Share News

పట్టణ సమగ్రాభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:19 AM

పోచంపల్లి పట్టణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.

పట్టణ సమగ్రాభివృద్ధికి కృషి
ఈవీ పారిశుధ్య వాహనాలు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి

ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి

భూదానపోచంపల్లి, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : పోచంపల్లి పట్టణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. పోచంపల్లి మునిసిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ హెచఎండీఏ ద్వారా భువనగిరి నియోజకవర్గానికి రూ.56కోట్ల నిధులు తీసుకువచ్చామని, అందులో భాగంగా పోచంపల్లి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. నేతన్నల నిలయమైన పోచంపల్లిని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణంతో పాటు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కమ్యునిటీ హాల్స్‌, శ్మశాన వాటికల అభివృద్ధి, విద్యుత లాంటి మౌలిక సదుపాయాల కల్పన, అమృత పథకం ద్వారా రిజర్వాయర్‌ నిర్మాణం వంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. పోచంపల్లి మునిసిపాలిటీ అభివృద్ధికి రూ.7.90కోట్లు నిధులు కేటాయించామని, చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం పోచంపల్లి పెద్ద చెరువు వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన తడక వెంకటేశ్వర్లు, వైస్‌ చైర్మన కొయ్యడ రజని శ్రీనివాస్‌గౌడ్‌, కమీషనర్‌ అంజనరెడ్డి, కౌన్సిలర్లు కొండమడుగు ఎల్లస్వామి, పెద్దల చక్రపాణి, బాత్క లింగస్వామి, కర్నాటి వరలక్ష్మీ, రాపోలు కావ్య, దేవరాయ కుమార్‌, కో-ఆప్షన సభ్యులు మద్ది మధుసూదనరెడ్డి, సయ్యగ్‌ ఎజాస్‌, పబ్లిక్‌ హెల్త్‌ డీఈ మనోహర, ఏఈ లోకేష్‌, ఎలకి్ట్రకల్‌ ఏఈ శ్రీనివాస్‌, మునిసిపల్‌ ఏఈ జగపతిబాబు, హెచఎండీఏ అసిస్టెంట్‌ ఇంజనీయర్‌ వెంకన్న పాల్గొన్నారు. భూదానపోచంపల్లి మునిసిపాలిటీలో ఈవీ పారిశుద్ధ్య వాహనాలను ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి, చైర్మన తడక వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. రెండు పారిశుధ్య వాహనాల ద్వారా ఇంటింటికీ చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ మరింత సమర్ధ వంతంగా జరిగి పట్టణ ప్రజలకు మెరుగైన పారివుద్ధ్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం

గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండల పరిషత కార్యాలయంలో మండలంలోని ప్రజాప్రతినిధులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు బస్సు సర్వీసుల పెంపుపై ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన చోట్ల అదనపు బస్సు సర్వీసులను నడపాలని అధికారులను కోరారు.

చేనేత అభివృద్ధికి పాటుపడాలి

భూదానపోచంపల్లిలోని చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గం సంఘం అభివృద్ధికి పాటుపడాలని, కార్మికులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం పోచంపల్లి చేనేత సహకార సంఘానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్‌ ప్యానల్‌ అభ్యర్థులైన చైర్మన భారత లవకుమార్‌, వైస్‌ చైర్మన సీత శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి సూరపల్లి శ్రీనివాస్‌, కోశాధికారి కోడి భిక్షపతి, డైరెక్టర్లు మహేశ్వరం నాగమణి, పాలాది జ్యోతిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత రంగం అభివృద్ధికి సీఎం రేవంతరెడ్డి ఆద్వర్యంలో అనేక పథకాలు అమలు జరుగుతున్నాయని, చేనేత సంక్షేమ పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తెస్తే ప్రభుత్వంతో పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన తడక వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2026 | 12:19 AM