Share News

స్కూల్‌బస్‌.. ఫిట్‌లెస్‌

ABN , Publish Date - May 27 , 2026 | 11:57 PM

ప్రైవేట్‌ విద్యాసంస్థల యజమాన్యాలు స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. విద్యార్థుల నమోదును పెంచుకునేందుకు చేసే వివిధ ప్రయత్నాల్లో ఇందులో భాగంగా గ్రామాల నుంచి పిల్లలను పాఠశాలలకు తీసుకొచ్చేందుకు బస్సులను ఏర్పాటుచేస్తుంటారు.

స్కూల్‌బస్‌.. ఫిట్‌లెస్‌

సమీపిస్తున్న పాఠశాలల పునఃప్రారంభం గడువు

జిల్లాలో 350 స్కూల్‌ బస్సులకు, ఇప్పటికీ 37కి ఫిట్‌నెస్‌ పూర్తి

ప్రైవేట్‌ విద్యాసంస్థల యజమాన్యాలు స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. విద్యార్థుల నమోదును పెంచుకునేందుకు చేసే వివిధ ప్రయత్నాల్లో ఇందులో భాగంగా గ్రామాల నుంచి పిల్లలను పాఠశాలలకు తీసుకొచ్చేందుకు బస్సులను ఏర్పాటుచేస్తుంటారు. అయితే వాటి ఫిటనెస్‌ గడువు ఈ నెల 15వ తేదీతోనే ముగిసింది. త్వరలో విద్యాసంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించాల్సి ఉంది. అయినా చాలా పాఠశాలల యజమాన్యాలు స్పందిం చడం లేదు. ఇప్పటివరకు 37 బస్సులకు ఫిట్‌నెస్‌ చేయించగా ఇంకా 300కు పైగా బస్సులకు ఫిట్‌నెస్‌ చేయించాల్సి ఉంది.

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట క్రైం)

జిల్లాలో ప్రైవేట్‌ విద్యాసంస్థలకు చెందిన 350కి పైగా బస్సులు ఉన్నాయి. ఈ బస్సుల ఫిట్‌నెస్‌ మే 15తో ముగిసింది. ప్రతీ ఏడాది బస్సులకు సంబంధించి ట్యాక్సీ, బీమా, పొల్యూషన్‌, పర్మిట్‌, ఫిట్‌నెస్‌ తప్పనిసరిగా చేయించాల్సి ఉంటుంది. అందుకోసం రవాణా శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 37 బస్సులకు ఫిట్‌నెస్‌ చేయించగా ఇంకా 300కు పైగా బస్సులకు ఫిట్‌నెస్‌ చేయించాల్సి ఉంది.

గతేడాది బస్సులు సీజ్‌

జిల్లాలో జూనియర్‌ కళాశాలలు జూన 1న ప్రారంభం కానుండగా, పాఠశాలలు జూన్‌ 12న ప్రారంభం కానున్నాయి. ఫిట్‌నెస్‌ ఉంటేనే బస్సులు రోడ్లపై తిరగాలని, లేకుంటే సీజ్‌ చేస్తామని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులను చేరవేసే ప్రతీ వాహనం కూడా రవాణా శాఖ నిబంధనలకు లోబడి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా బస్సులు తిరగడంతో ప్రమాదాలు జరిగి నష్టం వాటిల్లే అవకాశాలు లేకపోలేదు. గతేడాది జిల్లాలో నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వచ్చిన మూడు విద్యాసంస్థల బస్సులను అధికారులు సీజ్‌ చేశారు.

పొంచి ఉన్న ప్రమాదం

ప్రైవేట్‌ విద్యాసంస్థల బస్సుల విషయంలో కొన్ని యజమాన్యాలు రవాణా శాఖ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొంతమంది ఇంకా బస్సులకు బీమా చెల్లించలేదు. అంతేకాక బస్సుల్లో ప్రథమ చికిత్స మందులు అందుబాటులో ఉంచడం లేదు. బస్సుల కండీషన సక్రమంగా ఉండడంలేదు. టైర్లు కాలం తీరి ఉంటున్నాయి. బస్సులు వెళ్లే సమయాల్లో టైర్లు ఎప్పుడు పగులుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అంతేకాక బస్సులు నడిపేందుకు 50ఏళ్ల లోపు ఉన్న వారినే డ్రైవర్లుగా నియమించుకోవాల్సి ఉండగా 60ఏళ్లు పైబడిన వారు విద్యాసంస్థల బస్సులను నడుపుతున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

పాటించాల్సిన నిబంధనలు

బస్సు ఇన్సూరెన్స్‌, పొల్యూషన్‌, పర్మిట్‌, ట్యాక్సీ చెల్లించి ఉండాలి.

