ఈదురు గాలులు.. అకాల వర్షం
ABN , Publish Date - May 26 , 2026 | 11:38 PM
చౌటుప్పల్ టౌన్, మే 26 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.
చౌటుప్పల్ టౌన్, మే 26 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు తడిసి పోయాయి. ీ ధాన్యం రాశుల కిందకు వర్షపు నీరు చేరడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కొందరు రైతులు రాశుల చుట్టూ తాలు కట్టగా వేసి ధాన్యం తడిసి పోకుండా రక్షణ కల్పించుకున్నారు. కొనుగోలు కేంద్రానికి 304 మంది రైతులు ధాన్యం తీసుకు రాగా అందులో 135 మంది రైతుల ధాన్యాన్ని తూకాలు వేశారు. 35 వేల బస్తాలను తూకాలు వేయగా అందులో సుమారు 2,000 బస్తాలను ఎగుమతి చేయాల్సి ఉంది. ఈ బస్తాల కిందకు సైతం వర్షపు నీరు చేరుకుంది. ఇంకా కొందరు రైతులు నెల రోజుల నుంచి తూకాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలు కేంద్రం నిర్వాహాకుల వైఫల్యం కారణంగానే తూకాల్లో జాప్యం జరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు.
సంస్థాన్‌నారాయణపురంలో గంట సేపు వర్షం
సంస్థాన్‌నారాయణపురం: యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలంలో మంగళవారం సాయంత్రం అకాల వర్షం కురిసి బలమైన ఈదురు గాలులు వీచాయి. సుమారు గంట సేపు వర్షం కురిసింది. ఒక్కసారిగా బలమైన ఈ దురు గాలులు వీయడంతో పలు గ్రామాల్లో చెట్లు, చెట్లు కొమ్మలు నేలకు ఒరిగాయి. విద్యుత్ వైర్లు గాలికి తెగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలపై కప్పిన కవర్లు గాలికి లేచిపోయాయి. కొన్ని కొనుగోలు కేంద్రాలలో కొంత ధాన్యం తడిసింది.
విద్యుత్ సరఫరాలో అంతరాయం
రామన్నపేట: యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో సిరిపురం, ఎల్లంకి, రామన్నపేట, లక్ష్మాపురం, భోగారం తదితర గ్రామాల్లో వడ్లపై కప్పిన పట్టాలు కొట్టుకు పోవడంతో పాటు మామిడి కాయలు రాలిపోవడంతో రైతులకు నష్టం వాటిల్లింది. కొన్ని గ్రామాల్లో విద్యుత్ తీగలు తెగిపోవడంతో కాసేపు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అక్కడక్కడ కొద్ది ధాన్యం రాశులు తడిసినట్లు రైతులు పేర్కొన్నారు. ఈ వర్షంతో ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగింది.
శాలిగౌరారం మండలంలో వడగండ్ల వర్షం
శాలిగౌరారం : నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని ఇటుకులపహాడ్, వంగమర్తి, చిత్తలూరు, మాదారం గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. పెర్కకొండారం, ఊట్కూరు, బండమీదిగూడెం, అంబారిపేట, తుడిమిడి గ్రామాల్లో కొద్దిపాటి వర్షం పడింది. ఎండ తీవ్రత అధికంగా ఉండి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని వాతావరణం చల్లబడింది. ఇటుకుల పహాడ్, వంగమర్తి ప్రాంతాల్లో వడగండ్లు పడడంతో రైతులు ఆందోళన చెందారు. అకాల వర్షంతో మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
దెబ్బతిన్న నిమ్మ, మామిడి తోటలు
మర్రిగూడ : అకాల వర్షం, ఈదురు గాలుల బీభత్సానికి పండ్ల తోట లు నల్లగొండ జిల్లా మర్రిగూడ, రాంరెడ్డిపల్లిలో నేలకూలాయి. మర్రి గూడ మండల కేంద్రంలోని వీరమళ్ల నరసింహ రైతుకు చెందిన ఐదు ఎకరాల్లో ఎనిమిది ఏళ్ల నుంచి మామిడి, నిమ్మ తోట పెంచుతు న్నాడు. సోమవారం వీచిన ఈదురు గాలులు, వర్షం బీభత్సానికి తోటలో 65 నిమ్మచెట్లు కొన్ని నేల మట్టం కాగా, మరికొన్ని విరిగి పోయాయి. సుమారు రూ.3లక్షల నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
విరిగిన విద్యుత్ స్తంభాలు, తాటిచెట్లు
పెన్‌పహాడ్ : సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలోని మాచారం గ్రామంలో సోమవారం రాత్రి పెద్ద గాలిదుమారం వచ్చింది. దీంతో మిల్లుకు చెందిన విద్యుత్ 11 కేవీకి కనెక్షన్ ఇచ్చిన విద్యుత్ లైన్ పక్కన ఉన్న తాటిచెట్టు కూలిపోయి విద్యుత్ తీగలపై పడిపోవడం విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ ఏఈ శ్రీనివాస్ తన సిబ్బందితో మంగళవారం స్తంభాలు, తీగలను పరిశీలించారు. విరిగిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో ఏడు విద్యుత్ స్తంభాల ను ఏర్పాటు చేశారు. దీంతో విద్యుత్ సరఫరా యథావిధిగా కొనసాగింది.