Share News

ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Apr 20 , 2026 | 11:47 PM

యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధానంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తున్న దొడ్డురకం ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించేందుకు జిల్లా అధికారయంత్రాంగం కార్యాచరణ ప్రారంభించింది.

ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి

తాలు, తేమ శాతం పేరుతో కాంటాల్లో జాప్యం

మిల్లుల వద్ద దిగుమతుల్లో తీవ్ర ఆలస్యం

పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి యంత్రాంగం

కలెక్టర్‌ నుంచి తహసీల్దార్‌ వరకు క్షేత్రస్థాయికి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధానంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తున్న దొడ్డురకం ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించేందుకు జిల్లా అధికారయంత్రాంగం కార్యాచరణ ప్రారంభించింది.

కొనుగోలు కేంద్రాలకు వస్తోన్న దొడ్డురకాల ధాన్యం లో తాలు శాతం ఎక్కువగా ఉందనే కారణంతో కాంటా వేయకపోవడంతో కేంద్రాల వద్ద కల్లాల్లో పెద్ద సంఖ్యలో రైతులు ధాన్యం ఆరబోశారు. 10 నుంచి 15 రోజులకు కాంటా వేసినా మిల్లుల వద్ద దిగుమతి చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 300 ఽధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సోమవారం సాయంత్రం వరకు కల్లాల్లో సుమారు 3.14లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని రైతులు ఆరబోశారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై మిల్లర్లు, అధికారులతో సమీక్షించిన కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ధాన్యం ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. అదనపు కలెక్టర్లు, సబ్‌కలెక్టర్‌,ఆర్డీవోలు, తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్‌మిల్లుల వద్దకు కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

తాలు, తేమశాతం, ధాన్యంలో కోతే అసలు సమస్య

జిల్లాలో యాసంగిలో కొనుగోలు కేంద్రాలకు వస్తోన్న దొడ్డురకం ధాన్యంలో తాలు శాతం ఎక్కువగా ఉండడంతో కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పంటకాలమంతా మంచు ఎక్కువగా కురియడం, అదే సమయంలో ప్రైవేట్‌ కంపెనీల స్వల్పకాలిక దొడ్డురకాల విత్తనాల్లో నాణ్యత తగ్గడం, దోమకాటు వంటి కారణాలకు తోడు అకాల వర్షాల భయంతో రైతులు పచ్చిగింజ ఉన్నప్పుడే వరికోతలు ప్రారంభించారు. దీంతో తాలు శాతం ఎక్కువయింది. సహజంగా యాసంగిలో ఐదు నుంచి ఏడు శాతం మేర తాలు ఉంటుంది. ఈసారి అదికాస్తా 12 నుంచి 16 శాతం వరకు పెరిగిందని, కేంద్రాలకు వస్తున్న ధాన్యంలో 80శాతం మేర ఇదే పరిస్థితి ఉందని అధికారులు, కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. సన్నరకాల కంటే తక్కువే తాలు శాతం వస్తోందని, సన్నరకాలను కొనుగోలుచేస్తున్న మిల్లర్లు దొడ్డురకాలను మాత్రం తీసుకోకుండా తూకంలో కోత విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. క్వింటాకు 2 కిలోల వరకు కోత విధిస్తే రైతులకు ఇబ్బందిలేదు. తాలు, తేమ ఎక్కువగా ఉందనే సాకుతో కొన్నిచోట్ల 3 నుంచి 4 కిలోల వరకు కోత విధించడం ఎంతవరకు సమంసజమని ప్రశ్నిస్తున్నారు. మిల్లుల వద్ద ధాన్యంలో కోతకు రైతులు అంగీకరిస్తేనే ట్రక్‌ షీట్లు జనరేట్‌ చేస్తున్నారని, అందుకే కాంటా పూర్తయిన తర్వాత మిల్లులకు చేరిన ధాన్యానికి సైతం ట్రక్‌ షీట్లు రావడం లేదని రైతులు చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి నాణ్యమైన ధాన్యం ఉంటే అడ్డగోలుగా కోత విధించకుండా ఉండేందుకు తహసీల్దార్లు, ఆర్‌ఐలు, ప్రత్యేకాఽధికారులను నేరుగా మిల్లుల వద్దకు వెళ్లి తక్షణమే కాంటావేయించడంతో పాటు, ట్రక్‌ షీట్లు జనరేట్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో వారంతా సోమవారం రంగంలోకి దిగారు.

