అందుబాటులో విత్తనాలు
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:06 AM
మృగశిర కార్తె ప్రవేశించడంతో పాటు తొలకరి వర్షం కూడా పలకరించడంతో వానాకాలం సాగు కోసం రైతులు సమాయాత్తమవుతున్నారు.
టీజీ సీడ్స్ ఆధ్వర్యంలో పంపిణీకి ఏర్పాట్లు
ఉమ్మడి జిల్లాలో 174 కేంద్రాల ద్వారా సరఫరా
అందుబాటులో ఏడు రకాల వరి విత్తనాలు
కంది, పెసర, మినుము, వేరుశనగ సైతం
పచ్చిరొట్ట విత్తనాలకు 50 శాతం సబ్సిడీ
నిడమనూరు, జూన 9 (ఆంధ్రజ్యోతి): మృగశిర కార్తె ప్రవేశించడంతో పాటు తొలకరి వర్షం కూడా పలకరించడంతో వానాకాలం సాగు కోసం రైతులు సమాయాత్తమవుతున్నారు. ఈ మేరకు దుక్కులు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. పంటల సాగుకు విత్తన ఎంపికే కీలకం. ఏ పంటైనా అధిక దిగుబడి రావాలంటే నాణ్యత కలిగిన మేలు రకం విత్తనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సీజనలో రైతుల కోసం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ(టీజీ సీడ్స్) వివిధ రకాలైన వరి, అపరాలు, పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి జిల్లాలోని రైతులకు అవసరమైన మేరకు నాణ్యమైన మేలు రకం విత్తనాలను అందించేందుకు ఏర్పాటు చేసింది. ఈ సీజనలో ఉమ్మడి జిల్లాలోని 174 కేంద్రాల ద్వారా విత్తనాలు పంపిణీ చేసేందుకు సంస్థ అన్ని చర్యలూ తీసుకుంది. పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము విత్తనాలు 50 శాతం సబ్సిడీపై అందిస్తుండగా, వరి, కంది, పెసర, మినుములు, వేరుశనగ విత్తనాలకు మాత్రం సబ్సిడీ లేదు. యాసంగి సీజనలో ఉమ్మడి జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో వరి పంటలు సాగు చేశారు. ఈ వానాకాలం సీజనలో అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు భావించి, అందుకు తగ్గట్లుగా విత్తనాలకు ఇండెంట్ పెట్టారు. వానాకాలం సీజనలో పంటల సాగు పెరగనుండటంతో ఈ మేరకు సాగుకు అవసరమైన విత్తనాలు సమకూర్చేందుకు విత్తనాభివృద్ధి సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.
ఏడు రకాలు వరి విత్తనాలు అందుబాటులో..
వివిధ రకాలైన మేలురకం వరి విత్తనాలతో పాటు పచ్చిరొట్ట విత్తనాలైన జీలు గ, జనుము విత్తనాలు కూడా అందుబాటులో ఉంచింది. రైతుల అవసరాల మేర కు కంది, పెసర, మినుము, వేరుశనగ విత్తనాలు కూడా తెప్పించేందుకు చర్యలు తీసుకుంది. ఇప్పటికే 82 కేంద్రాల్లో విత్తన విక్రయాలు ప్రారంభించింది. ఏడు రకాల వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచింది. ఇందులో వరి సన్నరకం దొడ్డు రకం వరి విత్తరాలు అందుబాటులో ఉన్నాయి. 1759 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు పంపిణీ కేంద్రాలకు సరఫరా చేయగా, సంస్థలో 2379 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. రైతుల అవసరాల మేరకు విత్తనాలను తెప్పించనున్నారు. వరి 25 కిలోలు, జీలుగ 30 కిలోలు, జనుము 40 కిలోలు, వేరుశనగ 30, కంది, పెసర, మినుములు 4 కిలోల సంచుల్లో లభ్యమవుతున్నాయి. వీటిని ఉమ్మడి జిల్లాలోని ఆయా పంపిణీ కేంద్రాల ద్వారా రైతులకు విక్రయించనున్నారు. వీటితో పాటు అవసరమైన మేరకు పెసర, మినుములు కూడా తెప్పించేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. విత్తనాలకు ఎలాంటి కొరత ఉండదని, రైతుల అవసరం మేరకు తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. యాసంగి సీజన ముగియడంతో వానాకాలం సాగుకు రైతులు ఉపక్రమిస్తున్నారు. ఈమేరకు రైతులు విత్తన సేకరణలో నిమగ్నమై ఉన్నారు. విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు పాటించి, నాణ్యమైన విత్తనాలతో పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు.
అందుబాటులో ఉన్న వరి విత్తనాల ధరలు
విత్తన రకం కిలోలు ధర
బీపీటీ5204 25 రూ.1,030
ఆర్‌ఎన్నార్15048 25 రూ.1,020
కేఎనఎం1638 25 రూ.1,020
ఎంటీయూ1010 25 రూ.1,020
కేఎనఎం118 25 రూ.1,020
జేజీఎల్24423 25 రూ.1,020
జేజీఎల్27356 25 రూ.1,020
కందులు 4 రూ.520
పెసర 4 రూ.544
మినుములు 4 రూ.535
వేరుశనగ 30 రూ.3,624
పచ్చిరొట్ట విత్తనాల ధరలు
జీలుగ 30 రూ.4,905
జనుము 40 రూ.6,220
పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుముకు 50 శాతం సబ్సిడీ ఉంది.
విత్తన ఎంపికపై అవగాహన కల్పించాలి
విత్తనాల ఎంపికపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలి. ప్రతి సీజనలో కొందరు రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోవాల్సి వస్తోంది. నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి ప్రవేశించకుండా అధికారులు చూడాలి. రైతులకు అవసరమైన మేలురకం విత్తనాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి.
-బొల్లం బాలయ్య, రైతు, నిడమనూరు
మేలురకం విత్తనాలు ఎంపిక చేసుకోవాలి
పంటలు సాగు చేసేటప్పుడు రైతులు తప్పనిసరిగా మేలురకం విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. నాణ్యమైన విత్తనాలతో పంటలు సాగు చేస్తేనే అధిక దిగుబడులు పొందగలుగుతారు. నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఆకర్షణీయమైన ప్యాకింగులు చూసి మోసపోవద్దు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వ్యవసాయాధికారులకు సమాచారం ఇవ్వాలి.
-మునికృష్ణయ్య, ఏవో, నిడమనూరు
నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నాం
వానాకాలం సీజన సాగు కోసం ఉమ్మడి జిల్లాలోని రైతులకు అవసరమైన మేలు ర కం విత్తనాలు అందించేందుకు అన్ని చర్య లూ తీసుకుంటున్నాం.ఈమేరకు ఆయా జిల్లాల్లోని పంపిణీ కేంద్రాలకు విత్తనాలు సరఫరా చేశాం. నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడమే విత్తనాభివృద్ధి సంస్థ ముఖ్య లక్ష్యం. రైతుల మేలు కోసం సంస్థ కృషి చేస్తుంది..
సీహెచ. కృష్ణవేణి, రీజనల్ మేనేజర్, టీజీ సీడ్స్.