సాగర్‌కు జ్వరమొచ్చింది
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:23 AM
నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో రోజు రోజుకూ జ్వర పీడిత రోగుల సంఖ్య పెరుగుతోంది. వానాకాలం ప్రారం భం కావడం, అడపాదడప వర్షాలు కురుస్తుండటంతో పారిశుధ్యం లోపిస్తోంది.
ఏరియా ఆస్పత్రికి పెరిగిన జ్వరపీడితులు
నిత్యం 20 మందికి పైగా..
నాగార్జునసాగర్, జూలై 9(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో రోజు రోజుకూ జ్వర పీడిత రోగుల సంఖ్య పెరుగుతోంది. వానాకాలం ప్రారం భం కావడం, అడపాదడప వర్షాలు కురుస్తుండటంతో పారిశుధ్యం లోపిస్తోంది. హిల్‌కాలనీ, పై లాన్ కాలనీల్లో రహదారుల వెంట పిచ్చి మొక్క లు ఏపుగా పెరిగాయి. అంతేగాక కొద్దిపాటి వర్షానికే వీధుల్ల్లో నీరు నిలిచి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. సాయంత్రం 6గంట లు దాటితే చాలు కాలనీల్లో దోమల మోత మోగుతోందని స్థానికులు వాపోతున్నారు. సాయంత్రం కాగానే ఇళ్లకు తలుపులు మూసి ఉంచుతున్నామని పేర్కొంటున్నారు. మునిసిపల్ అధికారులు కాలనీల్లో కనీసం ఫాగింగ్ కూడా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో పారిశుధ్యం లోపించి దోమలు ప్రబలుతుండంటంతో విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రికి రోజుకు 20 మందికి పైగా జ్వర పీడితులు చేరుతున్నారు. పలువురు ఇళ్ల వద్దే చికిత్స పొందుతున్నారు. మరికొంత మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. వెంటనే సాగర్‌లో పారిశుధ్య పనులు చేపట్టాలని, జ్వరాలు ప్రబలకుండా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలని స్థానికులు కోరుతున్నారు.
ఫాగింగ్ పనులు చేపట్టాలి : చర్క యాదగిరి, సామాజిక కార్యకర్త
నందికొండ మునిసిపాలిటీలోని హిల్‌కాలనీ, పైలాన్ కాలనీల్లో వీధుల్లో ప్రతీ రోజు మునిసిపల్ సిబ్బందితో ఫాగింగ్ చేయించాలి. వీధుల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చూడాలి. మురుగు నీటి గుంతల్లో బ్లీచింగ్ చల్లించాలి. పారిశుధ్యంపై దృష్టిపెట్టాలి.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : డాక్టర్ హరికృష్ణ, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్
వీధులు, ఇళ్లల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చూడాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు ప్రబలకుండా చూసుకోవాలి. జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే ఏరియా ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షులు చేయించుకోవాలి.