మూడు నెలల్లో ఏడు ప్రమాదాలు
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:38 AM
నల్లగొండ జిల్లాలో విస్తరించిన నాగార్జునసాగర్-హైదరాబాద్ రాష్ట్ర రహదారి నిత్యం నెత్తురోడుతోంది. అతివేగం, ప్రమాద హెచ్చరికల బోర్డులు లేకపోవడం, అజాగ్రత్త కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రమాదకరంగా సాగర్-హైదరాబాద్ రాష్ట్ర హైవే
ఇప్పటికే 8 మంది మృతి
నల్లగొండ జిల్లాలో విస్తరించిన నాగార్జునసాగర్-హైదరాబాద్ రాష్ట్ర రహదారి నిత్యం నెత్తురోడుతోంది. అతివేగం, ప్రమాద హెచ్చరికల బోర్డులు లేకపోవడం, అజాగ్రత్త కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై గడిచిన మూడు నెలల్లో ఏడు ప్రమాదాల్లో ఎనిమిది మృతి చెందారు. 20 మందికి పైగా క్షతగాత్రుల య్యారు. ప్రమాదాలు బాధిత కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిలిస్తున్నాయి. అయినప్పటికీ రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి-దేవరకొండ)
నల్లగొండ జిల్లాలో ప్రధాన రహదారుల్లో నాగార్జునసాగర్-హైదరాబాద్ రాష్ట్ర రహదారి ఒకటి. జిల్లాలోని మాల్ నుంచి నాగార్జునసాగర్ వరకు సుమారు 70 కిలోమీటర్ల విస్తరించి ఉంది. రాష్ట్ర రాజధాని నుంచి ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని మాచర్ల, దుర్గి, నరసరావుపేట ఇతర ప్రాంతాలకు ఈ రహదారి మీదుగానే ప్రయాణిస్తుంటారు. దీనికితోడు హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్, వైజాగ్‌కాలనీ, ఏఎమ్మార్పీ ప్రాజెక్టుల వద్దకు సెలవురోజుల్లో విహారయాత్రలకు వస్తుంటారు. దీంతో ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది.
వారంతపు రోజుల్లో..
నాగార్జునసాగర్-హైదరాబాద్ రాష్ట్ర రహదారిపై వాణిజ్యపరంగా మాల్, వీటీనగర్, చింతపల్లి, అంగడిపేటలకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు ప్రతి రోజూ తరలివస్తుంటారు. ఆయాచోట్ల నిత్యం రద్దీ ఉంటు ంది. పండుగ, ఇతర సెలవులతో సంబంధం లేకుండా రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుంది. వారాంతపు సెలవులతో పాటు కొండమల్లేపల్లిలో సంత నిర్వహణతో మరింత రద్దీ పెరిగి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మండలకేంద్రాలకు చేరువకు రాగానే డివైడర్లు ఉంటుండగా, ఆ తర్వాత రెండు వాహనాలు మాత్రమే వెళ్లేలా రహదారి ఉంది. దీంతో వాహనాల రద్దీకి తగ్గట్టుగా రోడ్డు లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఈ రహదారిపై జరిగిన వివిధ ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదాలు జరిగే ప్రాంతాలు
నాగార్జునసాగర్-హైదరాబాద్ రాష్ట్ర రహదారిపై శేరిపల్లి, చెన్నారం మలుపులు, కొండమల్లేపల్లి, జోగ్యతండా, చిన్నఅడిశర్లపల్లి మలుపు, ప్రశాంతపూరితండా, వింజమూరిగేటు, నసర్లపల్లి, వెంకటంపేట, మధనాపూర్, మాల్, నాంపల్లి మండలం దేవతపల్లి వస్ర్తాంతండా, కోదండాపూరం గేటు వద్ద ప్రమదాలు తరుచూ జరుగుతుంటాయి.
కారణాలు
హైదరాబాద్-నాగార్జునసాగర్ జాతీయరహదారిపై అతివేగంగా వాహనాలు నడపడం, హెచ్చరికల బోర్డులు లేకపోవడం, వాహనాలు నడిపేవారికి అవగాహన లేకపోవడం, ప్రమాదాల సూచికలు, హెచ్చరికల బోర్డులు లేకపోవడం. పోలీస్ తనిఖీలు చేపట్టకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణాలు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
దేవరకొండ డివిజనలో నాగార్జునసాగర్-హైదరాబాద్, కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటు న్నాం. అతివేగం, అజాగ్రత్తగా వాహనాలు నడపడమే ప్రమాదాలకు కారణాలు. ఆర్‌అండ్‌బీ, జాతీయరోడ్డు భద్రతా అధికారులు హెచ్చరికల బోర్డులు, ప్రమాదసూచికలు ఏర్పాటుచేయాలి. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి ప్రమాదాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నాం.
శ్రీనివాసరావు, డీఎస్పీ, దేవరకొండ