Share News

మెరిట్‌ జాబితా ప్రకారమే

ABN , Publish Date - Nov 11 , 2026 | 12:11 AM

:జిల్లాలో ఎట్టకేలకు ప్రీప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల పోస్టుల నియామకాలకు మోక్షం కలిగింది. రాజకీయనేతల అభ్యంతరాలతో ఆగస్టులో ఆగిన ఈ నియామకా ల ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది.

మెరిట్‌ జాబితా ప్రకారమే

ప్రీప్రైమరీ కొలువులకు మూడు నెలల తర్వాత వీడిన రాజకీయ గ్రహణం

మెరిట్‌ ప్రకారమే ఉద్యోగాలివ్వాలని స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరేట్‌ నిర్ణయం

ఈ నెల మొదటి వారంలో విధుల్లో చేరిన అభ్యర్థులు

మొదటి నుంచి అండగా నిలిచిన ‘ఆంధ్రజ్యోతి’కి అభ్యర్థుల కృతజ్ఞతలు

(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): జిల్లాలో ఎట్టకేలకు ప్రీప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల పోస్టుల నియామకాలకు మోక్షం కలిగింది. రాజకీయనేతల అభ్యంతరాలతో ఆగస్టులో ఆగిన ఈ నియామకా ల ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. మెరిట్‌ జాబితా ప్రకారమే నియామకాలు చేపట్టాలని విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేయడంతో ఈ నెల 5వ తేదీ నుంచి అభ్యర్థులను విధుల్లో చేర్చుకున్నారు.

జిల్లాలో ప్రీప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల నియామక ప్రక్రియకు రాజకీయ జోక్యంతో బ్రేక్‌పడిన అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించింది. ఆగస్టు 3న ‘ప్రీప్రైమరీ కీచులాట‘, ఆగస్టున 4న ‘తెరపైకి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌’ ఆగస్టు 13న ‘రాజకీయ గ్రహణంతో త్రిశంకు స్వర్గంలో ప్రీప్రైమరీ పోస్టులు’ అక్టోబరు 7న ‘ఆటకెక్కిన ప్రీప్రైమరీ నియామకాలు’ పేరుతో వరుసగా కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరేట్‌ నుంచి వచ్చిన ఉత్తర్వులు, నిబంధనల ప్రకారం మెరిట్‌ జాబితా ఆధారంగా ప్రీప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకాల ప్రక్రియను ఈనెల 5న చేపట్టారు. ఆగస్టు 2న ప్రకటించిన మెరిట్‌ జాబితా ప్రకారమే అభ్యర్థులను ఆయా స్కూళ్లల్లో విధుల్లో చేర్చుకోవాలని ఈనెల 5న ఎంఈవోలకు మౌఖికంగా ఆదేశాలివ్వడంతో అభ్యర్థులంతా వారి పోస్టుల్లో చేరారు.

మెరిట్‌ అభ్యర్థుల పక్షాన నిలబడిన ‘ఆంధ్రజ్యోతి’

జిల్లాలో ప్రీప్రైమరీ పోస్టుల నియామకాల్లో మెరిట్‌ అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ‘ఆంధ్రజ్యోతి’ మొదటి నుంచి వారికి అండ గా నిలిచింది. రాజకీయ జోక్యం, ప్రక్రియకు బ్రేకులు పడిన సందర్భా ల్లో కథనాలు ప్రచురించింది. ఈ పోస్టులకు తొలుత నిబంధనల ప్రకారం అధికార యంత్రాంగం మెరిట్‌ ఆధారంగా ఎంపికచేసినప్పటికీ రాజకీయ జోక్యంతో ప్రక్రియ ఆగిన అంశాల్ని ప్రస్తావిస్తూ ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురించింది. రాజకీయ నేతల ఒత్తిళ్లకు లొంగి అభ్యర్థుల ఎంపికచేపడితే నిరుద్యోగుల నుంచి నిరసనలు వచ్చే పరిస్థితి నెలకొంటుందనే అంశాన్ని సైతం ‘ఆంధ్రజ్యోతి’ పేర్కొంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు సైతం ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరించి తదుప రిఆదేశాల ప్రకారం చివరికి ఆలస్యంగానైనా నిబంధనలకు లోబడి తొలు త ఖరారుచేసిన మెరిట్‌ జాబితా ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చారు. దీంతో మెరిట్‌ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. అంతేగాక అభ్యర్ధులకు న్యా యం జరిగేలా వ్యవహరించిన కలెక్టర్‌ చంద్రశేఖర్‌, జిల్లా విద్యాశాఖాధికా రి సుశీందర్‌రావు, వారి పక్షాన నిలుస్తూ కథనాలు ప్రచురించి అప్రమత్తం చేసిన ‘ఆంధ్రజ్యోతి’ పత్రికకు, ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత నిరుద్యోగులకు ఇబ్బంది జరగకుండా మెరిట్‌ ప్రకారం నియామకాలు చేపట్టాలని సూచించిన రాజకీయ నేతలకు ప్రీప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలు కృతజ్ఞతలు తెలిపారు.

