వైద్య సేవలకు 30 రోజులుగా సమ్మె సెగ
ABN , Publish Date - Nov 11 , 2026 | 12:07 AM
దవాఖానాల్లో అందుబాటులో ఉండి వైద్యం అందించాల్సిన సిబ్బంది రోడ్డెక్కారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌ఎంహెచ్) కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 30వ రోజుకు చేరింది. డాక్టర్ల నుంచి కాంటిజెంట్ వర్కర్ల వరకు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో వైద్య సేవల్లో అంతరాయం ఏర్పడింది.
విధులకు ఎన్‌ఎంహెచ్ ఉద్యోగులు దూరం
రెగ్యులరైజేషన్, వేతనాలు, ఆరోగ్య భద్రత ప్రధాన డిమాండ్
78 క్యాడర్లలో 366 మంది సమ్మెబాట
వ్యాక్సినేషన్ నుంచి గర్భిణుల వైద్యపరీక్షల వరకు అంతరాయం
రెగ్యులర్ సిబ్బందిపై అదనపు పనిభారం
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): దవాఖానాల్లో అందుబాటులో ఉండి వైద్యం అందించాల్సిన సిబ్బంది రోడ్డెక్కారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌ఎంహెచ్) కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 30వ రోజుకు చేరింది. డాక్టర్ల నుంచి కాంటిజెంట్ వర్కర్ల వరకు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో వైద్య సేవల్లో అంతరాయం ఏర్పడింది.
జిల్లాలోని వివిధ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య నిర్ధారణ పరీక్షల ల్యాబ్‌ల్లో విధులు నిర్వహించే 78 క్యాడర్లకు చెందిన 366 మంది విధులు బహిష్కరించి ఆందోళనల్లో పాల్గొంటున్నారు. నెలరోజులుగా సాగుతున్న ఈ సమ్మెతో ప్రభుత్వ వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పీహెచ్‌సీలు, ఉపకేంద్రాలు మొదలు వివిధ ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో ప్రభుత్వ వైద్యం కోసం ఆస్పత్రులకు వస్తున్న పేద వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారించడంలో ప్రభుత్వం స్పందించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వైద్య పరీక్షలు, చికత్సలకు తీవ్ర అంతరాయం
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె ప్రభావం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పల్లె, బస్తీ దవాఖానాలతో పాటు టీ-డయాగ్నోస్టిక్ సెంటర్లు, బ్లడ్‌బ్యాంకులపై తీవ్రంగా పడుతోంది. సాధారణ ఓపీ సేవలు, రక్త, మూత్ర పరీక్షలు, ప్రసవాలు, చిన్నారులకు వ్యాక్సినేషన్, బీపీ, షుగర్ పరీక్షలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులకు సమయానికి టీకాలు వేయించేందుకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద వర్గాలకు వైద్య సేవలు అందించే ఆరోగ్య కేంద్రాలు, దవాఖానాల్లో అంతరాయం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైద్య సేవల్లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు కీలకం
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించడంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడం, మాతా, శిశు మరణాల రేటు తగ్గించడంతో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు కృషి చేస్తున్నా రు. మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, సెకండ్ ఏఎన్‌ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, కో-ఆర్డినేటర్లు, అకౌంటెంట్లు, కాంటిజెంట్ సిబ్బంది వంటి పలు విభాగాల్లో కీలకంగా విధులు నిర్వహిస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు భద్రత కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెగ్యులరైజేషన్ ప్రధాన డిమాండ్
దశాబ్దాల తరబడి చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలనే ప్రఽధాన డిమాండ్ తో సమ్మెబాట పట్టారు. హర్యాన, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మహారాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో సైతం ఉద్యోగులు రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు శాశ్వత సేవా భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ని చాలా రాష్ట్రాల్లో మాదిరే ఖజానాపై ఆర్థిక భారం పడకుండానే రాష్ట్రంలో పేదవర్గాలకు క్షేత్రస్థాయిలో విశేష సేవలు అందించే ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు క్యాడర్ ఫిక్సేషన్ చేపట్టి వంద శాతం గ్రాస్ వేతనాలు అందించాలంటున్నారు. అదే విధంగా థర్డ్‌పార్టీ ఏజెన్సీలను రద్దు చేయాలని, ఉద్యోగులందరినీ స్టేట్ హెల్త్ సొసైటీ పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నారు. ప్రతీ నెల ప్రత్యేక పోర ్టల్ ద్వారా 5వ తేదీన వేతనాలు చెల్లించాలని, 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న 5శాతం వార్షిక ఇంక్రిమెంట్లు, 8శాతం లాయాల్టీ బోనస్ బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. మహిళా ఉద్యోగులందరికీ 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ ఆరోగ్య పథకం, ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగ కుటుంబాలకు రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా, వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రెగ్యులర్ సిబ్బందిపై అదనపు పనిభారం
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నెలరోజుల సమ్మెతో వైద్య, ఆరోగ్య సేవలకు అంతరాయం ఏర్పడగా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో వైద్య సేవలను కొనసాగించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తోంది. ఆయా ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకే అదనపు విధులను కేటాయిస్తున్నారు. అత్యవసర సేవల విషయంలో సమ్మెలో పాల్గొంటున్న వైద్యాధికారులు సైతం మానవతా దృక్పథంతో సేవలు అందిస్తున్నారు. అయితే టీ-హబ్ డయోగ్నోస్టిక్ కేంద్రాల్లో పరీక్షల రిపోర్టుల్లో తీవ్ర జాప్యం జరుగుతోది. గర్భిణుల సాధారణ వైద్య పరీక్షలతో పాటు పిల్లల టీకాలు తదితర ఓపీ సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. సాధారణ రోజుల మాదిరిగా ఎక్కడా అన్ని సేవలు సకాలంలో అందడం లేదని రోగులు చెబుతున్నారు. రెగ్యులర్ సిబ్బందిపై పనిభారం పెరగడంతో రోగులకు నిరీక్షణ తప్పడం లేదు.
