విధులకు రాకున్నా వేతనం
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:27 AM
యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలో విధులకు రాకున్నా నెలనెలా వేతనం తీసుకుంటున్న వైనం వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని ఉపాధిహామీ కార్యాలయంలో ఈసీ(ఇంజనీరింగ్ కన్సల్టెంట్)గా జీ శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్నాడు. కాగా రోజూ హాజరు రిజిస్టర్‌లో సంతకం చేసి తిరిగి వెళ్లిపోతున్నాడు.
రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్తున్న ఉపాధి ఈసీ
ఆత్మకూరు(ఎం), జూలై 14 (ఆంధ్రజ్యోతి) : యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలో విధులకు రాకున్నా నెలనెలా వేతనం తీసుకుంటున్న వైనం వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని ఉపాధిహామీ కార్యాలయంలో ఈసీ(ఇంజనీరింగ్ కన్సల్టెంట్)గా జీ శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్నాడు. కాగా రోజూ హాజరు రిజిస్టర్‌లో సంతకం చేసి తిరిగి వెళ్లిపోతున్నాడు. పద్ధతి మార్చుకోవాలని అతడిని అధికారులు అనేకమార్లు మందలించడంతో పాటు హెచ్చరించారు. అయినా అతడి తీరులో మార్పురావడం లేదు. ఎవరినీ లెక్కచేయడంలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఉపాధి సిబ్బంది ప్రతిరోజూ సాయంత్రం నాలుగు గంటల తర్వాత మండల పరిషత కార్యాలయంలో రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్లానని ఎంపీడీవో ఆదేశాలు కూడా జారీ చేశాడు. అయితే విధులు ఉన్న రోజు ఉదయం మండల పరిషత కార్యాలయానికి అధికారులు ఎవరూ రాకమునుపే ఈసీ శ్రీనివాస్ వచ్చి హాజరురిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్తున్నట్లు సిబ్బంది తెలిపారు. అదేవిధంగా ఏదో ఒకరోజు వచ్చి అతడు చేయాల్సిన ఫైల్స్‌పై సంతకాలు చేసి వెళ్లిపోతాడని, అడిగితే కింది ఘర్షణకు దిగుతాడని సిబ్బంది వాపోయారు. ఈ విధానం కొన్నినెలలుగా కొనసాగుతున్నట్లు తెలిసింది. ఈసీ విధులకు వస్తున్నట్లుగానే ఎంపీడీవో కార్యాలయం వారు జిల్లాకు హాజరు నివేదిక పంపడంతో అతడికి వేతనం వస్తోంది. ఉపాధిహామీలో పనిచేస్తున్న సిబ్బందికి శ్రీనివాస్ టెక్నికల్‌గా సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. సాంకేతిక పరంగా టీఏలు చేసిన ఎంబీలు చూడాలి, చేయించిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. కానీ అతను కార్యాలయానికి సక్రమంగా రాకపోడంతో చాలాఇబ్బ ంది పడుతున్నట్లు సిబ్బంది తెలిపారు. 2020 నుంచి ఇక్కడే పనిచేస్తున్న శ్రీనివాస్ ఇదే తీరుతో వ్యవహరిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈసీ శ్రీనివాస్ మంగళవారం ఉదయం 10.15 నిమిషాలకు ఎంపీడీవో కార్యాయానికి వెళ్లి హాజరురిజిస్టర్‌లో సంతకం చేసి నేరుగా వెళ్లిపోయాడు. ఉపాధిహామీ కార్యాలయానికి వెళ్లిన ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించగా అతడు తన ఛాంబర్‌లో లేడు. ఈ విషయంపై వివరణ కోసం ఎంపీడీవోకు ఫోన చేయగా ఫోన లిఫ్ట్ చేయలేదు.
ఎంపీడీవోతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం
ఆత్మకూరు(ఎం) ఈసీ విఽధులకు డుమ్మా కొడుతున్న విషయాన్ని ఎంపీడీవోతో మాట్లాడతా. అతడి జీతం చేయాల్సింది ఎంపీడీవోనే. అనధికారికంగా గైర్హాజరైతే చర్యలు తీసుకుంటాం.
నాగిరెడ్డి, డీఆర్‌డీవో, యాదాద్రిభువనగిరి జిల్లా