర్ ప్రక్రియను చేపట్టింది. ఈ నెలాఖరు వరకు చేప (పిల్లల) విత్తన సరఫరా టెండర్లు జిల్లాలవారీగా పూర్తిచేసి, సెప్టెంబరు నెల నుంచి చెరువుల్లో చేపపిల్లలను వదలడానికి మత్స్యశాఖ అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు జిల్లాలోని 661 చెరువులు, కుంటల్లో సైతం భారీగా చేపపిల్లలను విడుదల చేసేందుకు జిల్లా మత్స్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
జిల్లాలో 2.82కోట్ల విత్తన చేపల విడుదల లక్ష్యం..
జిల్లాలో 161 పెద్ద చెరువులు, 469 చిన్న చెరువులు, కుంటలతోపాటు మూసీ పరివాహక ప్రాంతంలో మరో 20 చెరువులు ఉన్నాయి. అయితే మత్స్య శాఖ ఈ ఆర్థిక సంవత్సరం 661 చెరువులు కుంటల్లో చేప విత్తనాల విడుదలకు ప్రతిపాదించారు. ఈ చెరువుల్లో 2.82 కోట్ల చేప పిల్లలను వదిలిపెట్టి, మత్స్య సంపదను వృద్ధిచేసి, మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాలోని 511 చెరువుల్లో 35 మి.మీనుంచి 40 మి.మీ పొడవుగల చిన్న పరిమాణంగల 1,41,75,000, మరో 150 చెరువులు, కుంటల్లో 80 మి.మీ నుంచి 100 మి.మీ పొడవుగల పెద్ద పరిమాణం ఉన్న 1,40,41,000 చేప విత్తనాలను ఉచితంగా విడుదల చేయనున్నారు.
178 మత్స్యకారుల సంఘాలు.. 11,654మంది సభ్యులు
జిల్లా వ్యాప్తంగా 178 మత్స్య సహకార సంఘాలు, 20 మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో 11,564మంది సభ్యులు ఉన్నారు. వీరికి చేపల పెంపకం, ఉత్పత్తి, విక్రయాల ద్వారా మెరుగైన ఆదాయం కల్పించడానికి ప్రభుత్వం చేపపిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. చెరువులు, కుంటల్లో చేపల పెంపకానికి అవసరమైన విత్తన పిల్లలను మత్స్యకారులకు అదనపు ఖర్చులు చేకుండా ప్రభుత్వమే భరిస్తోంది. దీంతోని జిల్లాలోని ప్రధాన నీటి వనరులైన చెరువులు, కుంటల్లో మత్స్య సంపద అభివృద్ధికి ఉచిత చేపపిల్లల విడుదల కార్యక్రమాలను చేపడుతున్నారు.
నాణ్యమై న విత్తన చేపలపై దృష్టి
చేప పిల్లల ఎం పికలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని మత్స్యకారులు కోరుతున్నారు. నిర్ణయించిన పరిమాణంలో, ఆరోగ్యకరమైన చేపపిల్లలను చెరువులు, కుంటల్లోకి సరఫరా చేయడం.. (5వపేజీ తరువాయి): ద్వారానే మత్స్య సంపద అభివృద్ధి చెందనుంది. ఇందుకోసం మార్గదర్శకాలను, నియమ నిబంధనల ప్రకారం చేపల పిల్లల పంపిణీకోసం రాష్ట్రస్థాయిలో మత్స్యశాఖ జిల్లాలవారీగా టెండర్లు నిర్వహిస్తోంది. టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించగా, మొదటి విడతగా ఈ నెల 17న ఆఖరుగా నిర్ణయించారు. అయితే రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు చేపపిల్లలు సరఫరా చేయడానికి టెండర్లు దాఖలు చేయకపోవడంతో గడువును ఆగస్టు 20వ తేదీ వరకు పొడిగించారు. టెండరు దాఖలుకు ఆఖరు గడువు ముగిసిన వెంటనే టెండర్లు తెరిచిన అధికారులు సెప్టెంబరునుంచి చేపపిల్లలను చెరువుల్లో విడుదల చేయనున్నారు. జిల్లాలో గల నీటి వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకుని, గణనీయంగా చేపల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా కృషి చేయాలని ప్రభుత్వం కోరుతుంది. ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా రాబోయే సీజన్‌లో మత్స్య సంపద అదనపు ఆదాయం లభించే అవకాశాలు ఉంటాయని మత్స్యకారులు భావిస్తున్నారు.
జిల్లాలో చేప పిల్లల విత్తన పంపిణీ వివరాలు
చెరువుల సంఖ్య విత్తన పిల్లల సైజు చేపపిల్లల సంఖ్య
511 చెరువులు 35 మి.మీ-40 మి.మీ 1,41,75,000
150 చెరువులు 80 మి.మీ-100 మిమీ 1,40,41,0000
661 చెరువులు ....................... 2,82,16,000