జిల్లాలో 3,527 పెండింగ్‌ ట్రక్‌ షీట్లు

జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించ గా, కేంద్రాలకు 3,97,554 మెట్రిక్‌టన్నుల ధాన్యం వచ్చింది. అందులో ఇప్పటివరకు రూ.199.09కోట్ల విలువైన 83,338 మెట్రిక్‌టన్నుల ధాన్యం కాంటాలు పూర్తయ్యాయి. అందులో 81,233 మెట్రిక్‌టన్నుల ధాన్యం మిల్లులకు చేరింది. మొత్తం మిల్లులకు చేరిన ధాన్యానికి 4,643 ట్రక్‌ షీట్లు జనరేట్‌ కావాల్సి ఉండగా, అందులో ఇప్పటివరకు కేవలం 1,116 ట్రక్‌ షీట్లు మాత్రమే జనరేట్‌ చేశారు. ఇంకా 3,527 ట్రక్‌ షీట్లు జనరేట్‌ చేయాల్సి ఉంది. మిల్లులకు చేరిన ధాన్యంలో తాలు, తేమ శాతం పేరుతో మిల్లర్లు విధించే తూకం కోతకు రైతులు అంగీకరిస్తే వెంటనే ట్రక్‌ షీటద్‌ ఇస్తున్నారని, లేకపోతే జనరేట్‌ చేయకుండా జాప్యం చేస్తున్నారని, అంతేగాక ధాన్యాన్ని వెనక్కి తీసుకెళ్లాలని సైతం చెబుతుండడం, అక్కడ ధాన్యం దించే క్రమంలో జాప్యం వల్లే ట్రక్‌ షీట్లు జనరేటట్‌ కావడం లేద ని రైతులు చెబుతున్నారు. కలెక్టర్‌ సహా ఉన్నతాధికారులు జిల్లాలో కొనుగోలు కేంద్రాలను తనిఖీచేసిన క్రమంలో ఈ సమస్య వెలుగులోకి రావడంతో సోమవారం అదనపు కలెక్టర్లు మొదలు, తహసీల్దార్ల వరకు అంతా క్షేత్రస్థాయికి వెళ్లాలని నిర్ణయించారు. ఆ మేరకు సోమవారం అధికారులంతా కొనుగోలు కేంద్రాలు, మిల్లులను తనిఖీచేసి పరిస్థితి సమీక్షించారు. మిల్లుల వద్ద ధాన్యం లారీలు నిలిచిపోకుండా వెంటనే దిగుమతి చేయాలని సూచించారు. కల్లాల వద్ద సైతం కాంటాలు వేయాలని ఆదేశించారు. అన్ని మండలాల్లో అధికారయంత్రాంగం క్షేత్రస్థాయికి, మిల్లల వద్దకు వెళ్లడంతో కొంత కదలిక కనిపించినా, ఈ ప్రక్రియ కొనుగోళ్లు మొగ్గేంతవరకు కొనసాగితే తప్ప రైతులకు ఉపశమనం దక్కదని, అప్పటివరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని కోరుతున్నారు.

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చర్యలు : బి.చంద్రశేఖర్‌, కలెక్టర్‌

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్రాల వద్ద కాంటాలు, మిల్లుల వద్ద దిగుమతి వేగవంతం చేయాలని సూచించాం. నాతో పాటు అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు, సీనియర్‌ అధికారులు, నిరంతరం కొనుగోలు కేంద్రాలు, మిల్లులను తనిఖీచేస్తారు. మిల్లుల వద్దకు వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించి ధాన్యం దిగుమతి ప్రక్రియలో జాప్యం చేయవద్దని హెచ్చరించాం. హమాలీల సమస్య సైతం రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించాం. ఎక్కడైనా రైతులకు ఇబ్బంది కలిగితే చర్యలు తీసుకుంటాం. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు. మద్దతు ధరకే ధాన్యం విక్రయించాలి. అధికారయంత్రాంగం అన్ని స్థాయిల్లో రైతులకు అందుబాటులో ఉంటుంది.

Updated Date - Apr 20 , 2026 | 11:47 PM