నేటి నుంచి ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:24 AM
జిల్లాలో నేటి నుంచి ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు కొనసాగనున్నాయి. ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించే ఈ శిబిరాల్లో మహిళలు, వయోవృద్ధులు, పిల్లలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చు.
ప్రతిచోటా ఆరుగురు వైద్యనిపుణులు హాజరు
భానుపురి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నేటి నుంచి ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు కొనసాగనున్నాయి. ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించే ఈ శిబిరాల్లో మహిళలు, వయోవృద్ధులు, పిల్లలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చు. ఇందుకోసం వైద్యనిపుణులను కూడా ఈ శిబిరానికి హాజరుకానున్నారు. జిల్లాలోని 23 మండలాల్లోని 22 పీహెచసీలు, 4 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటుచేస్తున్నారు. గైనకాలజిస్టులు, పిడియాట్రిక్, జనరల్ ఫిజిషియన, ఆర్థోపెడిక్ నిపుణులు, కంటి, పంటి వైద్యనిపుణులు రోగులను పరీక్షించనున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 36 మంది వైద్యనిపుణులను ఎంపిక చేసి ఆరుగురు చొప్పున ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా రోగులకు పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారి రక్తనమూనాలను టీహబ్‌కు పంపించనున్నారు. స్థానిక వైద్యాధికారులు, పారామెడికల్ సూపర్‌వైజర్లు, సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తమ ప్రాంతాల్లో అవగాహన కల్పించి ప్రజలను శిబిరాలకు హాజరయ్యేలా చూడాలని డీఎంహెచవో డాక్టర్ పెండెం వెంకటరమణ ఒక ప్రకటనలో కోరారు.
శిబిరాలు ఏ రోజు, ఎక్కడ..
ఈ నెల 4న అనంతగిరి, త్రిపురవరం, 5న అర్వపల్లి, సూర్యాపేట పట్టణం రాజీవ్‌నగర్, 6న ఆత్మకూరు(ఎస్), సూర్యాపేట పట్టణం అంబేడ్కర్‌నగర్, 7న చిలుకూరు, కోదాడ పట్టణం బాలాజీనగర్, 9న చివ్వెంల. సూర్యాపేటలోని గిరినగర్, 10న గరిడేపల్లి, 11న కల్మలచెర్వు, 12న కాపుగల్లు, 13న కాసరబాద్, మార్చి 14న లింగగిరి, 15న మఠంపల్లి, 17న మేళ్లచెర్వు, 18న మోతె, 20న మునగాల, 23న నాగారం, 24న నేరేడుచర్ల, 25న నూతనకల్, 26న పెంచికల్‌దిన్న, 28న పెనపహాడ్, 30న రేపాల, 31న తిరుమలగిరి పీహెచసీలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారు.