Share News

ప్రభుత్వ శాఖల మధ్య టవర్ల చిచ్చు

ABN , Publish Date - Apr 20 , 2026 | 11:45 PM

మూడు విద్యుత్‌ టవర్లు మూడు ప్రభుత్వ శాఖల మధ్య చిచ్చుకు కారణమవుతున్నాయి. కోర్టుకు చేరిన ఈ వివాదంపై వెకేట్‌ పిటిషన్‌ దాఖలు చేయాల్సింది మీరంటే.. మీరేనంటూ నెలల తరబడి ట్రాన్స్‌కో, ఆర్‌అండ్‌బీ, మునిసిపల్‌ శాఖల అధికారుల మధ్య వివాదం నడుస్తోంది.

ప్రభుత్వ శాఖల మధ్య టవర్ల చిచ్చు

వెకేట్‌ పిటిషన్‌పై మూడుశాఖల అధికారుల పేచీ

90శాతం పనులు పూర్తయినా నిరుపయోగంగా రూ.7.40కోట్ల పనులు

(ఆంధ్రజ్యోతి,భువనగిరి టౌన్‌) : మూడు విద్యుత్‌ టవర్లు మూడు ప్రభుత్వ శాఖల మధ్య చిచ్చుకు కారణమవుతున్నాయి. కోర్టుకు చేరిన ఈ వివాదంపై వెకేట్‌ పిటిషన్‌ దాఖలు చేయాల్సింది మీరంటే.. మీరేనంటూ నెలల తరబడి ట్రాన్స్‌కో, ఆర్‌అండ్‌బీ, మునిసిపల్‌ శాఖల అధికారుల మధ్య వివాదం నడుస్తోంది.వారి జాప్యం కారణంగా 90శాతం పూర్తయిన రూ.7.40కోట్ల విద్యుత్‌ టవర్ల పనులు జిల్లాకేంద్రం భువనగిరి పట్టణ ప్రధాన రహదారి వెంట అలంకారప్రాయమయ్యాయి.

భువనగిరి పట్టణ ప్రధాన రహదారి సుం దరీకరణ, విద్యానగర్‌, పహాడినగర్‌, ప్రగతినగ ర్‌, తారకరామానగర్‌ బస్తీల్లో 33కేవీ తీగలు, స్తంభాల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో రూ.7.40కోట్లతో చేపట్టిన విద్యుత్‌ టవర్ల పనులు చివరి దశకు చేరాయి. పనుల్లో భాగంగా 102 టవర్లను ఏర్పాటు చేసి తీగల బిగింపు కూడా పూర్తి చేశారు. ఈ క్రమంలో కిసాన్‌నగర్‌ రోడ్డు వెంట ఇండియా మిషన్‌ స్కూల్‌ ప్రహరీకి ఆనుకుని లోపలివైపు మూ డు టవర్లు ఏర్పాటు చేశారు. కండక్టర్ల బిగింపు సమయానికి తమ అంగీకారం లేకుండా టవర్ల ను ఏర్పాటు చేశారంటూ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించింది. దీంతో ఆ మూడు టవర్లకు తీగలను బిగించకపోవడం తో 90శాతం పైబడి పనులు పూర్తయినా నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో హైకోర్టులో వెకే ట్‌ పిటిషన్‌ దాఖలు చేసేది తాము కాదంటూ ఆర్‌అండ్‌బీ, మునిసిపాలిటీ, ట్రాన్స్‌కోశాఖ అధికారులు ఎవరికి వారు కాలయాపన చేశారు. తీరా ఓ సమావేశంలో కలిసిన మూడు శాఖల అధికారులు దీనిపై మాటామంతి చేసినా, ఇప్పటి వరకు ఏ శాఖ కూడా పిటిషన్‌ దాఖలే చేయలేదు. పనుల పరిశీలన, స్థానిక సహకారం మాత్రమే తమ బాధ్యత అని ట్రాన్స్‌కో చెబుతుండగా, అసలు ఆ పనులతో తమకు ఎలాంటి సంబంధమే లేదని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు. మునిసిపాలిటీ అయినా, పనులు చేయాల్సింది ఆ రెండు ప్రభుత్వశాఖలేనని పుర అధికారులు ఎవరికి వారుగా భిన్నాభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. కోర్టులో వెకెట్‌ పిటిషన్‌ వేసి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత తమది కాదంటూ ఎవరికివారు తప్పించుకుంటున్నారు.

ఎమ్మెల్యే సమీక్షలో రాని ప్రస్తావన

నియోజకవర్గ విద్యుత్‌ సమస్యలపై ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి ఈ నెల 17న భువనగిరిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే అసంపూర్తిగా ఉన్న ఈ టవర్ల పనులు, కోర్టు వివాదంపై అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులెవరూ లేవనెత్తకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం ప్రజావసరాల కోసం ఏర్పాటు చేసే విద్యుత్‌ స్తంభాలు, టవర్ల కోసం ప్రైవేట్‌ యజమానుల అంగీకారం తీసుకోవాలి. దీన్ని విస్మరించిన అధికారులు కనీసం స్టే ఆర్డర్‌ను కోర్టు కొట్టివేసే అవకాశం ఉన్నా వెకెట్‌ పిటిషన్‌ దాఖలుచేయడంలో అధికారులు సమన్వయం చేసుకోలేకపోయారు. ఫలితంగా కోట్ల రూపాయల పనులు అలంకారప్రాయంగా మారాయి. ఇప్పటికైనా కోర్టు వివాదం పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవచూపి పనులను వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Apr 20 , 2026 | 11:45 PM