ఆత్మనిర్భర్ పంచాయత్‌తో స్వయం సమృద్ధి
ABN , Publish Date - May 24 , 2026 | 11:55 PM
గ్రామ పంచాయతీల ఆర్థిక పరిపుష్టి, స్వ యం సమృద్ధిని సాధించేందుకు కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ పంచాయత్ పథకం అమలుకు తాజాగా రాష్ట్రాన్ని సైతం ఎంపిక చేసింది. ఆర్థిక వనరుల పెంపునకు అవకాశం ఉన్న పంచాయతీల్లో కొత్త ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా ఆదాయాన్ని అర్జించి సమగ్ర గ్రామాభివృద్ధి సాధించాలనేది ఆత్మనిర్భర్ పంచాయత్ పథకం లక్ష్యం.
కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకం
రాష్ట్రంలో తొలిదశగా 48 గ్రామ పంచాయతీల ఎంపిక
జిల్లాలో అంకిరెడ్డిగూడెం, బీబీనగర్, కొండమడుగు
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): గ్రామ పంచాయతీల ఆర్థిక పరిపుష్టి, స్వ యం సమృద్ధిని సాధించేందుకు కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ పంచాయత్ పథకం అమలుకు తాజాగా రాష్ట్రాన్ని సైతం ఎంపిక చేసింది. ఆర్థిక వనరుల పెంపునకు అవకాశం ఉన్న పంచాయతీల్లో కొత్త ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా ఆదాయాన్ని అర్జించి సమగ్ర గ్రామాభివృద్ధి సాధించాలనేది ఆత్మనిర్భర్ పంచాయత్ పథకం లక్ష్యం. పారిశ్రామిక, పర్యాటక, వ్యాపార, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా సొంతంగా ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉన్న గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేస్తారు. పెట్టుబడులకు నాబార్డు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణసాయం అందుతుంది. వచ్చే అదనపు ఆదాయాన్ని గ్రామ మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు అవకాశం కల్పించాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం.
జిల్లాలో మూడు పంచాయతీలు
పంచాయతీ స్థాయిలో ఆర్థిక వనరులను పెంపొందించి మెరుగైన జీవన ప్రమాణాలు నెలకొల్పేందుకు కేంద్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘ఆత్మనిర్భర్ పంచాయత్’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వం అందించే 15వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ల కోసం ఎదురుచూడకుండా, స్థానికంగానే ఆదాయ వనరులను గుర్తించి, వాటి ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించేలా తీర్చిద్దేందుకు ఈ పథకం తోడ్పాటునందిస్తుంది. జాతీయస్థాయిలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అమలులో ఉన్న ఈ పథకంలో ప్రస్తుతం తెలంగాణను కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానికంగా వనరులు, అవకాశాలు ఉన్న 48 పంచాయతీలను ప్రాథమికంగా గుర్తించారు. వీటిలో జిల్లాలో మూడు పంచాయతీలు ఉన్నాయి. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం, బీబీనగర్ మండల కేంద్రం బీబీనగర్ పంచాయతీ, ఇదే మండలంలోని కొండమడుగు గ్రామాలను తొలిదశలో ఎంపిక చేశారు.
అదనపు ఆదాయం సాధించేలా..
ప్రస్తుతం ఎంపిక చేసిన పంచాయతీలకు ఆదాయం మొత్తం ఆస్తి పన్నుల వసూళ్ల ద్వారానే ఉంది. అయితే పారిశ్రామికంగా, వ్యాపార, వాణిజ్యంగా అభివృద్ధి సాధిస్తున్న ఇటువంటి గ్రామ పంచాయతీల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో వివిధ ప్రాంతాలకు చెందిన కార్మికుల నివాసాలు సైతం పెరుగుతున్నాయి. దీంతో వారికి అవసరమైన అనుబంధ సేవలతో పాటు ఫంక్షన్‌హాల్స్, వారంతపు సంతలు, వ్యాపార సముదాయాలు, పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్‌ప్లాంట్ల వంటి వాటిని నెలకొల్పడం ద్వారా అదనపు ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ పంచాయతీలను ఆత్మనిర్భర్ పంచాయత్ పథకం కింద ఎంపిక చేశారు. దీని