Share News

రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు

ABN , Publish Date - Apr 28 , 2026 | 11:52 PM

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు, శాస్త్రీయ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 27 నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, వచ్చే నెల 23వ తేదీ వరకు కొనసాగనుంది.

రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు

మే 23 తేదీ వరకు కార్యక్రమాలు

రైతులతో నేరుగా సమావేశాలు

వ్యవసాయరంగం బలోపేతం కోసం ప్రణాళికలు

(ఆంధ్రజ్యోతి,నల్లగొండ): వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు, శాస్త్రీయ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 27 నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, వచ్చే నెల 23వ తేదీ వరకు కొనసాగనుంది.

‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు ఎంపిక చేసిన గ్రామాలకు వెళ్లి రైతులకు ఆధునిక పద్ధతులు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందే మార్గాలను వివరిస్తారు. శాస్త్రీయ అవగాహనలో భాగంగా పంటలు, నేల ఆరోగ్యం, ఎరువుల వినియోగంపై రైతులకు తెలియజేస్తారు. ప్రధానంగా పలు కీలక అంశాల గురించి శాస్త్రవేత్తలు రైతులకు సవివరంగా సమాచారాన్ని అందిస్తారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, ఆధునిక సాగు పద్ధతులు, వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడం వంటివి తెలియజేస్తారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆయా యూనివర్సిటీల శాస్త్రవేత్తలు, విద్యార్థులు, వ్యవసాయ అధికారులు బృందాలుగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలపై

వ్యవసాయంలో తక్కువ పెట్టుబడులు పెట్టి అధిక లాభాలను ఎలా గడించాలనే దానిపై శాస్త్రవేత్తలు రైతులకు వివరిస్తారు. యూరియా వాడకం తగ్గింపు, సమతుల్య ఎరువుల వినియోగం, పంట మార్పిడి, మార్కెట్‌లో డిమాండ్‌లో ఉన్న విత్తనాల సాగు, సాగునీరు ఆదా, సేంద్రీయ వ్యవసాయం వంటి అంశాల గురించి రైతులకు సూచనలు చేస్తారు. అదేవిధంగా వరితో పాటు రైతులు పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పామాయిల్‌ తోటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించనున్నారు. ఇప్పటికే జిల్లాలో పప్పు దినుసుల పంటల సాగు తగ్గిపోవడంతో వస్తున్న ఇబ్బందులు ప్రభుత్వం రైతులకు తెలియజేయడంతో పాటు పప్పుదినుసు పంటల సాగు చేపట్టడానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చి ఈ పంటల విస్తీర్ణాన్ని పెంచనుంది. ఉద్యాన పంటల సాగుపై దృష్టిసారించడంతో పాటు కూరగాయల సాగును పెంపొందించడం కోసం కార్యచరణ ప్రకారం ముందుకు సాగనుంది. శాస్త్రవేత్తలతో పాటు ఏవో, ఏఈవోలు, ఏడీఏలు, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు రైతులతో మమేకమై జిల్లాలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యచరణను రైతులకు చేరవేయనున్నారు.

మే 4 నుంచి 9 వరకు పల్లెబాట

ఓ వైపు శాస్త్రవేత్తలు వచ్చే నెల 23వ తేదీ వరకు వ్యవసాయశాఖ అధికారులతో కలిసి ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలోనే ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యవసాయశాఖ ద్వారా మే 4 నుంచి మే 9 వరకు పల్లెబాట కార్యక్రమాన్ని ప్రజాపాలనలో భాగంగా నిర్వహించనుంది. ప్రతీ గ్రామంలోనూ వ్యవసాయశాఖ అధికారులు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రణాళికలను వివరిస్తారు. మంచి విత్తనాల ఎంపికతోపాటు పాటు నకిలీ విత్తనాలపై అప్రమత్తం చేస్తారు. నకిలీ పత్తి విత్తనాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఆరు రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలనలో సమగ్రంగా వివరాలు అందిస్తారు. మరో నెల రోజుల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభం కానుంది. మే నెలాఖరులో అకాల వర్షాలు కురిస్తే రైతులు పత్తి విత్తనాలు విత్తే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేయకుండా వారికి సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ప్రధానంగా భూత్‌పూర్‌ నుంచి నకిలీ విత్తనాలతో పాటు తెలంగాణ, ఏపీ సరిహద్దు నుంచి నకిలీ విత్తనాలు వచ్చే ప్రమాదం ఉండటంతో సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మొత్తానికి వచ్చే వానాకాలం సీజన్‌లో రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టనున్నారు. వరి విత్తనాలకు సంబంధించి నాణ్యమైన విత్తనాలు అందేలా, తాలు విత్తనాలు లేకుండా సమగ్ర పరిశీలన చేసి పంపిణీ చేయనున్నారు. అందులో భాగంగానే పల్లెలో ‘ప్రజాబాట’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

రైతులకు అవగాహన కల్పిస్తున్నాం: పి.శ్రవణ్‌కుమార్‌, జేడీఏ

జిల్లా వ్యాప్తంగా ‘రైతు ముంగింట్లోకి శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయశాఖ అధికారులతో పాటు శాస్త్రవేత్తలు సంయుక్తంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంటల మార్పిడి, శాస్త్రీయంగా సాగు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాల గురించి తెలియజేస్తున్నారు. ప్రతీ రైతుకు ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు చేరవేయడంతో పాటు పంటల సాగు ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కార్యచరణను సిద్ధం చేశాం. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు నేరుగా గ్రామాలకు వెళ్లి ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ఆధారంగా కార్యక్రమాలు చేపడతారు.

Updated Date - Apr 28 , 2026 | 11:52 PM