Share News

అభిప్రాయ సేకరణకు రంగం

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:34 AM

ఇథనాల్‌ పరిశ్రమతో భూమి, గాలి, నీరు కలుషితమై తమ జీవితాలు ఆగమైతాయని ప్రజల ఆవేదన. కంపెనీ ఏర్పాటుతో స్థానికులకు ఉద్యోగాలు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పరిశ్రమవర్గాల వాదన.

అభిప్రాయ సేకరణకు రంగం

ఇథనాల్‌ పరిశ్రమపై ప్రజాభిప్రాయసేకరణ నేడే

అభిప్రాయసేకరణను కొనసాగించాలని హైకోర్టు సూచన

అందరి అభిప్రాయాలు నమో దు చేయాలంటోన్న స్థానికులు

ఎన్జీవోల ముసుగులో వచ్చి, స్థానికుల అభిప్రాయాలకు భిన్నంగా మాట్లాడేవారిని నియంత్రించాలనే సూచనలు

భారీగా పోలీస్‌ బందోబస్తు

సజావుగా అభిప్రాయ సేకరణ నిర్వహిస్తాం : వెంకన్న, ఈఈ

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి- నల్లగొండ): ఇథనాల్‌ పరిశ్రమతో భూమి, గాలి, నీరు కలుషితమై తమ జీవితాలు ఆగమైతాయని ప్రజల ఆవేదన. కంపెనీ ఏర్పాటుతో స్థానికులకు ఉద్యోగాలు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పరిశ్రమవర్గాల వాదన. వెరసి పరిశ్రమ ఏర్పాటు చేయొద్దని స్థానికులు డిమాం డ్‌ చేస్తుంటే, లేదు కంపెనీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని పరిశ్ర మ యాజమాన్యం కోరుతోంది. దీం తో ఇరువర్గా ల వాదనలు విన్న హైకో ర్టు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి, ఎవరికి వారు తమ వాదనలు వినిపించాలని సూచించింది. దీంతో నేడు దామరచ ర్ల మండలం వీర్లపాలెంలో అభిప్రాయ సేకరణ జరగనుంది.

దామరచర్ల మండలం వీర్లపాలెంలో సోహం ఆగ్రో ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఏర్పాటు చేయబోతున్న ఇథనాల్‌ పరిశ్రమపై ప్రజాభిప్రాయ సేకరణకు రంగం సిద్ధమైంది. అభిప్రాయ సేకరణను నిలిపివేయాలని కోరుతూ గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రస్తుతానికి సేకరణ కొనసాగించాలని, పిటిషన్‌దారులు తమ అభ్యంతరాలు, ఆందోళనల అంశాలను ఈ అభిప్రాయ సేకరణలో వెల్లడించాలని సూచిస్తూ హైకోర్టు కేసును ముగించడంతో అభిప్రాయ సేకరణకు లైన్‌క్లియర్‌ అయింది. కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకన్న, ఇతర అధికారులు ఈ అభిప్రాయ సేకరణ చేపడతారు. ఉదయం 10.30నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమంలో తమ అభ్యంతరాలు, ఆక్షేపణలు, అనుమానాలను వ్యక్తం చేసేందుకు స్థానికులు, రైతులు, పర్యావరణ, సామాజికవేత్తలు, ప్రజాసంఘాలు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పారదర్శకంగా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలనే డిమాండ్లు

ఈ ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు సం బంధించి విశాఖపట్టణానికి చెందిన ఎస్వీ ఎన్విరో ల్యాబ్స్‌, రీసెర్చ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూపొందించిన 700 పైచిలుకు పేజీల పర్యావరణ ప్రభావ అంచనాల నివేదిక తప్పుల తడకగా రూపొందించారనే అభిప్రాయాలు ఇప్పటికే వ్యక్తమయ్యాయి. అభిప్రాయ సేకరణ లో స్థానిక ప్రభావిత ఆవాసాలు, జన జీవితంపై, జంతుజాలాలు, నీటివనరులు, అటవీసంపద, పర్యావరణంపై చూపే ప్రభావాలను వెల్లడించేందుకు సైంటిస్ట్స్‌ ఫర్‌ పీపుల్‌, మానవ హక్కుల వేదిక, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ పీపుల్స్‌జాయింట్‌ యాక్షన్‌ కమిటీకి చెందిన సామాజికవేత్తలు, స్థానికులు, రైతులు, యువకులు, గిరిజన నాయకులు సిద్ధమైన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇక్కడ లేవనెత్తే అంశాలు, అభ్యంతరాలన్నింటినీ వీడియో రికార్డింగ్‌తోపాటు, ఆడియో రికార్డింగ్‌ చేసేందుకు కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని, తమ సందేహాలు, అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఇదొక్కటే చివరి మార్గమైనందున మాట్లాడే ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని నమోదు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

