Share News

ఇందిరమ్మ గృహ ప్రవేశాల సందడి

ABN , Publish Date - May 12 , 2026 | 12:11 AM

నిన్న మొన్నటి వరకు సొంతంగా ఇల్లు లేని వారు ఇరుకు గదుల్లో, అద్దె ఇళ్లలో ఉంటూ పడరాని పాట్లు పడుతూ వచ్చారు.

ఇందిరమ్మ గృహ ప్రవేశాల సందడి

నెరవేరుతున్న సొంతింటి కల

లబ్ధిదారుల్లో వెల్లివిరుస్తున్న ఆనందం

బీబీనగర్‌, మే 11(ఆంధ్రజ్యోతి): నిన్న మొన్నటి వరకు సొంతంగా ఇల్లు లేని వారు ఇరుకు గదుల్లో, అద్దె ఇళ్లలో ఉంటూ పడరాని పాట్లు పడుతూ వచ్చారు. తమకంటూ ఓ ఇల్లు ఉంటే బాగుండని ఎన్నో ఏళ్లుగా మదన పడ్డ వాళ్లకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇంటి పథకం సొంతింటి కలను నిజం చేస్తోంది. ఈ పథకంలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తికావడంతో గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల్ల గృహ ప్రవేశాల సందడి నెలకొంది. ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా అర్హులైన పేదలకు ఆర్థిక సాయం అందించి, నాణ్యమైన గృహాలను నిర్మించుకునేందుకు ప్రభుత్వం తోడ్పాటునిస్తోంది. బీబీనగర్‌ మండలంలో మొత్తం 34 గ్రామ పంచాయతీలు ఉండగా 705 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 132 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా మిగితావి వివిధ దశల్లో ఉన్నాయి. ఇళ్లు నిర్మించకున్న వారు ఒక్కొక్కరుగా గృహ ప్రవేశాలు చేస్తుండడంతో వారి కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

లబ్ధిదారుల్లో పెరిగిన భద్రత భావం

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో భద్రత భావం పెరుగుతోంది. సొంత ఇళ్లు ఉన్న కుటుంబాల్లో స్థిరత్వం ఏర్పడుతోంది. పిల్లలకు, ఇతర కుటుంబ సభ్యులకు అనూకూల వాతావరణం, వెసులుబాటు కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మాకు పండుగ రోజు

-జొర్రీగల భాగ్యమ్మ, రాఘవాపురం

ఇంత కాలం సొంతంగా ఇల్లు లేక మా కుటుంబ సభ్యులం చాలా ఇబ్బందులు పడ్డాం. ఇందిరమ్మ ఇంటి పథకంలో మాకు ఇల్లు మంజూరైంది. నిర్మాణ పనులు పూర్తి చేసి గృహ ప్రవేశం చేశాం. ఎన్నో ఏళ్ల తర్వాత సొంతింటి కల నెరవేరడంతో మా ఆనందానికి అవధులు లేవు. ఈ రోజు మా జీవితంలో పండుగ రోజు.

Updated Date - May 12 , 2026 | 12:11 AM