ఉపాధి బకాయిలకు మోక్షం
ABN , Publish Date - May 01 , 2026 | 12:09 AM
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీ) పథకం కింద కూలీలకు రెండున్నర మాసాలుగా నిలిచిన కూలి డబ్బుల చెల్లింపులకు మోక్షం లభించింది. 15రోజులకు ఒకసారి కూలీల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. సుమారు రెండున్నర నెలలుగా జమ కాకపోవడంతో చేసిన కష్టం ఎప్పుడు వస్తుందా.. అని ఎదురు చూశారు.
బ్యాంకు, పోస్టాఫీసుల్లో రూ.13కోట్లు జమ
రెండున్నర నెలలుగా ఎదురు చూస్తున్న కూలీలు
సకాలంలో డబ్బులు అందక కూలీల ఇబ్బందులు
యాదాద్రి, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీ) పథకం కింద కూలీలకు రెండున్నర మాసాలుగా నిలిచిన కూలి డబ్బుల చెల్లింపులకు మోక్షం లభించింది. 15రోజులకు ఒకసారి కూలీల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. సుమారు రెండున్నర నెలలుగా జమ కాకపోవడంతో చేసిన కష్టం ఎప్పుడు వస్తుందా.. అని ఎదురు చూశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు బకాయిలు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కూలీలకు పెండింగ్‌లో ఉన్న రూ.591 కోట్లకుగాను గత నెల 29వ తేదీన రూ.300కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఏప్రిల్ 29న కూలీల ఖాతాల్లో జమ చేసింది. దీంతో క్షేత్రస్థాయిలో ఉపాధి కూలీలకు గల బ్యాంకు ఖాతాలు, పోసాఫీసు సేవింగ్ ఖాతాల్లో నగదు జమ చేశారు. దాదాపు రెండున్నర మాసాలుగా కూలి చెల్లింపులు లేకపోవడంతో తమ ఖాతాల్లో జమచేసిన కూలి డబ్బులను డ్రా చేసుకుంటున్నారు.
రెండున్నర నెలలుగా ఎదురు చూపులు
జిల్లాలోని కూలీలకు ఫిబ్రవరి 6వ వరకు డబ్బులు చెల్లింపులు జరిగాయి. వేసవి కాలంలో అసలే వ్యవసాయ పనులు లేని తరుణంలో ఉపాధి కూలీల జీవనానికి ఈ పథకం అండగా నిలుస్తున్నప్పటికీ, సకాలంలో కూలి అందక ఇబ్బందులు పడ్డారు. పూట గడవడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. క్షేత్రస్థాయిలో పనుల పరిశీలనకు వెళ్లిన అధికారులను తమ కూలి డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారని కూలీలు పదే పదే అడుగుతుండటంతో అధికారులు ఉన్నతస్థాయిలో ఒత్తిడి పెంచారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్రానికి గల ఉపాధి హామీ పథకంలో కూలీలకు గల బకాయిల్లో రూ.300 కోట్లు విడుదల చేశారు. దీంతో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు గల కూలీల పనిదినాల ఆధారంగా కూలి డబ్బులను వారి ఖాతాల్లో జమచేశారు.
జిల్లాలో 4.40లక్షల పనిదినాలకు చెల్లింపు
జిల్లాలో ఫిబ్రవరి 7వ నుంచి కూలి డబ్బులు చెల్లింపులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు విడుదల చేసిన రూ.300 కోట్లను ఆయా జిల్లాలో ఉపాధి కూలీల పనిదినాల ప్రకారం కూలీల ఖాతాలకు చేసింది. విడుదల జరిగిన నిధుల సర్ధుబాటు ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 15వరకు చేసిన పనులకు కూలి డబ్బులను వారివారి ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. జిలాల వ్యాప్తంగా ఉపాధి కూలీలు చేసిన పనుల ప్రకారం సుమారు 5 లక్షలకుపైగా పనిదినాలకు చెల్లింపులు జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఫిబ్రవరి7వ తేదీ నుంచి ఏప్రిల్ 15 వరకు నమోదైన 4.40 లక్షల పనిదినాలకు సుమారుగా 13.50 కోట్లు కూలీల ఖాతాల ద్వారా చెల్లింపులు జరుగుతున్నట్టుగా . దాదాపు 71 రోజుల పాటు చేసిన 4.52 లక్షలల పనిదినాలకు తెలుస్తోంది.
జిల్లాలో ఉపాధి హామీ పథకం వివరాలు...
జారీ చేసిన మొత్తం జాబ్‌కార్డులు :1,43,080
నమోదైన ఉపాధి కూలీలు :2,61,897
క్రియాశీలక జాబ్‌కార్డులు :84,115
క్రియాశీలక ఉపాధి కూలీలు :1,17,775