ఉద్యోగుల సమ్మె విరమణలో సర్కార్ మీనమేషాలు
గ్రామీణ పేదలకు వైద్య సేవలు అందించే ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నా, వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ అంశంపై ఉద్యోగ జేఏసీతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చర్చించి ఉద్యోగుల ప్రధాన డిమాండ్ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి, అన్ని ప్రయోజనాలు అందించడానికి నిరాకరించారు. దీంతో ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజకీయ పక్షాలు, వివిధ ప్రజాసంఘాలు ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఉద్యోగ, భద్రత, న్యాయమైన వేతనాల కోసం పోరాడుతున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు. అదే విధంగా సామాన్య ప్రజలకు వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. సమ్మెను విరమించడానికి ప్రభుత్వం చొరవ చూపాలనే డిమాండ్ వివిధ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది.
ప్రభావం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు : డాక్టర్ మనోహర్, డీఎంహెచ్‌వో
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు సమ్మె చేస్తున్నా, రోగులకు వైద్య సేవలకు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. ప్రతీ కేంద్రంలో రెగ్యులర్ ఉద్యోగుల పనితీరును సమీక్షించి, అదనపు విధులు కేటాయించాం. రోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పూర్తిస్థాయి చర్యలు తీసుకున్నాం.
సర్వీ్‌సను రెగ్యులర్ చేయాలి: -డాక్టర్ గిరిజ, మెడికల్ ఆఫీసర్, ఆర్‌బీఎ్‌సకే, రామన్నపేట
ఎన్‌హెచ్‌ఎంలో పనిచేస్తున్న వైద్యులతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులకు భద్రత కల్పించాలి. సర్వీసులను రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్టు విధానంతో చాలీచాలని వేతనాలు, ఇతర సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం మా డిమాండ్లపై సానుకూలంగా వ్యవహరించి పరిష్కరించాలి.
ప్రభుత్వ వైఖరి మారాలి: -బి.నరేష్, అకౌంటెంట్, డీఎంహెచ్‌వో కార్యాలయం
రెగ్యులర్ ఉద్యోగులతో సమానం గా సేవలు అందిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది. మా న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఖరి మారాలి. సుప్రీం కోర్టు ఆదేశాలు వెంటనే అమలు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ఇతర ప్రయోజనాలు అందించాలి.
ఏజెన్సీలను రద్దు చేయాలి: -ఏ.నిర్మల, సెకండ్ ఏఎన్‌ఎం, పీహెచ్‌సీ, శారాజీపేట
నేషనల్ హెల్త్ మిషన్‌లో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను వెంటనే రద్దు చేయాలి. స్టేట్ హెల్త్ సొసైటీలో మా పోస్టులను కొనసాగించాలి. ప్రతీ నెల 5వ తేదీన వేతనాలు చెల్లించాలి. మహిళా ఉద్యోగులకు క్యాడర్‌తో సంబంధం లేకుండా 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అమలు చేయాలి.
సమాన పనికి సమానవేతనం ఇవ్వాలి : డాక్టర్ ఆర్.మధు, మెడికల్ ఆఫీసర్, ఆర్‌బీఎ్‌సకే, తుర్కపల్లి
క్షేత్రస్థాయిలో రోగులకు మెరుగైన వైద్య సే వలు అందిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సర్వీసును రెగ్యులర్ చేయడంతో పాటు సమాన పని కి సమానవే తనం చెల్లించాలి.30రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించడం లేదు. న్యా యమైన డిమాండ్‌ను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తాం.