Share News

మోత మోగింది

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:19 AM

రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువల సవరణను పలుమార్లు వాయి దా వేసి ఎట్టకేలకు శుక్రవారం నుం చి అమలులోకి తెచ్చింది. ఈసారి భూముల విలువలు పెరుగుతాయ నే అనుమానంతో ఆస్తుల క్రయ, విక్రయదారులు గురువారం వరకు పెద్ద మొత్తంలో స్లాట్లు బుక్‌ చేసుకొని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

మోత మోగింది

పెరిగిన రిజిస్ట్రేషన్ల భారం

ఉమ్మడి జిల్లాలో సగటున 50శాతం పెంపు

కమర్షియల్‌ ప్రాంతాల్లో 100శాతం పెరిగిన విలువ

జాతీయ రహదారి వెంట భారీ వడ్డన

ప్రభుత్వ ఖజానా నింపేలా అధికారుల కసరత్తు

వెలవెలబోతున్న నల్లగొండ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

(ఆంధ్రజ్యోతి,నల్లగొండ): రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువల సవరణను పలుమార్లు వాయి దా వేసి ఎట్టకేలకు శుక్రవారం నుం చి అమలులోకి తెచ్చింది. ఈసారి భూముల విలువలు పెరుగుతాయ నే అనుమానంతో ఆస్తుల క్రయ, విక్రయదారులు గురువారం వరకు పెద్ద మొత్తంలో స్లాట్లు బుక్‌ చేసుకొని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. తాజాగా, భూముల మార్కెట్‌ విలువలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అమలులోకి రాగానే రిజిస్ట్రేషన్లు తక్కువ సంఖ్యలో అయ్యాయి.

ఉమ్మడి జిల్లాలో సగటున 50శాతం వరకు భూ విలువలు పెరగ్గా, కమర్షియ ల్‌ ప్రాంతాల్లో భారీగా పెంచారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ అధికారులు పెద్దగా పెంపు లేదని చెబుతున్నా, ప్రాంతాల వారీగా పెరిగిన మార్కెట్‌ విలువలను చూస్తుంటే రిజిస్ట్రేషన్ల భారం అధికంగానే ఉంది. భూముల ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల తో పాటు అభివృద్ధి, పారిశ్రామిక ప్రాంతాలు ఉన్న చోట మార్కెట్‌ విలువలను 50శాతం మేర పెం చారు. గ్రామీణ, పట్టణాల్లో క్షేత్రస్థాయి అధ్యయనం చేసి శాస్త్రీయంగా మార్కెట్‌ విలువలను సవరించామని అధికారులు చెబుతున్నా, ఆస్తుల క్రయవిక్రయదారులకు భారీగానే భారం మోపారని తెలుస్తోంది. ధరలు పెరుగుతాయని ముందస్తు సమాచారంతోనే పాత ధరలకే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయా ల్లో పలువురు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు.

మార్కెట్‌ విలువల సవరణతో పెరగనున్న చార్జీలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భూముల విలువలు సవరణతో మార్కెట్‌ విలువ ప్రకారం అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో రిజిస్ట్రేషన్లు భారం కానున్నాయి. నల్లగొండ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో కమర్షియల్‌ ప్రాంతమైన ప్రకాశంబజార్‌లో ప్రస్తుతం గజం విలువ రూ.27,100 ఉండగా, ప్రభుత్వం మార్కెట్‌ విలువ పెంచడంతో రూ.40,700కు చేరింది. అంటే 50శాతం ఏకంగా పెరిగింది. అపార్ట్‌మెంట్లు ఎస్‌ఎఫ్టీ రూ.1,500 ఉండగా, రూ.1,800కు చేరింది. వీటీ కాలనీలో ప్రస్తుతం రోడ్డు వెంట గజం ధర రూ.17,600 ఉండగా, పెరిగిన మార్కెట్‌ విలువతో ధర రూ.26,000 చేరింది. ఇక్కడ 50శాతం మేర మార్కెట్‌ విలువ పెరిగింది. అదేవిధంగా నల్లగొండలోని బొట్టుగూడ ప్రాంతంలో ప్రస్తుతం రూ.2,400 ఉండగా రూ.4,700కు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో గజం రూ.500 ఉంటే, రూ.900కు పెరిగింది. వాస్తవానికి ఏటా కొంత మేరకు మార్కెట్‌ విలువలను సవరించాల్సిన ప్రభుత్వం ఏకంగా ఒకేసారి పెంచడంతో ఆస్తుల క్రయవిక్రయదారులపై భారం పెరిగింది. ప్రజలపై భారాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వ ఖజానాను నింపేలా మాత్రమే అధికారులు కసరత్తు చేశారని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సిన అధికారులు గతంలో ఉన్న మార్కెట్‌ విలువలను రెట్టింపు చేశారని, ఇది శాస్త్రీయంగా లేదని పలువురు పేర్కొంటున్నారు.

కట్టంగూరులో భారీగా పెరిగిన భూ విలువ

నకిరేకల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలోని కట్టంగూరు మండల కేంద్రంలో జాతీయ రహదారితో వెంట, మండల కేంద్రం నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో భూ విలువలను అమాంతం పెంచేశారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీ య రహదారి వెంట గతంలో రూ.3,100 మార్కెట్‌ విలువ ఉండగా, ప్రస్తుతం రూ.6200లకు పెంచారు. మండల పరిధిలోని కమ్మరివీధితో పాటు సినిమా థియేటర్‌ వెనుక ప్రాంతంలో రూ.2,300 మేర పెరిగింది. గ్రామపంచాయతీ ప్రాంతంలో కూడా గజానికి రూ.2,300 పెరిగింది. కట్టంగూరులోని నల్లగొండ రోడ్డులో గతంలో పాత మార్కెట్‌ ధర రూ.2,400 ఉండగా, ఏకంగా రూ.5,500కు పెంచారు. వ్యవసాయ భూముల విలువను సైతం భారీగా పెంచడంతో ఆస్తుల కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలో కూడా కమర్షియల్‌ ప్రాంతాల్లో 100శాతం మేరకు మార్కెట్‌ విలువలను పెంచారు. కొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో, రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉన్న చోట స్వల్పంగా పెంచినా, పలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరేలా మార్కెట్‌ విలువను పెంపుదల చేశారు. మార్కెట్‌ విలువలు పెరగడంతో స్టాంపు డ్యూటీ, ఇతర రిజిస్ట్రేషన్‌ చార్జీల భారం సామాన్య, మధ్య తరగతి ప్రజలపై అధికంగానే ఉండనుంది. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం వరకు పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరగ్గా, శుక్రవారం రిజిస్ట్రేషన్ల సంఖ్య రోజువారీలో 30 నుంచి 40శాతం కూడా మించలేదు.

భూముల విలువల సవరణపై స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్‌ ఎం.రవీందర్‌రావును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, పెరిగిన భూముల విలువల సవరణ శుక్రవారం నుంచి అమలులోకి వచ్చిందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో సగటున 50శాతం వరకు మాత్రమే భూముల విలువల పెరిగిందని పేర్కొన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 12:19 AM