ఈదురుగాలులు..వర్షం.. రైతులకు నష్టం
ABN , Publish Date - May 28 , 2026 | 12:01 AM
రాజాపేట మండలం లో మంగళవారం రాత్రి ఈదురు గాలులు, వడగళ్లతో అకాల వర్షం కురిసింది.
తడిచిన ధాన్యం, రాలిన మామిడి కాయలు
మల్లారెడ్డిగూడెంలో పిడుగుపాటుకు గేదె మృతి
రాజాపేట, మే27 (ఆంధ్రజ్యోతి): రాజాపేట మండలం లో మంగళవారం రాత్రి ఈదురు గాలులు, వడగళ్లతో అకాల వర్షం కురిసింది. మండలంలోని జాల, పాముకుంట, సింగారం గ్రామాలలో మొక్కజొన్న సైజులో వడగళ్ల వర్షం పావుగంట సేపు కురిసింది. మండలంలోని మల్లగూడెంలో పిడుగు పడటంతో గొడుగు కనుకయ్యకు చెందిన పాడి గేదె మృతి చెందింది. వర్ష ఐలయ్య ఇంటిపై కప్పుపై పిడుగు పడటంతో కప్పు పాక్షికంగా దెబ్బతింది. మండలం లోని వివిధ గ్రామాలలో ఈదురు గాలులతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులపై కప్పిన పరదాలు కొట్టుకుపోయాయి. వరి ధాన్యం పూర్తిగా వర్షానికి తడిచింది. నర్సాపూర్, సింగారం, పాముకుంట గ్రామాల్లో చెట్లు కూలిపోయి, విద్యుత స్తంభాలు విరిగిపడ్డాయి. ట్రాన్సఫార్మర్‌లు, విద్యుత స్తంభాలు దెబ్బతినడంతో విద్యుతకు అంతరాయం కలిగింది. మండలంలోని పలు గ్రామాల్లో మామిడి తోటల్లో మామిడికాయలు పూర్తిగా రాలిపోయాయి. మండలంలో లారీలు, హమాలీల కొరతతో ఐకెపి కేంద్రాలలో పోసిన ధాన్యం కాంటాలు కాక పోవడంతో అకాల వర్షానికి పూర్తిగా తడిసిపోయాయి. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కళ్ల ముందే వరద పాలవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.
టార్పాలిన కవర్లు కప్పినా..
చౌటుప్పల్/ చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం తడిసిపోయింది. దామెర, దేవలమ్మనాగారం, కొయ్యలగూడెం, పీపల్‌పహాడ్, అల్లాపురం తదితర గ్రామాల్లోని ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ధాన్యం కుప్పలో వర్షం నీరు చేరుతూ వరి కుప్పలపై కప్పిన టార్పాలిన్లు గాలి దుమారానికి లేచిపోయాయి. తూకం వేసి లిఫ్టింగ్‌కు సిద్ధంగా ఉన్న 9వేల క్వింటాళ్ల ధాన్యం తడిసింది. రైతులకు సంబంధించి 15వేల క్వింటాళ్ల ధాన్యం తడిసినట్టు అధికారులు తెలిపారు. వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోవడం అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 50రోజుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరగకపోవడం 2.50లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిలిచిపోయింది. లక్షా 50వేల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే ఇప్పటి వరకు కొనుగోలు చేసారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌లోని ఐకేపీ కేంద్రంలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని బుధవారం రైతులు ఆరబోశారు. తూకాలకు సిద్ధంగా ఉన్న ధాన్యం రాశులు తడిసిన పోవడంతో రైతులు అల్లాడి పోయారు. కొనుగోలు కేంద్రంలో 216 మంది రైతులకు చెందిన 40 నుంచి 45 వేల బస్తాల ధాన్యం ఉంది. తడిసిన ధాన్యం రాశులను ఆర్డీవో శేఖర్ రెడ్డి, తహసీల్దార్ వీరాబాయి, ఏఎంసీ చైర్మన ఉబ్బు వెంకటయ్య, డీసీఎ్‌సవో రోజారాణి , ఏవో నాగరాజు బుధవారం పరిశీలించారు. వర్షానికి తడిసిన సుమారు 2000 బస్తాల (తూకాలు వేసినవి) ధాన్యాన్ని అధికారుల ఆదేశాలతో ఫార్బాయిల్డ్ మిల్లులకు తరలించారు.
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట పట్టణంలో మంగళవారం రాత్రి ఆకస్మికంగా ఈదురు గాలులు వీయడంతో పట్టణంలో ఆకస్మికంగా పాతగుండ్లపల్లి గ్రామంలో విద్యుత్ స్తంభం నేలకూలగా నల్లపోచమ్మ వాడలో ట్రాస్‌ఫార్మర్ పేలింది. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒకవైపు ఎండతీవ్రత మరోవైపు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. బుధవారం మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు.