ఇంటికి సౌరశక్తి.. అదనపు ఆదాయం
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:10 AM
సౌరశక్తి వినియోగించే దేశంగా మార్చే ప్రయత్నంలో భాగంగా పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
సౌరశక్తి వినియోగించే దేశంగా మార్చే ప్రయత్నంలో భాగంగా పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. పర్యావరణ హితంతో పాటు విద్యుత చార్జీల భారాన్ని తగ్గించడమమే లక్ష్యంగా భారీ సబ్సిడీలు అందిస్తూ సౌర విద్యుత వినియోగాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి సౌరవిద్యుత ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత అందిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
(ఆంధ్రజ్యోతి-బీబీనగర్)
రోజురోజుకూ విద్యుత వినియోగం గణనీయంగా పెరుగుతోంది. రోజు వారి అవసరాలకు యంత్రాల వినియోగంతో విద్యుత వాడకం ఒకప్పటి కంటే రెండింతలైంది. అదేస్థాయిలో విద్యుత బిల్లులు కూడా మధ్య తరగతిపై ఆర్థికభారాన్ని మోపుతున్నాయి. అదేసమయంలో దేశంలో విద్యుత వినియోగం పెరగడంతో డిమాండ్‌కు తగ్గట్టు విద్యుతను సరఫరా చేయాలంటే ప్రభుత్వాలకు భారంగా మారుతోంది. వీటన్నింటికీ పరిష్కారాల్లో భాగంగా విద్యుత వినియోగం తగ్గించి అందుకు ప్రతిగా సౌర విద్యుత వినియోగం వైపు ప్రజలు దృష్టి సారించేలా కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. సౌర విద్యుత వినియోగాన్ని పెంచి అటు పర్యావరణ హితంగా, ఇటు సామాన్యులకు ఆర్థిక వెసులుబాటును కల్పించేందుకు ఈ పథకాన్ని చేపట్టింది.
భారీగా సబ్సిడీలు
పీఎం సూర్య ఘర్ పథకం కింద భారీ రాయితీలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇంటిపై ఏర్పాటుచేసుకునే సోలార్ ప్యానల్స్‌కు అయ్యే ఖర్చులో భారీగా సబ్సిడీలు అందిస్తోంది. సోలార్ ప్యానల్స్‌లో మూడు రకాలు ఉన్నాయి. అందులో ఆనగ్రిడ్(బ్యాటరీ ఉండదు), ఆఫ్‌గ్రిడ్(బ్యాటరీ ఉంటుంది), హైబ్రీడ్ రకాలు ఉన్నాయి. ఆనగ్రిడ్ కింద కిలోవాట్‌కు గృహస్తుడికి రూ.50 వేల వరకు, ఆఫ్‌గ్రిడ్ కింద రూ.80 నుంచి రూ.1.20 లక్షల వరకు, హైబ్రీడ్ విధానంలో రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చవుతుండగా రూ.30 వేలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తోంది. అదేవిధంగా రెండు కిలోవాట్స్‌కు రూ.60 వేలు, మూడు కిలోవాట్‌కు రూ.78 వేలు సబ్సిడీగా అందజేస్తోంది. ప్యానల్స్ బిగింపు పూర్తయ్యాక సబ్సిడీ డబ్బులను లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
పథకం లబ్ధికి అర్హతలివే
పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా లబ్ధిపొందేందుకు కొన్ని నిబంధనలు విధించారు. లబ్ధిదారుడు భారత పౌరుడై ఉండాలి. సొంత ఇంటిని కలిగి ఉండి పైకప్పు ఉండాలి. ఇంటికి విద్యుత కనెక్షన ఉండాలి. ఆధార్ కార్డు, విద్యుత బిల్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ నెంబర్, అవసరమైన ఇతర పత్రాలు అవసరం.
ఆదాయమిలా
వివిధ వాతావరణ పరిస్థితుల ఆధారంగా సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుదుత్పత్తి ఉంటుంది. కిలోవాట్ ప్యానల్స్ ద్వారా రోజుకు నాలుగు నుంచి ఐదు యూనిట్లు విద్యుత ఉత్పత్తి అవుతాయి. నెలకు 120 నుంచి 150 యూనిట్ల వరకు విద్యుత ఉత్పత్తి జరుగుతుంది. రెండు, మూడు కిలోవాట్ సామర్థ్యం ఉన్న ప్యానల్స్‌ను ఏర్పాటు చేసుకున్న వారు గృహావసరాలకు పోను మిగిలిన విద్యుతను విద్యుత గ్రిడ్‌కు విక్రయించి అదనపు ఆదాయం పొందే అవకాశం కల్పిస్తున్నారు. అయితే ప్రభుత్వం గుర్తించిన వేండర్ల ద్వారా సోలార్ ప్యానల్స్ అమర్చుతారు. ప్రభుత్వ రంగ విద్యుత గ్రిడ్‌తో అనుసంధానం చేస్తారు. ఇదిలా ఉండగా సోలార్ ప్యానల్స్ 20 నుంచి 25 ఏళ్ల పాటు స్థిరమైన విద్యుతను విద్యుత ఉత్పత్తి చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.