Share News

గృహజ్యోతి వినియోగదారులకు వేసవి షాక్‌

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:03 AM

ఎండలు దంచికొడుతుండటంతో జిల్లాలో విద్యుత్‌ వినియోగం పెరిగింది. ఉదయం 8 గంటల నుంచే భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తుండటంతో వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు.

గృహజ్యోతి వినియోగదారులకు వేసవి షాక్‌

పెరిగిన విద్యుత్‌ వినియోగం

గిర్రున తిరుగుతున్న మీటర్లు

తగ్గుతున్న గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య

ఏప్రిల్‌, మే నెలలో మరింత పెరిగే అవకాశం

(ఆంధ్రజ్యోతి,నల్లగొండ టౌన్‌) : ఎండలు దంచికొడుతుండటంతో జిల్లాలో విద్యుత్‌ వినియోగం పెరిగింది. ఉదయం 8 గంటల నుంచే భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తుండటంతో వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. ఫలితంగా మీటర్లు గిర్రున తిరిగి 200 యూనిట్లు దాటడంతో గృహజ్యోతి పథకానికి అనర్హులుగా మారుతున్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగం కాస్తా 250 నుంచి 300 యూనిట్లు దాటుతోంది.

జిల్లాలో ఫిబ్రవరి నెలలో గృహజ్యో తి లబ్ధిదారుల సంఖ్య 2.51లక్షలుగా ఉంది. దీంట్లో 200 యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగించిన వారు 2,47,900 మంది ఉన్నారు. మరో 3,100 మంది 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్‌ వినియోగించడంతో వీరు అనర్హులుగా మారారు. అదే విధంగా మార్చి నెలలో 2,52,122 లబ్ధిదారులకు 200 యూనిట్లు వాడిన గృహజ్యోతి లబ్ధిదారులు 2,48,050 మంది వరకు ఉన్నారు. మిగతా 4,072 మంది 200 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్‌ వినియోగించారు. కేవలం నెల వ్యవధిలో సుమారు 1,000 మంది లబ్ధిదారులు గృహజ్యోతి పథకానికి అనర్హులుగా మారారు.

మే నెలలో మరింత పెరిగే అవకాశం

జిల్లాలో 8,30,622 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. అందులో గృహ వినియోగ కనెక్షన్లు 5,04,012 కాగా, వ్యవసాయానికి సంబంధించిన కనెక్షన్లు 2,44,947 ఉన్నాయి. 81,663 కమర్షియల్‌, వాటర్‌వర్క్‌, వీధి దీపాల కనెక్షన్లు ఉన్నాయి. సాధారణంగా రోజుకు సగటున 15 నుంచి 16 మిలియన్‌ యూనిట్ల వినియోగం ఉంటుంది. జిల్లాలో గృహజ్యోతి విద్యుత్‌ పథకానికి 2,52,122 మంది అర్హులుగా ఉన్నారు. మార్చి నెలలో 4,072 మంది అనర్హులుగా మిగిలారు. ఏప్రిల్‌, మే నెలలో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గృహజ్యోతి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇస్తోంది. అయితే 201 యూనిట్ల విద్యుత్‌ వినియోగిస్తే సుమారు రూ.1,200 నుంచి రూ.1,300 వరకు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ టారీఫ్‌ కాకుండా 50 యూనిట్ల వరకు ఒక లెక్క, 100 యూనిట్ల వరకు మరో లెక్క, ఆపైన ఇంకో విధంగా విద్యుత్‌ వినియోగానికి లెక్కలు కట్టాల్సి ఉంటుందని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఇలా వాడితేనే జీరో బిల్లు..

గృహజ్యోతి పథకం లబ్ధిదారులు పొదుపుగా విద్యుత్‌ను వినియోగిస్తే 200 యూనిట్ల లోపు రీడింగ్‌ వస్తుందని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ఇళ్లలో నేటికీ కొందరు పాతకాలం నాటి విద్యుత్‌ ఉపకరణాలనే వినియోగిస్తుండటంతో దీంతో విద్యుత్‌ వినియోగం కూడా పెరుగుతోందని అంటున్నారు. తక్కువ ఓల్టేజీ కలిగిన ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు వినియోగిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. ఏసీలు, కూలర్లు వినియోగించేప్పుడు ఫ్యాన్‌ బంద్‌ చేయాలని, ఏసీలను 24 నుంచి 26 డిగ్రీల మధ్య వినియోగిస్తే విద్యుత్‌ వాడకం తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు. 5స్టార్‌ రేటింగ్‌ ఉన్న ఏసీలను వినియోగించాలని, అవసరం లేని సమయంలో కంప్యూటర్లు, టీవీలు, ఫ్యాన్లు, లైట్లు ఆఫ్‌చేయాలని, ఫోన్లు చార్జింగ్‌ పూర్తయిన తర్వాత చార్జర్‌ను ప్లగ్‌ను తొలగించాలని విద్యుత్‌ అధికారులు సూచిస్తున్నారు.

అవసరం మేరకే విద్యుత్‌ వినియోగించాలి

విద్యుత్‌ను అవసరం మేరకు మాత్రమే వినియోగించాలి. రాత్రి వేళల్లో అవసరం ఉన్నప్పుడు మాత్రమే బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు ఆన్‌ చేయాలి. అవసరం లేకున్నా కొందరు బల్బులను వాడుతూ ఉంటారు. దీంతో విద్యుత్‌ వినియోగం పెరిగిగృహజ్యోతి పథకం కింద ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని లబ్ధిదారులు నష్టపోతున్నారు. వారికి నెలకు రూ.1,200 నుంచి రూ.1,500 వరకు బిల్లు వస్తొంది. వీలైనంత వరకు అవసరం మేరకే విద్యుత్‌ను వినియోగించాలి.

- వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ, నల్లగొండ

Updated Date - Apr 25 , 2026 | 12:03 AM