భారీగా పోలీసుల మోహరింపుతో భయాందోళన

ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరాలు, అభిప్రాయ సేకరణను నిలిపివేయాలనే డిమాండ్‌ నేపథ్యం లో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అభిప్రాయ సేకరణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కార్యక్రమం ముగిసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. శుక్రవారం నల్లగొండ ఏఎస్పీ రమేష్‌, మిర్యాలగూడ డీఎస్పీ జి.రవి వీర్లపాలెం గ్రామంలో పర్యటించడంతోపాటు, పరిశ్రమ వద్ద ఏర్పాటు చేస్తోన్న ప్రజాభిప్రాయసేకరణ వేదికను పరిశీలించారు. భారీగా పోలీసులను మోహరించేందుకు రంగం సిద్ధమైందనే సంకేతాలతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్లాంట్‌ వెదజల్లే కాలుష్యం, తదనంతరం స్థానికంగా ఎదురయ్యే ఇబ్బందులపై తాము వ్యక్తంచేస్తున్న అభ్యంతరాలు, అనుమానాలు, సందేహాలను నిపుణులతో నివృత్తి చేయాల్సిన ప్రభుత్వ అధికారులు ఆ బాధ్యతని విస్మరించి గ్రామంలో పోలీసులను మోహరించి, ప్రజల్లో ఆందోళనకు కారణమవడం సమంజసం కాదనే విమర్శలొస్తున్నాయి. ప్రశాంతంగా స్థానికులు లేవనెత్తే అభ్యంతరాలు, అభిప్రాయాలను నమోదు చేసేలా పోలీసులు సైతం సహకరించాలని సామాజిక, పర్యావరణవేత్తలు, స్థానికులు కోరుతున్నారు.

అభ్యంతరాలు నివృత్తి చేయలేకపోతే..

ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుతో ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలపై తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా స్థానికుల అభ్యంతరాలను, ఆందోళనలను పట్టించుకోకుండా ఏకపక్షంగా అభిప్రాయసేకరణ కొనసాగించినా, ఈకార్యక్రమాన్ని హైజాక్‌చేసి నామమాత్రంగా ముగించినా అంగీకరించేదిలేదని ఉద్యమకారులు పేర్కొంటున్నారు. తమ అభ్యంతరాలు, ఆందోళనలను పరిశ్రమ యాజమాన్యం, అధికారులు నివృత్తి చేయాలని, లేదంటే న్యాయపోరాటం కొనసాగిస్తామని, జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ని సైతం ఆశ్రయించేందుకు వెనకాడేది లేదని తెలిపారు.

ఎన్‌జీవోల ముసుగులో మాట్లాడేవారిని..

పర్యావరణ, కాలుష్య నియంత్రణమండలి చేపట్టే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలను ఆసరాగా చేసుకొని ఎలాంటి పర్యావరణహిత, సామాజిక అంశాలతో సంబంధం లేకపోయినా ఎన్‌జీవోల పేరుతో సంస్థలను పెట్టుకొని ఇక్కడకు వచ్చి హడావిడి చేయడం ద్వారా స్థానికులు, స్థానికంగా పర్యావరణ, కాలుష్య, సామాజిక అంశాలపై పోరాడేవారికి మాట్లాడే అవకాశం లేకుండా చేసేవారిని నియంత్రించాలనే డిమాండ్‌ వస్తోంది. ఏపీ, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక తదితర ప్రాంతాల్లో ఎన్‌జీవోలుగా పనిచేస్తున్నామని పేర్కొనే ఈ సంస్థల ప్రతినిధులు ఇలాంటి కార్యక్రమాల వద్దకు వచ్చి పరిశ్రమలు ఏర్పాటుచేసే సంస్థలకు అనుకూలంగా తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తూ స్థానికంగా ఉండే కీలకమైన అభ్యంతరాలను, సామాజిక, ప్రజా ఉద్యమకారులు లేవనెత్తే అంశాలకు ప్రాధాన్యం దక్కకుండా హైజాక్‌ చేస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వీరిని గుర్తించి నియంత్రించాలని, తొలుత స్థానికులు, నల్లగొండ జిల్లాకు చెందిన సామాజికవేత్తలు, పర్యావరణవేత్తలు, ప్రజాసంఘాల నాయకులు, ఆ తర్వాత తెలంగాణలో కీలకంగా ప్రజా, రైతు, ఆందోళనలు నిర్వహిస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ అంశంపై జిల్లా ఉన్నతాధికారులు, పర్యావరణ, కాలుష్యనియంత్రణ మండలి అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.

సజావుగా నిర్వహిస్తాం

వీర్లపాలెంలో సోహంసంస్థ ఏర్పాటు చేయదలపెట్టిన ఇథనాల్‌ పరిశ్రమపై శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నాం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ముందుగా ప్రకటించిన నోటీస్‌ ప్రకారం కార్యక్రమం నిర్వహిస్తాం. స్థానికులందరి అభిప్రాయాలను వినిపించేందుకు అవకాశం కల్పిస్తాం. హైకోర్టు నుంచి ఎలాంటి అభ్యంతరం రాలేదు.

వెంకన్న, ఈఈ, పర్యావరణ కాలుష్యనియంత్రణమండలి, నల్లగొండ

Updated Date - Nov 20 , 2026 | 12:34 AM