ద్వారా అదనపు ఆదాయ వనరులను గుర్తించి, కేంద్ర ప్రభుత్వానికి నివేదించి ఆర్థిక సాయం పొందడానికి అవకాశం ఉం టుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పథకం కింద ఎంపికైన పంచాయతీలకు నాబార్డు, బ్యాంకుల నుంచి రుణాలతోపాటు కేంద్ర ప్రభు త్వం తోడ్పాటును అందించనుంది. ఈ విధంగా పంచాయతీలకు సమకూరిన ఆదాయంలో మొదట ఆర్థిక సంస్థల రుణాల చెల్లింపునకు వినియోం చి, అదనంగా వచ్చే ఆదాయంతో ఆర్థిక స్వయం సమృద్ధిని సాధించే అవకాశం కలుగుతుంది. తద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు సైతం మెరుగుపడి, ప్రజల జీవన ప్రమాణాలు పట్టణ ప్రాంతాల ప్రజలతో స మానస్థాయిలో అందుతాయని అధికార వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
ఆదాయం ఉన్న గ్రామాలపై దృష్టి
పంచాయతీలు స్వయంగా కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకుని, అదనపు ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించే అవకాశం ఉన్న వాటిని ఆత్మనిర్భర్ పంచాయత్‌కు ఎంపిక చేశారు. ఈ పంచాయతీల్లో పెట్రోల్ బంక్‌లు, ఫంక్షన్‌హాల్స్, వ్యాపార సముదాయాలు, సౌర విద్యుత్ ప్లాంట్లు, అవకాశాలు ఉన్న చోట పర్యాటక అభివృద్ధి వంటి ప్రాజెక్టులను చేపట్టి, అదనంగా ఆదాయం సమకూర్చుకునేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కనిష్ఠంగా రూ.50లక్షలు, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న పంచాయతీలను ఎంపిక చేశారు. జిల్లాలో రూ.50లక్షలు, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న మూడు పంచాయతీల ను గుర్తించారు. చౌటుప్పల్ మండలంలోని అంకిరెడ్డిగూడెం పంచాయతీకి ప్రస్తుతం ఏడాదికి రూ.70లక్షల ఆదాయం సమకూరుతోంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నగరానికి కేవలం 35కి.మీ దూరంలోనే ఉన్నా, మౌలిక సదుపాయాలు, ప్రజల జీవనప్రమాణాలు అంతగా మెరుగుపడలేదు. ఈ పంచాయతీ పరిధిలో ప్రముఖ ఫార్మా కంపెనీ దివీ్‌సతో పాటు చిన్న, చిన్న పరిశ్రమలు ఉండటంతో ఆస్తిపన్ను ద్వారా గణనీయంగా ఆదాయం సమకూరుతోంది. హైదరాబాద్ నగరానికి కేవలం 30కిలోమీటర్ల పరిధిలోనే బీబీనగర్ మండల కేంద్ర పంచాయతీ పరిధిలో బాంబినోతో పాటు ఫార్మా, ఐరన్‌స్పాంజ్, కెమికల్‌తో పాటు వివిధ ఉత్పత్తులు, సర్వీసులను అందించే పరిశ్రమలు ఉన్నాయి. ఈ మండలంలోనే కొండమడుగు పంచాయతీ పరిధిలో పారిశ్రామికవాడ విస్తరించి ఉంది. ఈ పంచాయతీ పరిధిలో ఐషర్, జైన్ వంటి సంస్థల పరిశ్రమలు, కెమికల్, తదితర ఉత్పత్తులు, సర్వీసులు అందించే కంపెనీలు వందల సంఖ్యలో ఉన్నాయి. అదే విధంగా హైదరాబాద్ నగరానికి అతిచేరువలో హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారిపై ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికే రిసార్టులు, ఫంక్షన్‌హాల్స్ సైతం ఉన్నాయి. బీబీనగర్ పంచాయతీకి ప్రస్తుతం ఏడాదికి రూ.కోటి ఆదాయం సమకూరుతుండగా, కొండమడుగు పంచాయతీకి రూ.70లక్షల ఆదాయం వస్తోంది.
డీపీవోలు, సర్పంచులతో త్వరలో సమావేశాలు
ఆత్మనిర్భర్ పంచాయత్ పథకంలో ప్రాథమికంగా ఎంపికైన ఆయా గ్రామపంచాయతీల సర్పంచులు, జిల్లా పంచాయతీ అధికారులతో నేషనల్ ఇసిస్ట్యూట్ ఆఫ్ రూరల్ డెవల్‌పమెంట్ సంస్థ సమావేశాలు నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వ పథకం విధి విధానాలను ఈ సమావేశంలో వివరించనున్నారు. అదే విధంగా ఆయా పంచాయతీల్లో అదనపు ఆదాయ వనరులు, కొత్తగా ఏ ప్రాజెక్టులు లాభదాయకమనే అంశంపై చర్చించి దిశానిర్దేశం చేస్తారు. అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయించనున్నారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర బృందం పరిశీలించి సానుకూలం ఉన్న ప్రాజెక్టులకు నాబార్డు నుంచి నిధులు సమకూర్చే అవకాశాలు ఉంటాయి.