Share News

పంటల ప్రణాళికలపై ఇంకా అయోమయమే!

ABN , Publish Date - Nov 12 , 2026 | 11:59 PM

ఎల్‌నినో ప్రభావంతో జిల్లా లో పంటల ప్రణాళికను రూపొందించాల్సి ఉండగా, యాసంగి సీజన్‌ సమీపించినా ఇంకా అయోమయ పరిస్థితులే ఉన్నా యి.

పంటల ప్రణాళికలపై ఇంకా అయోమయమే!

ప్రత్యామ్నాయ సాగుపై మల్లగుల్లాలు

ఆచితూచి వ్యవహరిస్తున్న రాష్ట్ర, జిల్లా వ్యవసాయశాఖ

యాసంగి సీజన్‌లో రైతుల గందరగోళం

నీటి వనరులకు అనుగుణంగా నిర్ణయాలపై చర్చ

(ఆంధ్రజ్యోతి,నల్లగొండ): ఎల్‌నినో ప్రభావంతో జిల్లా లో పంటల ప్రణాళికను రూపొందించాల్సి ఉండగా, యాసంగి సీజన్‌ సమీపించినా ఇంకా అయోమయ పరిస్థితులే ఉన్నా యి. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించాల్సి ఉండగా, ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు ఎలా నచ్చజెప్పాలి, వారిని ఏ చైతన్యం చేయాలి, పంటల సాగుపై ఎలా అవగాహన కల్పించాలనే దానిపై యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటి కే చాలా చోట్ల వానాకాలం వరి కోతలు పూర్తికావస్తున్న నేపథ్యంలో రైతులు ఈ సీజన్‌లో ఏ పంటలు సాగుచేయాలనే దానిపై గందరగోళంలో పడ్డారు. వ్యవసాయశాఖ పంట ప్రణాళికలో భాగంగా ప్రత్యామ్నయ పంటలను సాగుచేసేలా ప్రోత్సహిస్తే దిగుబడి రాకున్నా, మార్కెటింగ్‌ లేకున్నా, మద్దతు ధర దక్కకున్నా సమస్య మరింత జఠిలం అవుతుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారులు జిల్లాలో నీటి వనరులకు అనుగుణంగా పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. అయితే యాసంగి సీజన్‌ సమీపించినప్పటికీ ప్రణాళిక రూపకల్పన ఆలస్యముతోంది. ప్రత్యామ్నాయ పంటలు వేటిని సాగుచేయాలన్నదానిపై సరైన సూచనలు చేస్తే అందుకు తగిన విధంగా విత్తనాలను అందుబాటులో ఉంచాలి. ఈ పరిస్థితులతోనే జిల్లా వ్యవసాయశాఖ ముందుకు ఎలా వెళ్లాలనేదానిపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నట్లు సమాచారం.

నీటి నిల్వల ఆధారంగా పంటల సాగు

ఎల్‌నినో కారణంగా జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నీటినిల్వల ఆధారంగా పంటల సాగుకోసం రాష్ట్ర వ్యవసాయశాఖ జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో చర్చిస్తున్నారు. రైతులను పూర్తిస్థాయిలో ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. సాగునీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని యాసంగి ప్రణాళిక కొంచెం ఆలస్యమైనా పకడ్బందీగా రూపొందించేందుకు నిర్ణయించారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉండే ఏఈవోలు, ఏవోలు, డివిజన్‌, జిల్లాస్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితులు అడిగి తెలుసుకుంటూ సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే వానాకాలంలో పత్తి పంటపూర్తిగా కోల్పోయిన రైతులు పెట్టుబడులు రాకపోవడంతో నష్టపోయారు. 30శాతం లోపే పత్తి పంట ఉన్నా ఎకరాకు కనీసం రెండు క్వింటాళ్ల దిగుబడి రాకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ క్రమంలో యాసంగిలో పంటల ప్రణాళికలపై నిర్ణయాలు ఓ కొలిక్కి రాకపోవడంతో రైతులు అయోమయంలో ఉన్నారు.

ఆరుతడిపంటల జాబితాలో తలమునకలు

జిల్లాలో యాసంగిలో సాగుచేయాల్సిన ఆరుతడిపంటల జాబితా విషయంలో జిల్లా అధికారులు తలమునకలయ్యారు.తక్కువ నీటితో సాగుచేసే పంటల జాబితాను రూపొందించనున్నారు. జిల్లాలో శనగ, జొన్న, పెసర, మినుము, సజ్జ, ఆముదాల వంటి పంటలను ఎంపిక చేసే యోచనలో ఉన్నారు. అదేవిధంగా మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వుల వంటి పంటల విషయంలోనూ రైతులకు అవగాహన కల్పించనున్నారు. వీటితో పాటు మార్కెట్‌ సౌకర్యం ఉన్న పంటలను సాగుచేసేలా ప్రణాళికలు రూపొందించేందుకు నిర్ణయించారు. అయితే జిల్లాలో రైతులు పత్తి, వరి పంటలనే సాగు చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు వ్యవసాయశాఖ అధికార యంత్రాంగం తీవ్ర కసరత్తు చేయాల్సి ఉంటుంది.

అడుగంటిన భూగర్భ జలాలు

తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఈ పరిస్థితుల్లో వరి పంటతో పాటు ఆరుతడి పంటలను సాగుచేయాలంటే ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వానాకాలం సీజన్‌లో వరి సాగుచేయవద్దని ప్రభుత్వంతో పాటు వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచించినా జిల్లాలో పెద్ద మొత్తంలో వరి సాగైంది. యాసంగిలో మాత్రం పరిస్థితులు దారుణంగా ఉండటంతో రైతులు కొంత మేర ఆలోచన చేసి వరి సాగుకు వెనుకంజ వేస్తున్నారు. అక్టోబరు నెలాఖరునాటికి జిల్లాలో 8.94మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. దీంతో బోరుబావులు ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో రైతులు ఉన్న కొద్దిపాటి నీటివనరులకు అనుగుణంగా ఆరుతడి పంటలు సాగుచేయాల్సిన పరిస్థితి ఉంది. వీటితో పాటు కూరగాయల సాగును కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

Updated Date - Nov 12 , 2026 | 11:59 PM