సకాలంలో ఫిట్‌నెస్‌ చేయించాలి

ప్రథమచికిత్స బాక్స్‌ను ఏర్పాటుచేయాలి.

బస్సు వెనక కుడి, ఎడమవైపు ఇనుప జాలీలతో గ్రిల్స్‌ను ఏర్పాటు చేయాలి.

విద్యాసంస్థల పూర్తి వివరాలను బస్సుపై పూర్తిగా పేర్కొంటూ రాయాలి.

బస్సులో విద్యార్థులు ప్రయాణిస్తున్నారనే విషయాన్ని తెలిసేలా రాయాలి.

టైర్లు, లైట్లు సరిగా ఉండేలా చూడాలి.

సామర్థ్యానికి మించి విద్యార్థులను తీసుకెళ్లకూడదు.

డ్రైవర్‌కు బ్యాడ్జీ, హెవీ లైసెన్సు ఉండాలి.

డ్రైవర్‌ వయస్సు 50 ఏళ్లలోపు ఉండాలి.

రీఫ్రెష్‌ డ్రైవింగ్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌

ప్రైవేట్‌ విద్యాసంస్థల బస్సులను నడిపే డ్రైవర్లకు డ్రైవింగ్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే సంబంధిత విద్యాసంస్థల బస్సులను ఫిట్‌నెస్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకోసం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ ఎడ్యుకేషన అండ్‌ స్కిల్స్‌ శిక్షణ కేంద్రంలో మూడు రోజుల పాటు సంబంధిత డ్రైవర్లు శిక్షణ పొందాల్సి ఉంది. అనంతరం అక్కడి రవాణా శాఖ అధికారులు రీఫ్రెషర్‌ కోర్సు పూర్తిచేసినట్లు సర్టిఫికెట్‌ అందజేస్తారు. ఆ సర్టిఫికెట్‌ను విద్యాసంస్థల బస్సులను ఫిట్‌నెట్‌ చేయించే సమయంలో స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో అందజేయాల్సి ఉంది. సర్టిఫికెట్‌ అందజేసిన వారి బస్సులను మాత్రమే ఫిట్‌నెస్‌ చేయనున్నారు. కాకపోతే వేసవి సెలవులు దృష్ట్యా విద్యాసంస్థల బస్సులు నడిపే డ్రైవర్లు అందుబాటులో లేకపోవడంతో రీఫ్రెషర్‌ డ్రైవింగ్‌ శిక్షణ పొందడం ఆలస్యమవుతోంది. దీంతో పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ఖచ్చితంగా డ్రైవర్‌ రీఫ్రెష్‌ డ్రైవింగ్‌ శిక్షణ సర్టిఫికెట్‌ అందజేయాలని ఆదేశిస్తూ ఫిట్‌నెస్‌ చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యాక అధికారులు సంబంధిత వాహనాలను తనిఖీ చేసిన సమయంలో డ్రైవర్‌ రీఫ్రెష్‌ డ్రైవింగ్‌ సర్టిఫికెట్‌ చూపించాల్సి ఉంది. ఆ సమయంలో లేకపోతే కేసులు నమోదు చేస్తారు.

నిబంధనలు పాటించకుంటే సీజ్‌ చేస్తాం

ప్రైవేట్‌ విద్యాసంస్థలకు చెందిన బస్సులు రవాణా శాఖ నిబంధనల మేరకు నడవాల్సి ఉంది. లేకుంటే సీజ్‌ చేస్తాం. ఈ నెల 15తో బస్సుల ఫిట్‌నెస్‌ గడువు ముగిసింది. స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా ఫిట్‌నెస్‌ లేని బస్సులను గుర్తించి సీజ్‌ చేస్తాం. విద్యాసంస్థల యజమాన్యాలు విధిగా బస్సుల ఫిట్‌నెస్‌ చేయుంచుకోవాలి. డ్రైవర్లకు సిరిసిల్లలోని డ్రైవింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో మూడు రోజుల పాటు శిక్షణ ఇప్పించాలి. అక్కడ శిక్షణ పొందిన డ్రైవర్లనే విద్యాసంస్థల యాజమాన్యాలు నియమించుకోవాలి.

ఎస్‌ జయప్రకా్‌షరెడ్డి, జిల్లా రవాణాశాఖాధికారి

Updated Date - May 27 , 2026 | 11:57 PM