ఎట్టకేలకు ప్రక్రియ ముగిసిందిలా..

జిల్లాలో ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణకు ఎంపికచేసిన 124 పాఠశాలల్లో 124 ఇన్‌స్ట్రక్టర్లు, 124 ఆయాల పోస్టుల నియామకాలకు జూలై లో నోటిఫికేషన్‌ ఇచ్చి, అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ నుంచి వచ్చిన ఉత్తర్వులు, నియమ, నిబంధనల ప్రకా రం మెరిట్‌, రోస్టర్‌, స్థానికత ఆధారంగా మెరిట్‌ జాబితాను ఖరారు చేసిన జిల్లా అధికారులు జూలై చివరి వారంలోనే సదరు జాబితాను వెబ్‌సైట్‌లో అప్లోడ్‌ చేశారు. మెరిట్‌ అభ్యర్థుల ను సంబంధిత స్కూళ్లల్లో జాయిన్‌ చేసుకోవాలంటూ ఆగస్టు 2న ఎంఈవోలకు సైతం ఆదేశాలివ్వడంతో పాటు, జాబితాను పంపారు. ఆతర్వాత షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 3వ తేదీ నుంచి ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ నిర్వహించాల్సి ఉండగా, జాయినింగ్‌, శిక్షణ ప్రక్రియలకు బ్రేక్‌పడింది. అధికారులు మెరిట్‌ ప్రకారం ఎంపికచేసిన జాబితాలో తాము సిఫార్సుచేసిన అభ్యర్థుల పేర్లు లేకపోవడంతో కీలక ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు, ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేశారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన మౌఖిక సూచనల ప్రకారం ఎంపికచేసిన ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను జాయిన్‌ చేసుకోవద్దని ఎం ఈవోలకు విద్యాశాఖాధికారుల ద్వారా సూచించడంతో ఈ ప్రక్రియ మొత్తం నిలిచింది. రాజకీయ నేతలు వారు సిఫార్సు చేసిన అభ్యర్థులనే ఈ ఉద్యోగాల్లో నియమించాలని పట్టుబడుతుండడంతో నియామకాలు చేసి శిక్షణ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ విషయం విద్యాశాఖ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారినుంచి వచ్చే ఆదేశాలు ఎలా ఉంటో అలా నడుచుకుంటామని పేర్కొంటూ జిల్లా అధికారులు ఈ నియామక ప్రక్రియను పక్కనపెట్టారు. మరోవైపు తాము సిఫార్సుచేసినవారికే ఉద్యోగాలిప్పించాలనే పట్టుదలతో ఉన్న ప్రజాప్రతినిధులు విద్యాశాఖ ఉన్నతాధికారులను సైతం కలిసి నియమ, నిబంధనలు, అర్హతల్లో సడలింపులు, మార్పులు చేర్పులు చేయాలని కోరుతూ ప్రయత్నాలు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహా నియామక ప్రక్రియకు నియమ నిబంధనలు విధించడంతో ఇప్పుడు ప్రత్యేకంగా మార్పులు, చేర్పులు చేసే పరిస్థితి లేదని స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరేట్‌ ఉన్నతాధికారులు, ఆయన్ను కలిసిన రాజకీయ నాయకులకు తేల్చిచెప్పారు. మరోవైపున ఈ నియామకాలను త్వరగా చేపట్టాలంటూ ఉపాధ్యాయసంఘాల నుంచి ఒత్తిళ్లు వస్తుండడంతో తొలుత ఎంపికచేసిన మెరిట్‌ జాబితా ప్రకారం తక్షణమే ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను కొలువుల్లోకి తీసుకోవాలని సూచిస్తూ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరేట్‌ నుంచి తాజాగా ఆదేశాలు వచ్చాయి. దీంతో ఈనెల 5న సంబంధిత మెరిట్‌ జాబితా ప్రకారం 124 మంది ఇన్‌స్ట్రక్టర్లు, 124 మంది ఆయాలను స్కూళ్లలో జాయిన్‌ చేసుకోవాలని ఎంఈవోలకు మౌఖికంగా ఆదేశాలిచ్చారు. ఆయా ఎంఈవోలు సంబంధిత అభ్యర్థులకు నేరుగా ఫోన్లు చేసి సదరు పాఠశాల హెడ్‌మాస్టర్లకు రిపోర్ట్‌ చేయాలని సూచించడంతో 6, 7 తేదీల్లో అందరూ అభ్యర్థులు విధుల్లో చేరారు.

Updated Date - Nov 11 , 2026 | 12:11 AM