యూరియా విక్రయం నిలిపివేత
ABN , Publish Date - May 07 , 2026 | 11:36 PM
:ఆహార పంటల సాగులో నానాటికీ పెరుగుతున్న ఎరువుల వినియోగాన్ని నియంత్రించడంతోపాటు, రైతులకు అందిస్తున్న సబ్సిడీ ఎరువులు అక్రమంగా తరలించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిఘా సారిస్తున్నాయి.
ఎరువుల వినియోగంపై నిఘా
సబ్సిడీ యూరియా అక్రమ తరలింపుపై టాస్క్‌ఫోర్స్ బృందం
ఎరువుల ఉత్పత్తిదారు, డీలర్ల నిల్వలపై ముమ్మర తనిఖీలు
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి) :ఆహార పంటల సాగులో నానాటికీ పెరుగుతున్న ఎరువుల వినియోగాన్ని నియంత్రించడంతోపాటు, రైతులకు అందిస్తున్న సబ్సిడీ ఎరువులు అక్రమంగా తరలించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిఘా సారిస్తున్నాయి. ఎరువుల ఉత్పత్తిదారు నుంచి రిటైల్‌గా విక్రయించే డీలర్లు, జిల్లాల సరిహద్దుల వద్ద, పంటలు సాగుచేస్తున్న రైతు వినియోగ మోతాదులపై నిఘాపెట్టాయి. ఈ మేరకు అన్ని స్థాయిల్లో ప్రత్యేక టాస్స్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశాయి. ఈ బృందాల్లో వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్, పరిశ్రమల, పౌరసరఫరాల, కార్మికశాఖ అధికారులు సభ్యులుగా ఉన్నారు.
టాస్క్‌ఫోర్స్ బృందాలు క్షేత్రస్థాయిలో విరివిగా తనిఖీలు, అక్రమాలకు ఆస్కారం ఉండే ప్రదేశాల్లో సోదాలు నిర్వహించాలని ప్రభు త్వం ఆదేశాలు జారీచేసింది. యూరియా, తదితర ఎరువులను రైతులకు ప్రభుత్వం రాయితీ ధరలపై అందిస్తోంది. అయితే రాయితీ ధరలకు, బహిరంగ మార్కెట్‌లో వ్యవసాయాతేర వినియోగానికి ఎరువుల ధరల్లో దాదాపు 10 రెట్ల వ్యత్యాసం ఉంది. దీంతో రైతుల పేరుతో ఎరువులను అక్రమంగా తరలిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సబ్సిడీ ఎరువులు పక్కదారిపట్టకుండా చర్య లు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో వ్యవసాయశాఖ ఎరువుల విక్రయాలు, వినియోగం, అక్రమతరలింపులపై ప్రత్యేక దృష్టిసారించింది. కొద్ది రోజుల్లో వానాకాలం సీజన్ ప్రారంభం కానుండటంతో వ్యవసాయశాఖ ఎరువుల విక్రయాలు, వినియోగాన్ని క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో నిర్వహిస్తున్న ‘రైతు పండుగ’లో సైతం ఎరువుల వినియోగ మోతాదులపై రైతులకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు.
యాప్ ద్వారా విక్రయాలు, తగ్గని కొనుగోళ్లు...
ఎరువుల వినియోగాన్ని క్రమబద్ధీకరించేందుకు వ్యవసాయశాఖ ఫర్టిలైజర్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా బుక్‌చేసుకున్న రైతులు వారి సాగు విస్తీర్ణం, పంట రకానికి అనుగుణంగా అవసరమైన మోతాదులోనే యూరియాను అందిస్తోంది. అయినా యాసంగి సీజన్‌లో ఎరువుల వినియోగం ఏమాత్రం తగ్గలేదు. జిల్లా వ్యవసాయశాఖ అధికారుల అంచనాలకు మించి ఎరువుల విక్రయాలు సాగాయి. యాప్‌లో ఎరువుల స్టాక్ నమోదు చేసిన కొద్ది నిమిషాల్లోనే బుకింగ్ పూర్తికావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సామాన్య రైతులకు ఎరువులు, ముఖ్యంగా యూరియా దొరక్క ఆందోళనలు నిర్వహించారు. అయితే పంటలు సాగు చేయని భూవిస్తీర్ణం సైతం యాప్‌లో నమోదు చేసి ఎరువులను కొనుగోలు చేయడం ద్వారా జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం, అవసరమయ్యే ఎరువుల పరిమాణానికి మించి విక్రయకాలు జరిగినట్లు అధికారులు భావించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో అసలు యాప్ ద్వారా కొనుగోలు చేసిన రైతులు ఎరువుల నిల్వలు వినియోగించారా? లేక అక్రమమార్గం పట్టాయా? అనే సందిగ్ధం నెలకొంది. అయితే ఈ వానాకాలం సీజన్‌లో అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకూడదని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. దీంతో అసలు క్షేత్రస్థాయిలో ఎరువుల వినియోగంపై టాస్క్‌ఫోర్స్ బృందాలు ముమ్మర తనిఖీలు చేపట్టనున్నాయి. అవసరానికి మించి ఎరువులు కొనుగోలు చేస్తున్న వ్యక్తులు, ఏ డీలర్ల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు?, ఏ పంటలకు వినియోగించారు? అనే అంశాలను టాస్క్‌ఫోర్స్ బృందాలు పరిశీలించనున్నాయి.
యూరియా నిలిపివేత
వానాకాలం సీజన్ ప్రారంభానికి మరో మూడు వారాల గడువు ఉండటంతో తాత్కాలికంగా యూరియా విక్రయాలను వ్యవసాయశాఖ నిలిపివేసింది. అయితే యాసంగి సీజన్ నుంచి యూరియా విక్రయాలను ప్రత్యేకంగా ఫర్టిలైజర్ యాప్ ద్వారా నిర్వహించింది. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా ఎరువుల బుకింగ్‌ను అనధికారికంగా నిలిపివేశారు. ప్రస్తుతం ఎరువుల డీలర్ల వద్ద 6వేల మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నప్పటికీ, అవసరం లేకుండా జరిపే కొనుగోళ్లను నిలిపివేసేందుకు అనధికారిక నిర్ణయం అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వరి, తదితర పంటల సాగులేనందున విక్రయాలను నిలిపివేస్తూ వ్యవసాయశాఖ నిర్ణయం తీసుకున్నప్పటికీ, అధికారికంగా రైతులకు దీనిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వానాకాలం పంటల సాగుకు కొంత సమయం ఉండగా, ఎరువుల విక్రయాలు నిలిచిపోవడంతో ఆయిల్‌పామ్, కూరగాయలు, పాడి పశువుల గ్రాసానికి వినియోగించే జొన్న, తదితర గడ్డి రకాల సాగు చేసుకునే రైతులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ రైతుల వాస్తవ సాగు విస్తీర్ణం పరిశీలించి అవసరమైన ఎరువులను జిల్లాస్థాయిలో యాప్ బుకింగ్ ఏర్పాట్లు చేసి, సరఫరా చేస్తామని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఫర్టిలైజర్ యాప్‌లో యూరియా బుకింగ్ నిలిపివేత తాత్కాలికమేనని, తొలకరి వర్షాలు కురిసి, పంటల సాగుకు సన్నద్ధమైన వెంటనే యథావిధిగా యాప్ ద్వారా యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో పంటల సాగు, ఎరువుల వినియోగం ఇలా..
సంవత్సరం పంటల సాగు (ఎకరాలు) ఎరువుల వినియోగం
వానాకాలం యాసంగి
2024 4,25,145 3,11,390 45,804 మెట్రిక్‌టన్నులు
2025 4,65,953 3,14,621 47,528 మెట్రిక్‌టన్నులు
2026 4,75,000 - 86,322 మెట్రిక్‌టన్నులు